మహిళల రాజకీయ సాధికారతపై చిత్తశుద్ధిఏదీ?

india village women
india village women

మహిళా రిజర్వేషన్ల గురించి గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం జరుగుతూనే ఉంది. ఆయాపార్టీలు తమ ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన తర్వాత ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడం దానికి తగిన మద్దతు లేక నీరుగారిపోవడం జరుగుతుంది. 1996లో తొలుత మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రతిపాదించారు. చట్టసభల్లో మూడోవంతు స్థానాలను మహిళలకు కేటాయించాలని ఈ బిల్లు నిర్దేశించింది. ఏకాభిప్రాయం లేదన్న పేరిట ఈ బిల్లు ఆమోదానికి నోచుకోలేదు. మహిళారిజర్వేషన్‌ బిల్లుపై రాజకీయ ఏకాభిప్రాయం లేదు కనుక ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరించాలంటూ సూచనలు వస్తున్నాయి. అప్పట్లో యుపిఎ ప్రభుత్వం కూడా ఒక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. పార్లమెంటు స్థానాలను ప్రస్తుతం ఉన్న 543 స్థానాల నుంచి 900 స్థానాలకు పెంచాలి. అలాగే రాష్ట్రాల శాసనసభల్లో ప్రస్తుతమున్న 6000 స్థానాల నుంచి 9000 స్థానాలకు పెంచాలి. ఇలా సీట్లను పెంచి మూడోవంతు స్థానాలను మహిళలకు కేటాయించాలి. ఇది కూడా తప్పుడు వాదనే. పెంచిన వాటిలోనే మూడోవంతు మహిళలకు కేటాయిస్తే వాస్తవంలో లభించేది 11 నుండి 12 శాతం మేరకే. అంకల గణితం తెలిసిన ఎవరికైనా ఇది అర్ధమవ్ఞతుంది. ఒకవేళ సీట్లను పెంచిన తర్వాత మొత్తంలో మూడోవంతు మహిళలకు కేటాయించవచ్చు. కానీ సీట్లను పెంచాలంటే చాలా తతంగముంటుంది. నియోజక వర్గాల డీలిమిటేషన్‌ జరగాలి. అంటే ఈ ప్రతిపాదనను కనుక ఆమోదిస్తే 2019 నాటికి కూడా మహిళారిజర్వేషన్లు అమలు కావ్ఞ. మహిళల కోసమంటూ చట్టసభల సీట్లు పెంచితే సంఖ్య పెరిగి వాటి పనితీరే దెబ్బతింటుంది. చట్టసభల్లో స్థానాలను రిజర్వ్‌ చేయడం కాదు. రాజ్యాంగ సవరణ అవసరం లేకుండానే ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణ చేయడం ద్వారా ప్రతి పార్టీ తప్పనిసరిగా మూడోవంతు స్థానాల్లో మహిళా అభ్యర్థులను నిలబెట్టేలా చట్టం చేయాలి. ఇటీవల బిజెపి కూడా ఇదే ప్రతిపాదన చేసింది. ఈ వాదన పైకి ఆకర్షణీయంగా కనపడ్డా లోతుగా పరిశీలిస్తే ఇందులోని మోసం కనిపించకమానదు. చిత్తశుద్ధిలేని రాజకీయ పార్టీలు ఓడిపోయే స్థానాల్లో మహిళలను నిలబెట్టి చట్టపరంగా వ్యవహరించామంటూ చేతులు దులుపేసుకుంటాయి. ఫలితంగా పోటీ చేసిన అభ్యర్థులలో మూడోవంతు ఉంటారు గాని గెలిచిన వారిలో మూడోవంతు మహిళలుండరు. మహిళలు కోరుకునేది పోటీ చేయడం మాత్రమే కాదు గెలవడం.
