నిర్మల ఖ్యాతి

Nirmala seetaraman1
Nirmala seetaraman

 నిర్మల ఖ్యాతి

ఆమె ఒక సాధారణ గృహిణిగా తన జీవితాన్ని ఆరంభించారు. కుటుంబమే తన జీవితంగా భావించారు. ఇంటి బాధ్యతలు, అత్తింటివారికి సేవలు చేయడంలో ఆనందం దాగి ఉందని ఆమె భావన. భర్త ప్రేమ, అత్తింటి వారి ప్రోత్సహం ఇంకేమి కావాలి ఒక గృహిణికి. అవే ఆమెను దేశంలో ఒక ఉన్నతమైన స్ధానానికి నడిపిస్తాయని ఆమె ఊహించలేదు. సింపుల్‌గా ఉండడమే ఆమెకు పెద్ద అలంకరణ. ఎలాంటి గర్వపుభావాలు ఆమె ముఖంపై కనిపించవ్ఞ. అంకితభావంతో పనిచేయడమే ఆమె నైజం. అందుకే ఆమెకు రక్షణ మంత్రిగా ఉన్నత పదవి లభించినా, అదే నిరాడంబరత, అదే విధేయత కనబర్చే ఆమె ఎవరో కాదు నిర్మాలాసీతారామన్‌. వాణిజ్యశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్న నిర్మాలాకు కీలకరంగమైన రక్షణశాఖ మంత్రిగా బాధ్యతలను చేపట్టారు. ఇందిరాగాంధీ తర్వాత రక్షణ శాఖ బాధ్యతలు చేపడుతున్న రెండో మహిళ నిర్మాలా సీతారామన్‌. అందునా పూర్తిస్థాయిలో దేశరక్షణ మంత్రిత్వశాఖను చేపట్టిన తొలి మహిళ నిర్మలానే కావడం విశేషం.

అప్పట్లో ఆమెకు బిజెపి నాయకురాలు సుష్మాస్వరాజ్‌తో పరిచయం ఏర్పడింది. ఆమె భావాలు, వాక్చాతుర్యం మెచ్చిన సుష్మ నిర్మలను బిజెపికి పరిచయం చేశారు. అలా 2006లో నిర్మల రాజకీయాల్లో చేరారు. 2010లో బిజెపి జాతీయ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. హిందీ, ఇంగ్లీషు భాషలపై గొప్ప పట్టు ఉండడం ఆమెకు మరింత కలిసొచ్చాయి. 2014 ఎన్నికలకు ముందు మోడీ ఫర్‌ పిఎం ప్రచారంలో ఆమె కీలకపాత్ర పోషించారు. అతిసామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి దేశానికి అత్యంత కీలకమైన రక్షణశాఖ బాధ్యతలు తీసుకునే స్థాయికి ఎదగడం వెనక ఎన్నో ఉన్నాయి. నిర్మల పుట్టింది తిరుచ్చిరాపల్లి. అక్కడనే ఆమె డిగ్రీ చదివారు.

ఆ తర్వాత ఢిల్లీ జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ, ఎంఫిల్‌ చేశారు. జేఎన్‌యూలో ఉన్నంతకాలం ఆమె అక్కడి ‘ది ఫ్రీ థింకర్స్‌ సంస్థని ఏర్పాటు చేశారు. వామపక్ష భావజాలానికి పేరుపొందిన జేఎన్‌యూలో అటు వామపక్షం, ఇటు దక్షణపక్షం రెండు భావజాలాల్లోని మంచివాటిని ప్రోత్సహించే రాజకీయ సంఘం ఇది. ప్రభాకర్‌ పరిచయమైంది దీని ద్వారానే. ఈ ఆలోచనా ధోరణే నిర్మలని ప్రత్యేకంగా నిలిపింది. దీనివల్లే లండన్‌లో గృహాలంకరణ వస్తువ్ఞలమ్మే షాపులో ఓ మామూలు సేల్స్‌గాళ్‌గా పనిచేయగలిగిన ఆమె. ప్రైస్‌ వాటర్‌హౌస్‌ వంటి దిగ్గజ ఆర్థిక సంస్థలో విశ్లేషకురాలిగా పెట్టుబడి వ్యవస్థ గుట్టుమట్లనీ పట్టుకోగలిగారు. ‘ఈ మేనేజ్‌మెంట్‌ గుణాలే రాజకీయ నాయకురాలిగా నన్ను ప్రత్యేకంగా నిలిపాయి అనిపిస్తోంది అంటారు నిర్మల. ఆమె రాజకీయాల్లోకి రాకముందు మహిళా కమిషన్‌లో ఉన్నారు. అందులో ఆమె క్రియాశీలకపాత్రే భాజపా దృష్టిలో పడేలా చేసింది. సినిమా పరిశ్రమలోని సాంకేతిక వర్గంలో మహిళలు ఎదగడానికి అవకాశమే ఉండేదికాదు.

