ప్రేమాదరణలకు పంపకాలా!

మనస్విని

(ప్రతి శనివారం)

LADY
LADY

ప్రేమాదరణలకు పంపకాలా!

నమస్కారం మేడమ్‌, నా పేరు సుధావాణి. మేం ముగ్గురు అక్కచెల్లెలం. మాకు పెళ్లిళ్లు అయ్యాయి. ఈ మధ్యనే మా అమ్మగారు చనిపోయారు. అందుకని మా నాన్నగారు మా ముగ్గురి ఇంటికి వస్తుంటారు. మేం ముగ్గురం ఉద్యోగాలు చేస్తున్నాం. గత నెల నుండి మా నాన్నగారి ఆరోగ్యం బాగుండటం లేదు. ఆసుపత్రిలో పదిరోజులు ఉండి ఇంటికి తీసుకొచ్చాం. ఇంట్లో ఉండి మా నాన్నకు మంచి, చెడు చూసేందుకు ఎవరూ లేరు. అతనికి కావలసినవన్నీ సమకూర్చి ఆఫీసుకు వెళ్లడం రోజూ ఆలస్యం అవ్ఞతుంది. దీంతో నేను ఆఫీసులో కూడా ఇబ్బందులు పడుతున్నాను. మా నాన్నగారి అనారోగ్యం వలన ఎవరికీ మనశ్శాంతి లేదు. దీనివల్ల మా అక్కచెల్లెళ్ల మధ్య గొడవలు మొదలయ్యాయి. నాకు వీలుకాదు నాకు వీలుకాదు అని మా అక్కలు తప్పించుకొని భారాన్ని అంతా నామీద పెడుతున్నారు. ఇటువంటి పరిస్థితులోె ఎలా నెట్టుకురావాలో నాకు అర్ధం కావడం లేదు. ఒకవేళ నేను ఉద్యోగం మానేస్తే ఈ సమస్యలకు తెరదించినట్లు అవ్ఞతుందంటారా? లేదా లేనిపోని కొత్త సమస్యలు మొదలవుతాయంటారా? ఇటువంటి ఆలోచనలతో నా బుర్ర గిర్రుమని తిరుగుతుంది. దయచేసి నా సమస్యను అర్ధం చేసుకొని సరైన దిశమార్గం చూపగలరని ప్రార్థిస్తున్నాను.

– సుధావాణి, ఆదిలాబాద్‌
మీరు తప్పక ఈ సమస్యల నుండి సత్వరమే బయట పడగలరు. ముందుగా మీరు మీ ఆలోచనా తీరు మార్చుకోవాలి. ప్రతిదానినీ సమస్యగా భావించడం మానివేయాలి. సానుకూలగా, పాజిటివ్‌గా ఆలోచించాలి. ఎన్నో రకాలుగా సమస్యను పరిష్కరించుకోవచ్చు. మీనాన్నగారి దగ్గర నర్సుని నియమించవచ్చు. లేదా మీరందరూ ఒకరి తర్వాత ఒకరు చక్కగా చూచుకోవచ్చు. ఇలా అనేక రకాలుగా సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఆనందంగా మీనాన్నగారిని చూచుకోవచ్చు. పెద్దవారిని, ప్రేమగా, ఆప్యాయతగా చూసుకోవాలి. గౌరవించాలి. వృద్ధులకు ప్రేమ, ఆప్యాయతలు ఎంతో అవసరం. వారి మనసును నొప్పించరాదు. ఆనందంగా, ఆహ్లాదంగా, ప్రేమగా ఆయనను తప్పక చూచుకోవాలి. దైనందిన జీవితం ఎంతో ఉత్సాహకరంగా మలచుకోవాలి. జీవితం అమూల్యమైన కానుక. చక్కగా ఉల్లాసభరితంగా మలచుకోవాలి. ఇది తప్పనిసరి.

పాపతో మనసు విప్పి మాట్లాడండి

నమస్తే అమ్మగారు. నాపేరు ప్రమీల. నాకు ఒక కూతురు. ఇప్పుడు ఏడవ తరగతి చదువ్ఞతుంది. పాప చిన్నప్పుడే పుష్పవతి కావడం వలన చూసేందుకు ఇంటర్‌ పూర్తి చేసిన అమ్మాయిలాగా కనిపిస్తుంటుంది. అంటే అంత పెద్దమ్మాయిలాగా కనిపిస్తుంది. దాంతో నేను పాపని అబ్బాయిలతో ఆడుకోవటానికిగాని, మాట్లాడటానికిగాని అనుమతి ఇవ్వటం లేదు. చుడీదార్‌కి చున్నీ వేసుకోవాలి పాప అంటే నా మాట వినదు. అమ్మాయికి పద్ధతులు, సంస్కారం నేర్పటం లేదని ఇటువైపు నా భర్త నన్ను తిడుతున్నారు. చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలే ఉన్నాయి. ఇలా వీళ్ళిద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను. దయచేసి నేను మా అమ్మాయికి తన పెరుగుదల గూర్చి, సంఘం గూర్చి ఏవిధంగా నేను వివరించి అర్ధమయ్యేలా చెప్పాలి? దయచేసి సరైన సూచనలు తెలియచేయగలరని ఆశిస్తున్నాను.
– ప్రమీల, దిల్‌సుఖ్‌నగర్‌

మీరు తప్పక ఈ విషయంపై అవగాహన పెంపొందించుకోగలరు. కౌమారదశ (టీనేజ్‌)లో ఉన్న పిల్లలను అర్ధం చేసుకోవాలి. ఓపెన్‌ కమ్యూనికేషన్‌ ఉండాలి. స్నేహితులుగా మెలగాలి. మనసు విప్పి మాట్లాడుకోవాలి. వారి మానసిక శాస్త్రం తెలుసుకోవాలి. ఏ విషయానైన్నా అర్ధం అయ్యేలా తెలియచెప్పాలి. తప్పక మాట వింటారు. ఇందులో సందేహం లేదు. ప్రవర్తనా నిబంధనలు ఆచరించే వీలుగా ఉండాలి. వారి అభిరుచికి తగినట్లుగా ఉండాలి. ఆరోగ్యకరంగా ఉండాలి. ఏదిఏమైనా ఆరోగ్యకరమైన నిబంధనలలోనే అందరూ మసలుకోవాలి. మీ అభిప్రాయాలను పిల్లలపై బలవంతంగా ఆపాదించరాదు. వారికి స్వేచ్ఛ నివ్వాలి. చక్కని ప్రవర్తనను అలవర్చుకొంటారు. ఎన్నో పరిశోధనల ద్వారా తేలింది ఇదే. ఎవరినైతే, ప్రేమగా, లాలింపుతో పెంచుతారో ఆ పిల్లలు సర్వతోముఖాభివృద్ధి చెందుతారు. జీవితంలో వృద్ధిలోనికి వస్తారు. ఆనందంగా జీవిస్తారు. వారిలోని సామర్థ్యాలు శ్రేయస్కరంగా ఉంటాయి.

-డాక్టర్‌ శారద, సైకాలజీ ప్రొఫెసర్‌