తులసి తీర్థమెంతో విశిష్టం!

           తులసి తీర్థమెంతో విశిష్టం!

tulasi puja
tulasi puja

భారతీయ సంస్కృతిలో తులసికి ప్రత్యేకస్థానం ఉంది. తులసి అంటే సాటిలేనిది అని అర్ధం. అందుకనే హిందువ్ఞలు దీనిని పరమపవిత్రమైనదిగా భావిస్తారు. హిందూ సాంప్రదాయాలను పాటించేవారు. పెరటివైపున తప్పకుండా తులసిమొక్కను పెంచుతారు. సిమెంట్‌ లేక రాతితో కట్టిన తులసికోటలో మొక్కల్ని పాతి శ్రద్ధతో, భక్తితో పెంచుతారు. తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణం చెయ్యడం, నీరు పోయడం, తులసి తీర్థం సేవించడం ఇప్పటికీ అనేక గ్రామాలలో కన్పిస్తుంది. చనిపోయే ముందు తులసి తీర్థం నోటిలో పోస్తే ఉత్తమగతులు లభిస్తాయని అంటారు. తులసి విశిష్టత, ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం.
తులసి మొక్క దైవపరంగానే కాకుండా, సాంప్రదాయ వైద్యపద్ధతుల్లో విరివిగా ఉపయోగిస్తుంది. ఎన్నో వేల సంవత్సరాల నుండి తులసి ఆయుర్వేద వైద్యంలో ప్రత్యేక స్థానం సంపాదించింది. అనేక ఆయుర్వేద మందుల తయారీలో తులసిని వాడతారు. తులసి ఆకులు, గింజలు, కాండం వేళ్లు అనేకరకాలుగా పనికొస్తాయి. తులసిని లక్ష్మీదేవిగా భావించి పూజిస్తారు. తులసి రాధ మరోరూపంగా భావిస్తారు. కార్తీక శుద్ధ ద్వాదశినాడు తులసి పూజ చేయడం పరిపాటి.

వైష్ణవ్ఞలైతే కార్తీకమాసమంతా తులసిని శ్రద్ధతో ఆరాధిస్తారు. వైష్ణవదేవాలయాల్లో తులసి తీర్థం ఇస్తారు. తులసి మాలతో, జపం అత్యంత ఫలదాయకం. విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైనది తులసి. విష్ణువ్ఞను తులసిదళాలతో పూజిస్తారు. శాస్త్రీయంగా…: తులసి శాస్త్రీయనామం ‘ఆసిమమ్‌ సాంక్టమ్‌ ‘లామినేసి కుటుంబానికి చెందిన తులసి మంచి సుగంధభరిత మొక్క. దీనిలో అనేక రకాలు ఉన్నాయి. వీటిలో కృష్ణతులసి, లక్ష్మితులసి ముఖ్యమైనవి. ఆయుర్వేదంలో కృష్ణతులసిని విరివిగా వాడతారు. తులాంశ్యతి ఇతి తులసి అని అంటారు.

‘తు అనగా మృత్యువ్ఞ. ‘లపతి అనగా ధిక్కరించునది. మృత్యువాత అనగా అపమృత్యు భయం నుండి కాపాడుతుంది అని వివరణ వైద్యపరంగా తులసి అసమానమైనది. అందుకనే ప్రాచీన ఆయుర్వేద వైద్యశ్రేష్టులైన చరకుడు. శుశ్రూతుడు తులసి అనేక వైద్యపరమయిన ఉపయోగాలను వివరించారు. పద్మ, స్కాంద, మాఘ, వాయు, బ్రహ్మవైవర్త, గరుడ వంటి అనేక పురాణాల్లో తులసి మహాత్మ్యం వివరించబడింది. ప్రాచీనకాలం నుండి విశ్వసిస్తున్న తులసి ఔషధ గుణాలను నవీనవైద్యం, రీసెర్చి కూడా అంగీకరించింది. ఇది శాస్త్రీయంగా రుజువ్ఞపరచబడింది.