రాజకీయపార్టీలు ఈ విధంగా ఓడిపోయే స్థానాల్లో మహిళల్ని నిలపకుండా ప్రత్యామ్నాయ సూచనలు వస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లోనయినా ప్రతి రాష్ట్రంలోనూ మూడోవంతు స్థానాలలో మహిళా అభ్యర్థులను నిలపాలి. దానివల్ల రాజకీయ పార్టీలు ఓడిపోయే స్థానాలలో మహిళలను పెట్టకుండా నివారించవచ్చు. అయితే ఈ వాదన కూడా సరైంది కాదు. మనదేశంలో రెండు పార్టీల వ్యవస్థ లేదు. ప్రధాన జాతీయ రాజకీయ పార్టీలు కూడా ఒక రాష్ట్రంలో అన్ని జిల్లాలో బలంగా లేవ్ఞ. ఒక రాష్ట్రంలో ప్రతి ప్రధాన రాజకీయ పార్టీలకి కూడా తప్పనిసరిగా ఓడిపోతామని తెలిసిన సీట్లు మూడోవంతుకన్నా ఎక్కువే ఉండవచ్చు. ఇదేవిధంగా ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతి జిల్లాలోను, అన్ని ప్రాంతాలలో సమానంగా బలం కలిగిలేదు. ఇక్కడంతా మహిళలకే టిక్కెట్లు ఇస్తారు. ఈ విధంగా సాధికారతకు ఉద్దేశించిన నిబంధనలు ప్రహసనంగా మిగిల్చే ప్రమాదం పొంచి ఉంది. ఈ రాజకీయ వాస్తవాలను గమనించకుండా ప్రత్యామ్నాయ ప్రతిపాదలను సూచించడం సరైందికాదు. అయినా ఇలాంటి ప్రతిపాదనలు చేసేవారు ప్రపంచదేశాల అనుభవాలను ఈ సందర్భంగా ఉటంకిస్తూ ఉంటారు. అనేక దేశాల్లో రాజకీయ పార్టీలే మూడోవంతు మహిళా అభ్యర్థులను నిలబెట్టే విధానాలు అమలవ్ఞతున్నాయి. ఇది మనదేశంలో ఎందుకు చేయకూడదు? కారణం ఇతర దేశాల్లో ఎన్నికల విధానాల్లో ఉన్న తేడాను ఇక్కడ గమనించాలి. అనేక దేశాలలో పార్టీ టిక్కెట్లలో మూడోవంతు స్థానాలను మహిళలకు ఇవ్వాలన్న నిబంధ ఉంది.
దామాషా పద్ధతి అంటే?
అయితే ఈ దేశాలలో దామాషా పద్ధతి అమలులో ఉంది. దామాషా పద్ధతి అంటే ఎన్నికలలో పోటీ చేసే రాజకీయ పార్టీకి వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి సీట్లు కేటాయిస్తారు. ఉదాహరణకు ఒక పార్టీ వంద అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తుంది. కానీ, ఆ పార్టీకి వచ్చిన సీట్లను బట్టి 20 స్థానాలే వచ్చాయనుకోండి. జాబితాలో ఉన్న మొదటి 20మంది గెలిచినట్లు ప్రకటిస్తారు. పార్టీ టిక్కెట్లలో మహిళలకురిజర్వేషన్‌ ఉన్న 25 దేశాలలో ఈ విధమైన దామాషా పద్ధతి అమలులో ఉంది. ఇలాంటి పద్ధతిలో పార్టీ అభ్యర్థులలో మూడోవంతు మహిళలను రిజర్వ్‌ చేసినా సరిపోతుంది. ఇక్కడ కూడా రాజకీయ పార్టీలు ఒక మోసం చేయవచ్చు. జాబితాలో చివరన మహిళలను ఉంచితే మహిళా అభ్యర్థులు గెలవరు. ఇక్కడ దామాషా పద్ధతి అమలులో ఉంది. మహిళా సంఘాలు పార్టీ అభ్యర్థుల జాబితాలలో మొదట్లో మహిళలుండాలని డిమాండ్‌ చేశాయి. దానితో పార్టీలు తమ అభ్యర్థుల జాబితాలలో మొదట్లో మహిళలను పెట్టాయి. ఫలితంగా దక్షిణాఫ్రికా పార్లమెంటులో 30 శాతం మహిళలున్నారు. అందువల్ల పార్టీ అభ్యర్థులలో మూడోవంతు మహిళలను నిలబెట్టే నిబంధన విధించే ముందు ఎన్నికల పద్ధతిని మనదేశంలో మార్చాల్సి ఉంటుంది. దామాషా పద్ధతిని ప్రవేశపెట్టాలి. ఇక మరికొన్ని ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను చూద్దాం. మూడోవంతు స్థానాల్లో ద్వంద్వ సభ్యుల విధానాన్ని ప్రవేశపెట్టాలి. అంటే మూడోవంతు స్థానాల్లో ఒక జనరల్‌ సభ్యుడు. ఒక మహిళా సభ్యురాలు ఉంటుంది. ఈ విధమైన ప్రతిపాదన వల్ల చట్టసభల్లో సంఖ్యాపరంగా మహిళలూ ఉండవచ్చు. కాని వాస్తవంలో మహిళల పాత్ర అలంకార ప్రాయంగానే మిగులుతుంది. మహిళలు కోరుతున్నది అలంకారప్రాయమైన ప్రాతినిధ్యం కాదు. వివాదాన్ని తగ్గించేందుకు మహిళలకు మూడోవంతు స్థానాలు కాకుండా పదిశాతమో, పదిహేను శాతమో కేటాయించి కాలానుగుణంగా పెంచవచ్చన్నది మరో వాదన. ఇక మూడోవంతు స్థానాల్లోకి ప్రవేశించాలంటే మరో వందేళ్లు పడుతుంది. అందుకే పసలేని ప్రత్యామ్నాయాలని పక్కపెట్టాలి.