అంటే, వాళ్లు సినిమాటోగ్రాఫర్‌గానో, మేకప్‌ ఆర్టిస్టుగానో, ఎడిటర్‌గానో ఉండటానికి వీల్లేదు. ఇంకెవరో మగవారు నిర్మాతలతో ఒప్పందం కుదుర్చుకుంటే అతణ్నుంచి సబ్‌-కాంట్రాక్ట్‌ తీసుకునే మహిళలు పనిచేయాలి. అందువల్ల వీళ్లకి సగం పారితోషకం కూడా వచ్చేది కాదు. దీంతో మాకు సభ్యత్వం కావాలంటూ మహిళలు మహిళా కమిషన్‌ వద్దకు వచ్చారు. దీనికి ఆమె అంగీకరించారు. దీని అమలుకోసం ప్రత్యేక ప్యానెల్‌ ఏర్పాటు చేశారు. దీనిపై సినిమారంగంలోని పెద్దల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది.

పట్టుబట్టి మరీ వాళ్లకి సభ్యత్వం ఇప్పించేదాకా ఆమె నిద్రపోలేదు. ప్రజాజీవితంలో ఆమె తొలివిజయం ఇదేనని చెప్పాలి. అలా సాంకేతిక రంగంలో ఉన్న మహిళలకి కొత్త అవకాశాల తలుపులు తెరుచుకున్నాయి. తన శాఖకింద ఉన్న ప్రభుత్వ పరిశ్రమల్లోనూ ఇలాంటి మహిళల్ని గుర్తించి, కీలక బాధ్యతలు అప్పగించారు. 2010 నుంచి నాలుగేళ్లపాటు భాజపా అధికార ప్రతినిధిగా ఆమెని ప్రత్యేకంగా నిలిపింది. టివి వివాదాల్లో మిగతా రాజకీయ నాయకులందరూ పెద్దఎత్తున అరుస్తుంటే చాలా తార్కికంగా, సౌమ్యంగా వాదన వినిపించేవారు. కుటుంబ నేపధ్యం నిర్మలది సామాన్య కుటుంబం. పరకాల వాళ్లు స్థితిమంతులు. రాజకీయ పలుకుబడి ఉన్నవాళ్లు. పైగా భాషవేరు.

అలాంటి కుటుంబంలోకి మెట్టిన కొద్దిరోజుల్లోనే తలలో నాలుకైపోయారు నిర్మల. లండన్‌ నుంచి వచ్చాక పాప వాజ్ఞ్మయికు జన్మనిచ్చారు. ఆమెని హైదరాబాద్‌లో పెంచారు. ప్రణవ స్కూల్‌ను ఏర్పాటు చేశారు. అత్తయ్యతోపాటూ నిర్మల తల్లిదండ్రులు సీతారామన్‌, సావిత్రి హైదరాబాద్‌లోని నార్సింగ్‌లోనే ఉండేవారు. వాళ్లనీ, అటు స్కూలుని, చూసుకుంటూనే ఉన్నారు. ప్రణవంతో ఆంధ్రప్రదేశ్‌లో విద్యావేత్తగా పేరుతెచ్చుకున్నారు. అది ఆమెకి మహిళా కమిషన్‌ స్థానంలో నిలబెట్టింది. పాప ఇప్పుడు అమెరికాలో ఉన్నత విద్యనభ్యసిస్తున్నది.