పిల్లలకు చెప్పే విధానం

PARENTS
PARENTS

పిల్లలకు చెప్పే విధానం

పిల్లలకు మంచి మాటలు చెపుతున్నామని తల్లిదండ్రులు అనుకుంటారు. చాలా సార్లు పిల్లలపై ఆ మాటలేవీ పెద్దగా ప్రభావం చూపించవు దానికి కారణం కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల మాటల్ని కాకుండా, అస్తమానం వాళ్లు చేస్తున్న పనుల్ని పసిగడుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే తల్లిదండ్రులు చెప్పే మాటల కన్నా వాళ్ల పనితనం వల్లే ఎక్కువగా ప్రభావితం అవుతుంటారు. మిగతా విషయాలు ఏం తెలిసినా తెలియకపోయినా, మాటలు చెప్పడం చాలా సులువని, వాటిని ఆచరణలో పెట్టడం కష్టమనే విషయం వారికి బాగా తెలుసు. ఎప్పుడైనా పిల్లలు తమ స్నేహితులతో ఉన్నప్పుడు వాళ్ల మాటల్ని గమనిస్తే ఆ విషయం తెలుస్తుంది.

మాటలకేం బాగా చెపుతావు కానీ చేతలకైతే పనికిరావు అంటూ విరుచుకుపడుతుంటారు. అలాగని పెద్ద పెద్దవాళ్ల మాటలను పిల్లలు పెడచెవిన పెడతారని కాదు. వాళ్ల మాటల్ని కూడా వింటారు. కాకపోతే ఆ మాటల్లో కొంత నిజాయితీ ఉండాలి. అదెలాగంటే నిజానికి ఈ రోజున మీకు మేము చూపుతున్న మార్గంలో ఎలా నడవాలో చెప్పిన వారు గానీ, అలా నడుస్తున్నప్పుడు ఎదురయ్యే అడ్డంకుల్ని ఎలా అధిగమించాలో చెప్పిన వారు గానీ ఆ రోజుల్లో మాకు తారసపడలేదు. మమ్మల్ని మేమే ఉత్సాహపరుచుకుని, మాకు మేముగా వెళ్లాలనుకున్నా, ఆ మార్గంలో నడవడానికి అవసరమైన కనీస వసతులు కూడా మాకు ఆ రోజుల్లో లేవు. ఆ కారణంగా మేము బాగా నష్టపోయాం. అందువల్ల మాకు జరిగిన కష్టాలు, నష్టాలు మీకు ఎదురుకాకూడదని, ఉన్నంతలో మీకు అవసరమైన ఏర్పాట్లను అందించేందుకు మేము ప్రయత్నిస్తుంటాము వాటిని మీరు అందిపుచ్చుకుని మీరైనా కాస్త శ్రమిస్తే మా కన్నా ఎంతో కొంత మెరుగైన జీవితాన్ని అందుకోగలుగుతారు. అలా కాకుండా మీరే చేయలేనివి మాకెందుకు చెబుతారు? అంటే మేమింక ఏమీ మాట్లాడలేం. కాకపోతే అంతిమంగా మీరు నష్టపోవడం ఖాయం లాంటి మాటలు వారికి చెప్పగలగాలి. ఆ మాటల్లోని వాస్తవికత, నిజాయితీ వారి మనసుకు తాకుతాయి. వాళ్లను ఒకింత మెరుగైన స్థితికి చేరుస్తాయి.