రాజీకయ పార్టీలకు చిత్తశుద్ధి ఏది?
మహిళలకు మూడోవంతు స్థానాన్ని రిజర్వ్‌ చేసే చారిత్రాత్మకబిల్లుకు కొనసాగుతున్న గ్రహణాన్ని అర్ధం చేసుకోవాలంటే లింగవివక్షతతో కూడిన భారతరాజకీయ సంస్కృతిని అవగాహన చేసుకోవాలి. లింగ వివక్షను రాజకీయాల నుంచి తొలగించాలన్న చిత్తశుద్ధి మన రాజకీయ పార్టీలకు లేదు. చట్టసభల్లో తక్కువ ప్రాతినిధ్యం ఉండటమే లేదు. ప్రభుత్వంలోను, పార్టీ అంతర్గత వ్యవహారాల్లోను మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత చూస్తే రాజకీయ చిత్తశుద్ధి కొరవడటం కొట్టివచ్చినట్లు కనబడుతుంది. ఉదాహరణకు మహిళలు ప్రధాన మంత్రులయ్యారు. ముఖ్యమంత్రులయ్యారు. కాని మహిళా మంత్రులకు శాఖలు కేటాయించాల్సి వచ్చేసరికి వారికి లభించేవి ప్రధానంగా స్త్రీశిశు సంక్షేమ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ, క్రీడలు, సమాచార శాఖల్లాంటివి. ప్రభుత్వ విధానాలపై బలమైన ప్రభావాన్ని చూపే హోం, రక్షణ, ఆర్థిక, విదేశాంగ, భారీ పరిశ్రమలులాంటి కీలక శాఖలు మహిళలకు ఇప్పుడిప్పుడే లభిస్తున్నాయి. సుష్మాస్వరాజ్‌ గత బిజెపి ప్రభుత్వంలో విదేశవ్యవహార మంత్రిగాను, నిర్మలాసీతారామన్‌ రక్షణశాఖమంత్రిగా పనిచేసారు. ప్రస్తుతం నిర్మలాసీతారామన్‌ బిజెపి-2 పాలనతో ఆర్థికమంత్రిగా పనిచేస్తున్నారు. సుశీలాగోపాలన్‌ ఒకప్పటి కేరళ పరిశ్రమల శాఖామంత్రిగా పనిచేశారు. కీలకస్థానాల్లో బిజెపి మహిళామంత్రులను నియమించి, గొప్ప సాహసం చేయడం మాత్రమే కాదు మహిళలకు తగిన గౌరవాన్ని కూడా ఇచ్చింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో సిఎం జగన్‌మోహన్‌రెడ్డి మేకతోటి సుచరిత అనే మహిళను హోంమంత్రిగా నియమించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో కాంగ్రెస్‌పార్టీకి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సిఎంగా ఉన్న సమయంలో సబితాఇంద్రారెడ్డిని హోంశాఖమంత్రిగా నియమించారు. ఇలా గత పదేళ్ల నుంచి కీలకశాఖలలో అటు కేంద్రప్రభుత్వం, ఇటు రాష్ట్రాల ప్రభుత్వాలు మహిళలకు ప్రాధాన్యత నిస్తున్నాయి కాని దీన్ని మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.