డ్రింక్‌ తాగాలన్నా…!

2dff
డ్రింక్‌ తాగాలన్నా…!

మండిపోతున్న ఎండలకు బాగా నోరు ఆరిపోతుందని కూల్‌డ్రింకులు తాగేస్తున్నారా! ఇలా తాగడం మంచిది కాదని అంటున్నారు పంటినిపుణులు. బాగా కూలింగ్‌ కూల్‌డ్రింకులు, ఐస్‌క్రీములు తినడం వల్ల పంటికెలాంటి నష్టాలో తెలుసుకుందామా! కూల్‌డ్రింకులు, ఐస్‌క్రీములు తీసుకునేటపుడు పళ్లు జివ్వున లాగుతుంటాయి కొందరికి. స్నాక్స్‌, ఫుడ్‌ తీసుకుంటున్నపుడు పళ్లు నొప్పులు, నమల నీయకపోవటం ఉంటున్నాయంటే మీ పళ్లు అరిగి పోయాయనే భావించాలంటున్నారు వైద్యులు. పళ్లపైన ఉన్న పింగాణీ పొర అరిగిపోయి పంటి రెండవపొర డెంటిన్‌ బయటపడి పోయిందని గ్రహించాలి. ఎందుకంటే అన్ని కూల్‌డ్రింకుల్లో కూడా ప్రిజర్వేటివ్స్‌ ఉంటాయి. వీటిలో ఉండే సిట్రిక్‌ ఆమ్లం కూల్‌డ్రింక్స్‌ చెడిపోకుండా నిల్వ ఉండేందుకు తోడ్పడుతుంది. ఈ సిట్రిక్‌ ఆమ్లం పంటి పైపొరను మెత్తగా చేస్తుంది. అంటే నున్నగా ఉన్న ఎనామిల్‌ పొర చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడటం వలన గరుకుగా తయారవుతుంది. ఉదాహరణకు బట్టలు ఉతికేందుకు సోడా, డిటర్జెంట్‌ పౌడర్‌ని ఎక్కువగా ఉపయోగించటం వలన ఆ బట్టలు చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడినట్టే ఇక్కడా జరుగుతుంది.

అలాగే కూల్‌డ్రింక్స్‌ తాగుతూ ఆహారం తీసుకోవటం వలన సిట్రిక్‌ ఆమ్లం సాంద్రతకు ఎనామిల్‌ మెత్తబడి అదే సమయంలో ఆహారం నమలటం వలన ఆ గరుకుగా ఉన్న పళ్లు రాపిడికి పళ్లు త్వరగా అరిగిపోతాయి. ఆ తరువాత పంటిలో రెండవ భాగమైన డెంటిన్‌ పొర జీవకణాలతో నిర్మి తమైనది కనుక నరాల అనుసంధానం మెదడుకు కలుపబడి ఉంటుంది. అందుకే నొప్పి వస్తోంది. ఆహారం తింటూ కూల్‌డ్రింకులు తాగటం వలన పళ్లు మరింతగా అరిగిపోతాయి. డ్రింక్స్‌ తాగేటపుడు గుర్తుంచుకోవలసిన విషయాలు- ్య డ్రింక్‌ని నోటి నిండుగా తీసుకుని ఆ రుచిని హాయిని ఆనందిస్తుంటారు. ఇలా చేయటం వలన డ్రింకు చాలా సమయం నోటిలో నిలవుండి, సిట్రిక్‌ ఆమ్లం రసాయనిక చర్య పళ్లపై జరుగుతుంది. అలా కాకుండా స్ట్రాను ఉపయోగిస్తే పళ్లకు తగలకుండా డ్రింకుని నేరుగా నోటిలోకి చేరేలా తాగవచ్చు. గట్టిపదార్థాలను సాధ్యమైనంత వరకు తినకుండా ఉంటే మంచిది. అలాగే పులుపు ఆహారపదార్థాల్లో కూడా సిట్రిక్‌ ఆమ్లం ఉంటుంది కాబట్టి వాటిని తగ్గించాలి. అరిగిన పళ్లకు కేప్స్‌ తొడిగులు వేయించుకోవాలి. తక్కువగా అరిగినట్లైతే పొటాషియం నైట్రేటు టూత్‌పేస్టుతో (మెడికల్‌ స్టోరులో దొరుకుతుంది) బ్రష్‌ చేసుకోవాలి.