రసాయనికంగా: పప్పుదినుసులలో తులసి ఆకులు కలిపితే అవి పుచ్చకుండా ఉంటాయి. కీటకాలు దరిచేరలేవ్ఞ. తులసి నుండి వెలువడే కొన్ని Iవోలటైల్‌ ఆయిల్స్‌ వాతావరణంలోకి విస్తరిస్తాయి. అందువలన కొన్ని రకాల సూక్ష్మజీవ్ఞలు నశిస్తాయి. తద్వారా వాతావరణం శుభ్రపడుతుంది. పెరటివైపున, ముఖ్యంగా పల్లంగా ఉండే ఈశాన్య దిక్కున తులసిని పెంచాలనడంలో ఆంతర్యం ఇదే అయి ఉండవచ్చు. తులసిలో అనేక ఆవశ్య ఆమ్లాలు అయి ఉండవచ్చు.

తులసిలో అనేక ఆవశ్య ఆమ్లాలు ఉన్నాయి. సీటోస్టోల్‌, ఆలిక్‌, లినోలిక్‌, పామిటిక్‌, సీరిక్‌, ఒలియానోలిక్‌, ఆర్మోలిక్‌, రోజ్‌మారినిక్‌ ఆమ్లాలు ముఖ్యమైనవి. ఇంతేకాకుండా యూజెనాల్‌ వంటి ఔషధ యుక్తమైన రసాయనాలు కూడా ఉన్నాయి. ఔషధ గుణాలున్న తులసి, సాధారణ రుగ్మతలకు ఇవి దివ్యౌషధంగా పనిచేస్తుంది. అనేక ఆయుర్వేద మందుల్లోనూ ఉపయోగిస్తున్నారు. ఏ వ్యాధులకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.

పిల్లల్లో వచ్చే రుగ్మతలకు: చిన్నపిల్లల్లో వచ్చే సాధారణ సమస్యలైనటువంటి జలుబు, దగ్గు, డయేరియాకు తులసి మంచి ఔషధం, పిల్లలకు చికెన్‌పాక్స్‌ వస్తే తులసిని కుంకుమపువ్ఞ్వతో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఒత్తిడి నుంచి విముక్తి: యాంటీ స్ట్రెస్‌ ఏజెంట్‌గా పనిచేస్తుంది. తులసి ఆకులు ఒత్తిడి నుంచి రక్షణ కన్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఇటీవల పరిశోధనల్లో వెల్లడయింది. 12తులసి ఆకులను రోజుకు రెండుసార్లు తీసుకుంటే ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. ఆరోగ్యంగా ఉన్నవారు రోజూ తీసుకోవచ్చు.

ఇది రక్తాన్ని శుభ్రపరుస్తుంది. నోటి సంరక్షణ: ప్రతిరోజు తులసి ఆకులను నమలడం వల్ల నోటిలో వచ్చే అల్సర్‌ ఇతర వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. కీటకాలు కుట్టినపుడు: ఏదైనా కీలకం కుట్టినపుడు తులసి ఆకులతో చేసిన జ్యూస్‌ తీసుకుంటే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. కుట్టిన చోట తులసి రసాన్ని పెట్టినా ఉపశమనం లభిస్తుంది. తులసి వేర్లను పేస్టుగా చేసి కుట్టిన చోట పెడితే నొప్పిని హరిస్తుంది. రింగ్‌వార్మ్‌, దురద తదితర చర్మ వ్యాధులకు తులసి రసం మంచి ఔషధం తెల్లమచ్చలకు (ల్యూకోధర్మా) కూడా ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.

దంతక్షయానికి: తులసి ఆకులను ఎండలో పెట్టి పౌడర్‌గా చేసుకుని టూత్‌పౌడర్‌గా ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. నోటి దుర్వాసనను అరికడుతుంది. ఇతర దంత సమస్యలు కూడా దూరం అవ్ఞతాయి. తలనొప్పి నివారణకు: తలనొప్పికి తులసి దివ్యౌషధం. దీని ఆకులతో చేసిన డికాషన్‌ తీసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. గంధంతో తులసి ఆకుల పేర్లను కలిపి పెట్టుకుంటే తలనొప్పి తగ్గడంతో పాటు శరీరంలో నుంచి వేడిని తొలగిస్తుంది.

జీర్ణశక్తికోసం: ప్రతిరోజు తులసి ఆకులు తీసుకుంటే జీర్ణశక్తి పెరుగుతుంది. జీర్ణసంబంధమైన వ్యాధులు తొలగిపోతాయి. మూత్రపిండాల్లో రాళ్లకు: మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నట్లయితే తులసి రసాన్ని తేనెతో కలిపి నెలరోజుల పాటు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మూత్రనాళం ద్వారా రాళ్లు పడిపోయేలా ఈ మిశ్రమం పనిచేస్తుంది.