శ్రీమద్రామాయణం

om
om


రామ, రావణయుద్ధం ముగిసింది. రావణుడు చంపబడ్డాడు. రాముని ఆజ్ఞపై సీతాదేవిని తీసికొనివచ్చారు. ఆ తర్వాత జరిగిన కథ అంతా అందరికీ తెలిసిందే. ఆనాటి విషయాన్ని ఈనాటి దృక్పథంతో చూసి తప్పుపట్టరాదంటారు. సరే, ఆనాటి విషయాన్ని మనం ఈనాడు చదువ్ఞతున్నాం కాబట్టి ఈనాడు మనకున్న ఆలోచనాశక్తితో ఆనాడు అలాకాక ఇలా జరిగి ఉంటే ఇంకా బాగుండేదికదా అని చెప్పరాదా? చెప్పవచ్చు. ఎందుకంటే అది ఆనాటి కథ కదా అని దాన్ని మనం వదిలివేయలేదు. ఇంకా దాన్ని పట్టుకొని, దాన్ని పొగడుతూ, దాన్ని ఆదర్శంగా చూపుతూ ఉన్నాం. దాన్ని ఎంత పొగిడినా మంచిదేగానీ విమర్శించటం మంచిది కాదనే భావమే మంచిది కాదు. ఆనాడు అలా జరిగింది, అందరూ అలాగే యోచించేవారు. అందుకే అందరూ ఆనాడు పొగిడారు. మన పూర్వీకులు ఎలా ఆలోచిస్తారో మనమూ అలాగే ఆలోచిస్తే, వారు ఏమిటని పొగడితే మనమూ వాటినే పొగడితే, వారు ఏమిటని నిందిస్తే మనమూ వాటిని నిందిస్తే ఇక అభివృద్ధి, మార్పు ఎలా సాధ్యం? మన పూర్వీకులకంటే మనం ఉన్నతంగా, విశాలంగా నిష్పక్షపాతంగా ఆలోచించాలిగా? మెరుగులు దిద్ది, లోపాలను సరిదిద్ది రామాయణాన్ని ముందుకు తీసుకొని పోదాం. శ్రీరాముడిని మనం మర్యాద రాముడంటాం, ఆదర్శ పురుషుడంటాం. ఆదర్శం ఎక్కడి నుంచి మొదలుకావాలి? తన నుంచేగా? పన్నెండేళ్ల ఎడబాటు తర్వాత భార్యాభర్తలు కలుసుకోవలసి వస్తే, శీలాన్ని గూర్చి నిరూపించుకోవలసి వస్తే ముందు ఎవరు ఆ పని చేసి ఇతరులకు ఆదర్శం కావాలి? పురుషుని మనసు చలించే అవకాశాలే ఎక్కువ. పైగా మూడువందల యాభై మంది భార్యలు కాకపోయినా ముగ్గురు భార్యలు గల తండ్రికి పుత్రుడాయె శ్రీరాముడు. తాను సంకల్పించుకొన్న ఏకపత్నీవ్రతం భగ్నం కాలేదని నిరూపించవలసి వస్తే ముందు ఆయన అగ్నిగుండం ముందు నిలబడి పంచభూతాల సాక్షిగా నేను ఏకపత్నీవ్రతుడనే అయినా ఏ ప్రమాదం సంభవింపక నేను బయటపడుదును గాక! అని అందరి ఎదుట చెప్పి అగ్నిగుండంలోకి దూకి, క్షేమంగా బయటికి వచ్చి ఉండవలసింది. ఆ తర్వాత ఆయన చూపిన ఆదర్శాన్ని సీత అందుకొని ఆచరించి ఉంటే ఆనాటి ప్రజలు, మహర్షులే కాదు ఈనాటి విమర్శకులు, మేధావ్ఞలు కూడా శ్రీరాముడిని కీర్తించేవారు. శ్రీరాముని ప్రవర్తనలోగానీ, వాల్మీకి మహర్షి రచనా నైపుణ్యంలోగానీ దోషాలను ఎవరూ ఎత్తి చూపే అవకాశమే ఉండేది కాదు. ఎన్నెన్నో మార్పులు, చేర్పులతో రకరకాల రామాయణాలు వచ్చినా ఇంకా అక్కడక్కడ ఇలాంటి లొసుగులుండటం ఆశ్చర్యకరమే.
‘ఆనాటి సంఘ పరిస్థితులను మనం గుర్తుపెట్టుకోవాలి. పురుషులు స్త్రీలను అనుమానించవచ్చు. ప్రశ్నించవచ్చుగానీ స్త్రీలు పురుషులను అనుమానించరాదు, ప్రశ్నించరాదు. పురుషులకు ఎంతమంది స్త్రీలతో అయినా సంబంధం ఉండాలి. ‘ఆనాటి పరిస్థితుల్లో అది ఒప్పే అని మన ప్రవచనకారులు ఎంత సమర్ధించి చెప్పినా అయితే ఆనాటి ఆ సంఘానికి సరిపోయిన ఆ కథను ఈనాడు, ఈ సంఘానికి ఎందుకు చెబుతారు? అని ప్రశ్నిస్తే ఎంతటి గొప్ప ప్రవచనకారుడైనా నీళ్లు నమలాల్సిందే. ఔను, అలాకాక ఇలా జరిగింటే ఇంకా బాగుండేది అనటమే సముచితంగా ఉంటుంది, సమకాలీనులను తృప్తిపరచినట్టు ఉంటుంది. రామాయణం లాంటి గ్రంధం మార్పు చెందుతూ, మెరుగులు దిద్దుకుంటూ భవిష్యత్తు తరాలవారికి చేరాలన్నదే నా కోరిక. మార్పు చేసే ఆ మహాత్ముడెవరో? ఆధ్యాత్మిక రామాయణంలో వ్యాసుడు కొన్ని మార్పులు చేసి రాశాడు. రామచరిత మానసలో తులసీదాసు కొన్నిటిని మార్చాడు. భగవాన్‌ సత్యసాయి ఎంతో మార్చి రామకథను చెప్పాడు. వారందరికీ వందనాలు.

  • రాచమడుగు శ్రీనివాసులు