వరకట్నం లేని సమాజం కోసం పోరాటం

ranjana kumari, shruti kapoor
ranjana kumari, shruti kapoor


మహిళలపై జరుగుతున్న దాడులు అతివలపై సాగుతున్న ఆకృత్యాలు వరకట్న వేధింపులు వారిని స్త్రీ సాధికారత కోసం పాటుపడేలా చేశాయి. ఆ కృషే తాజాగా విడుదలైన గ్లోబల్‌ ఇంటర్నెట్‌ ఫ్లాట్‌ఫాం జెండర్‌ పాలసీ 100 మంది అత్యంత ప్రభావశీలుర జాబితాలో వీరికి స్థానం కల్పించింది.
ఆ సంఘటనతో
ఈమె పేరు రంజనా కుమారి. స్వస్థలం ఉత్తరప్రదేశలోని వారణాసి. ఢిల్లీలోని జెఎన్‌యూలో రాజకీయ శాస్త్రంలో పిహెచ్‌డి పూర్తి చేశారు. ఎన్నో ఏళ్లుగా దక్షిణాసియాలో మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నారు. 1976లో వరకట్నం కోసం అత్తింటివారు పెట్టే బాధలు భరించలేక ఒక మహిళ రంజన ఇంటికి దగ్గర్లోనే మరణించింది. ఈ సంఘటన ఆమెను కలచివేసింది. ఆ క్షణంలో మహిళల శ్రేయస్సు కోసం ఏదైనా చేయాలనుకున్నారు. అప్పటి నుంచి అతివల అభ్యున్నతి కోసం అనేక సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. మహిళా సాధికారత మీద ఇప్పటివరకూ తొమ్మిది పుస్తకాలు రాశారు. వాటిల్లో ‘బ్రైడ్స్‌ ఆర్‌ ఆర్‌ నాట్‌ బర్నింగ్‌ అనే పుస్తకం ప్రపంచ గుర్తింపు పొందింది.

‘భ్రూణ హత్యలు, వరకట్నం లేని సమాజం, మహిళలపై హింస లేని ప్రపంచం చూడాలనేది నా కల అని చెప్పే రంజనా కుమారి వీటి కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం గ్లోబల్‌ సేఫ్టీ అక్వైజరీ బోర్డ్‌ ఆఫ్‌ ఫేస్‌బుక్‌, ట్విటర్స్‌ ట్రస్ట్‌ అండ్‌ సేఫ్టీ కౌన్సిల్‌లో సభ్యురాలిగా చేస్తున్నారు. ఆమె కృషికి ప్రతిష్ఠాత్మకమైన లోటస్‌ లీడర్‌షిప్‌ అవార్డు కూడా వచ్చింది. ‘జెండర్‌ పాలసీ జాబితాలో ప్రభావశీలుడైన 100 మందిలో నేనూ ఉండటం గౌరవంగా భావిస్తున్నా. నాతోపాటు ఇందులో చోటు సంపాదించిన వారికి అభినందనలు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అలుపెరగకుండా లింగ సమానత్వం, సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నారనడానికి ఈ జాబితాయే నిదర్శనం. మహిళల సమానత్వం సాధించడం కోసం ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి అని అంటారామె.
అత్యాచారం చూసి చలించి


శ్రుతీ కపూర్‌ది కాన్పూర్‌. అమెరికాలో ఆర్థిక శ్స్తాంలో పిహెచ్‌ పూర్తి చేశారు. ఆమో సామాజిక వ్యాపారవేత్త. 2012లో దేశ రాజధానిలో ఒక విద్యార్థినిపై కొందరు పైశాచికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఇది ఆమెను చలించేలా చేసింది. మహిళలు, బాలికలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారిని రక్షించాలనే ఉద్దేశంతో 2013లో సేఫ్టీ ఫౌండేషన్‌ను ప్రారంభించారు. ఇది మహిళా విద్య, ఆన్‌లైన్‌ సదస్సులు, ఆత్మరక్షణ కార్యశాలలు నిర్వహిస్తోంది. మహిళల చట్టాలు, న్యాయపరమైన సదస్సుల్లో ఆమె పాల్గొన్నారు. అవార్డులూ అందుకున్నారు. వీరిద్దరూ కాకుండా మరో ఐదుగురు ప్రవాస భారతీయ మహిళలు కూడా ఆ వందమంది జాబితాలో స్థానం సంపాదించుకోవడం నిజంగా గర్వకారణమే.