నేటి అలంకారం : శ్రీరాజరాజేశ్వరీదేవి

నేటి అలంకారం

SRI RAJA RAJESWARI ALAMKARAM

SRI RAJA RAJESWARI ALAMKARAM

(విజయవాడ కనకదుర్గ అమ్మవారు)
శ్రీరాజరాజేశ్వరీదేవి

శరన్నవరాత్రి ఉత్సవాలలో దశమి తిధిన మంగళవారంనాడు శ్రీదుర్గమ్మవారు శ్రీరాజరాజేశ్వరీదేవిగా దర్శనమిస్తారు. శరన్నవరాత్రి ఉత్సవాలలో శ్రీఅమ్మవారి చివరి రూపం శ్రీరాజరాజేశ్వరీదేవి. సకల భువన బ్రహ్మాండాలకు శ్రీరాజరాజేశ్వరీదేవి ఆరాధ్యదేవత. మహాత్రిపుర సుందరిగా శ్రీరాజరాజేశ్వరీదేవి త్రిపురాత్రయంలో పూజలందుకుంటుంది. పరమేశ్వరుడి అంకం శ్రీరాజరాజేశ్వరీదేవికి ఆసనం. శ్రీరాజరాజేశ్వరీదేవి సింహాసనంపై ఆసీనురాలై ఉంటుంది. షోడశ మహామంత్రస్వరూపిణి, మహాత్రిపురసుందరి, శ్రీచక్ర అధిష్ఠానదేవత శ్రీరాజరాజేశ్వరీదేవి. శ్రీరాజరాజేశ్వరీదేవిని ‘అపరాజితాదేవి గా కూడా భక్తులు పూజించే ఆచారం ఉంది. శ్రీరాజరాజేశ్వరీదేవి స్వప్రకాశ జ్యోతి స్వరూపిణి. విజయదశమి అపరాజితాదేవి పేరు మీద ఏర్పడింది. విజయాన్ని సాధించింది కాబట్టి విజయ అని అంటారు. శ్రీచక్ర అధిష్ఠానదేవత శ్రీలలితాదేవే రాజరాజేశ్వరీదేవి. పరమశాంతి స్వరూపంతో చిరునవ్వులు చిందిస్తూ చెరుకుగడ చేతితో పట్టుకొని దర్శనమిస్తుంది. మణిద్వీపంలో శ్రీపురంలోని చింతామణి గృహమధ్యస్థం శ్రీరాజరాజేశ్వరీదేవి నివాసం. సువర్ణ సింహాసనం మీద ఉంటుందని ప్రతీతి. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను శ్రీరాజరాజేశ్వరీదేవి తన భక్తులకు వరాలుగా అనుగ్రహ్తిస్తుంది. శ్రీరాజరాజేశ్వరీదేవి యోగమూర్తి. మాయా మోహిత మానవ మనోచైతన్యాన్ని శ్రీరాజరాజేశ్వరీదేవి ఉద్దీపితం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రానికి శ్రీరాజరాజేశ్వరీదేవి అధిష్టాన దేవత. విజయదశమినాడు శ్రీరాజరాజేశ్వరీదేవిని సేవిస్తే అన్నింటా విజయం సాధిస్తారు. అలంకారం: ఆకుపచ్చ వర్ణం లేదా లేత కనకాంబరం వర్ణం కలిగిన పట్టుచీరతో అలంకరిస్తారు. మంత్రం: ” ఐం క ఏ ఈల హ్రీం, క్లీం హసకహల హ్రీం సౌః సకల హ్రీం అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. శ్రీలలితా సహస్రనామం పారాయణ చేసి కుంకుమార్చన, సువాసినీ పూజ చెయ్యాలి. వీలైనవారు శ్రీచక్రార్చన చేస్తే మంచిది. నివేదన: అమ్మవారికి లడ్డూలు నివేదన చేయ్యాలి.