వినాయక చవితి.. పురాణ కథలు!

ganesh
ganesh


సూత మహాముని శౌనకాది మహామునులకు విఘ్నేశ్వరుని కథ ఇలా చెప్పాడు. ‘పూర్వము గజ రూపములో ఉన్న ఒక రాక్షసుడు పరమశివుని కొరకు ఘోరమైన తపస్సు చేసాడు. అతని తపస్సుకు మెచ్చిన భోళాశంకరుడు ప్రత్యక్షమై ‘భక్తా! నీ కోరికేమిటి అని అడుగగా ఆ రాక్షసుడు స్వామీ! నీవు ఎల్లప్పుడూ నా ఉదరంనందే నివసించాలి అని కోరతాడు. శివుడు అతని కోరిక మన్నించి గజాసురుని కడుపులో నివసిస్తుంటాడు. ఈ విషయం పార్వతీదేవికి తెలిసి చాలా విచారించి మహావిష్ణువును ప్రార్థించి ‘ఓ దేవదేవా! ఇంతకు ముందు నా భర్తను భస్మాసురుని బారి నుంచి కాపాడావు. ఇప్పుడు కూడా ఏదైనా ఉపాయంతో కాపాడమని వేడుకుంటుంది. అంత శ్రీహరి ఆమెకు ధైర్యం చెప్పి పంపిస్తాడు. గంగిరెద్దు మేళం సరైన ఉపాయంగా తలచిన శ్రీహరి నందీశ్వరుని గంగిరెద్దుగా, బ్రహ్మాది దేవతలను వివిధ వాయిద్యకారులుగా మార్చి, గజాసురుని పురానికి వెళ్లి సన్నాయి స్వరాలతో నందిని ఆడించారు. దానికి తన్మయుడైన గజాసురుడు ‘ఏం కావాలో కోరుకొమ్మ న్నాడు. అందుకు విష్ణుమూర్తి ‘ఈ నందీశ్వరుడు శివున్ని వెతుక్కుంటూ వచ్చాడు కనుక నీ ఉదరంలో ఉన్న శివున్ని ఇవ్ఞ్వ అని అడిగాడు. అది విని ఆ కోరిక కోరింది మహావిష్ణువే అని గ్రహించి తనకు మరణం తప్పదని, శివునితో ‘నా శిరస్సును మూడులోకాలు ఆరాధించేలా అనుగ్రహించి, నా చర్మాన్ని నీ వస్త్రముగా ధరించమని వేడుకుంటాడు. శివ్ఞడు అభయమిచ్చిన తరువాత నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చగా శివుడు బయటకు వచ్చి శ్రీహరిని స్తుతించాడు. అప్పుడు విష్ణుమూర్తి ‘దుష్టులకిలాంటి వరాలిస్తే పాముకు పాలు పోసి పెంచినట్లవుతుందని చెప్పి అంతర్ధానమయ్యాడు.
విఘ్నేశాధిపత్యం : ఒకరోజు దేవతలు, మునులు పరమేశ్వరుని దగ్గరకు వెళ్లి ‘ మాకు విఘ్నాలు కలుగకుండా ఉపాయం చెప్పమని కోరుతారు. ఇందుకు పరిష్కారంగా శివుడు, గజాననుడు, కుమారస్వామిని పిలిచి పోటీ పెడతాడు. ‘మీలో ఎవరైతే ముల్లోకాలలోని అన్ని పుణ్యనదులలో స్నానం చేసి ముందుగా వస్తారో వారినే అధిపతిగా చేస్తానంటాడు. అందుకు అంగీకరించిన కుమారస్వామి తన నెమలివాహనం ఎక్కి వెళ్లిపోతాడు. గజాననుడు మాత్రం ‘తండ్రీ! నా బలాబలాలు తెలిసి మీరిలాంటి షరతు విధించడం సబబేనా? నేను మీ పాద సేవకుడిని, నా మీద దయ తలచి తరుణుపాయం చెప్పమని కోరతాడు. అంతట శివుడు ఈ మంత్రం చెపుతాడు. ‘సకృత్‌ నారాయణే త్యుక్త్వా పుమాన్‌ కల్పశత త్రయం! గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక! కుమారా! ఇది నారాయణమంత్రం ఒకసారి జపిస్తే మూడు వందల కల్పాలు పుణ్యనదులలో స్నానం చేసినట్లవుతుంది అని శివుడు వివరిస్తాడు. గజాననుడు భక్తి శ్రద్ధలతో మంత్రం జపిస్తూ తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తాడు. అక్కడ కుమారస్వామికి మూడు కోట్ల యాభై నదులలో ఏ నదికి వెళ్లినా గజాననుడు అప్పటికే నదిలో స్నానం చేసి తనకెదురు వస్తున్నట్లు కనిపించేవాడు. అన్ని నదులూ తిరిగి కైలాసానికి వచ్చేసరికి అన్నగారు తండ్రి పక్కనే ఉన్నాడు. తన అహంకారానికి చింతించి, ‘తండ్రీ! అన్నగారి మహిమ తెలుసుకోలేక పోయాను. ఆధిపత్యం అన్నగారికి ఇవ్వండి అంటాడు. అలా విఘ్నేశాధిపత్యం గజాననుడికే లభించింది. భాద్రపద శుద్ధ చవితి రోజున ప్రజలు భక్తితో విఘ్నేశ్వరుణ్ని కొలుస్తారు.

  • బి.మీనాక్షి