ప్రవర్తన-పరివర్తన

                                  ప్రవర్తన-పరివర్తన

BHAGAVAD GITA
BHAGAVAD GITA

మనిషైనా పరిస్థితులలోనే జీవిస్తూ ఉంటాడు. పరిస్థితులు అందరికీ ఉంటాయి, ఎప్పుడూ ఉంటాయి. కాని పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగ ఉండవ్ఞ. మార్పు చెందుతూ ఉంటాయి. ఒక మనిషి మనతో ఎప్పుడూ ఒకేవిధంగా ప్రవర్తిస్తాడని చెప్పలేము. బుతువ్ఞలు మారుతూ ఉంటే బాహ్యంలో వాతావరణం మారినట్లు ఎదుటి వ్యక్తి స్వభావాన్ని బట్టి అతని ప్రవర్తన మారుతూ ఉంటుంది. దాని ప్రభావం మనమీద పడుతూ ఉంటుంది. ఈ మారుతున్న పరిస్థితుల వల్లనే మనకు దుఃఖం. కాబట్టి ఈ మారుతున్నటువంటి పరిస్థితుల్ని నేనెలా అర్థం చేసుకోవాలి? వాటి మధ్య నేనెలా చరించాలి అనేదే మన ముందున్న ప్రశ్న. పరిస్థితుల్ని అర్థం చేసుకోవడంలో నేను ఉన్నదానిని చూస్తున్నానా, లేక నాలో ఉన్నదానిని చూస్తున్నానా అనేది ప్రధానమైన విషయం. నాలో ఉన్నదానిని చూస్తే అది దృక్పథం. ఉన్నదానిని ఉన్నట్లుగా చూడటం సత్యపథం. అంటే రాగద్వేషాల రంగుటద్దాలలో నుండి చూడటం దృక్పథం. రాగద్వేష రహితంగా చూడటం సత్యపథం. కాబట్టి పరిస్థితులు మనిషికి సమస్యగా మారేది అవి అర్థం కానపుడే. సమస్య అర్థం కానపుడే మనిషి పరిష్కారానికై వెదుకుతాడు. పరిష్కారం ఎప్పుడూ కూడ క్రొత్త సమస్యల్ని సృష్టిస్తుంది.

అవగాహన సమస్యని అదృశ్యం చేస్తుంది. పరిస్థితి ఎప్పుడైతే ఉన్నదున్నట్లుగా అర్థమౌతుందో అప్పుడు ఏ పరిస్థితిలో ఏం చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది మనకు సుస్పష్టంగా అర్థమౌతుంది. దీనినే యుక్తచేష్ట అంటాము.
యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు
యుక్త స్వప్నావ బోధస్య యోగో భవతి దుఃఖహాII
(భగవద్గీత 6వ అధ్యాయం-17వశ్లో)
మితమైన ఆహారవిహారములు, మితమైన నిద్రయు, మెలకువయు గలవానికి, కర్మల యందు ఉచితరీతిన చరించువానికి ఈ యోగము దుఃఖమును పోగొట్టును! కాబట్టి యుక్తచేష్ట అనేది కూడా యోగమే. ఈ యోగం దుఃఖాన్ని హరిస్తూ ఉంది. యుక్త చేష్ట ఎప్పుడైతే అలవడుతుందో పరిస్థితులు మారినా వాటివల్ల మనకు దుఃఖం కలగదు. మనిషికి జ్ఞానముంది, స్పూర్తిఉంది, శక్తి ఉంది, యుక్తి ఉంది, ఓర్పు ఉంది, తీర్పు ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాని పరిమితంగా ఉన్నాయి. శక్తులైతే పరిమితంగా ఉన్నాయి కాని వాటిని ఉపయోగించుకునే స్వేచ్ఛ అతనికి ఉంది. ఈ స్వేచ్ఛను ఎప్పుడు ఎలా వినియోగించుకుంటాడు అనే దానిని ఆధారం చేసుకుని ప్రవర్తన పరివర్తన వైపు తిరుగుతుంది. కాబట్టి పరిస్థితులు మారడం వల్ల దుఃఖమైతే, ఆ మారే పరిస్థితుల్లోనే ప్రవర్తన పరివర్తన వైపు మరలితే సుఖం. కాబట్టి వ్యక్తి తాను ఉన్న పరిస్థితిని ఉన్నదున్నట్లుగా అర్థం చేసుకోవడం ఆ తరువాత పరిస్థితికి అనుగుణంగా, అంటే ఏం చేయాలో, ఎందుకు చేయాలో, ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో సుస్పష్టంగా ఎరిగి చేయడమే యుక్తచేష్ట. యుక్త చేష్ట ద్వారానే ప్రవర్తన పరివర్తనగా మారుతుంది. పరివర్తన వచ్చినప్పుడే మారుతున్న పరిస్థితుల మధ్య మనిషికి సుఖం. మనిషిలో వచ్చిన పరివర్తన వల్ల ప్రపంచం మారదు. పరిస్థితులు మారవ్ఞ. వ్యక్తులు మారరు. సమస్యలు పోవ్ఞ. మరి ఏం జరుగుతుంది? మనిషిలో వచ్చిన పరివర్తన వల్ల సమస్యలు ఉంటాయి కానీ వాటిని అర్థం చేసుకుంటాడు కనుక వ్యక్తి బాధపడడు. రాగద్వేషాలు కలిగి ఉంటాడు కానీ వాటికి వశపడడు. ఏ మనిషి విూద రాగముండదు. ఎవరిమీద ద్వేషముండదు. ఇక్కడ నుండి జరిగేదంతా యుక్తచేష్టయే. రాగద్వేషాలు తటస్థపడితే కోరలు తీసిన పాములాగా అవి మనలను బాధించవ్ఞ. రాగద్వేషాలు తటస్థపడినపుడే మనిషి నడుపబడకుండా జ్ఞానంతో నడిచేవాడు అవ్ఞతాడు. నడుపబడేవాడు అర్జునుడు. నడిపేవాడు శ్రీకృష్ణుడు. అందుకే ఆయన విజయసారథి, పార్థసారథి. రాగద్వేషాలు తటస్థపడినపుడే దృక్పథం సత్యపథంగా మారి మనిషి ప్రవర్తన పరివర్తనకు దారితీస్తుంది.
– చైతన్యానంద