కొంచెం పాలు చాలు

milk drinking
Drinking Milk

కొంచెం పాలు చాలు

ఆరోగ్యానికి పాలు ఎంతో మేలు చేస్తాయి. రోజూ ఉదయం లేవగానే, రాత్రి పడుకోవడానికి ముందు పాలు తాగితే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. మరీ ప్రత్యేకించి ఎదిగే వయసు పిల్లలకు కాల్షియం, రోగనివారణ శక్తి కోసం పాలు ఎంత తాగితే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. కానీ కొత్తగా జరిపిన ఓ అధ్యయనం ఫలితాలు మాత్రం ఇందుకు భిన్నంగా వచ్చాయి.

బ్రిటీష్‌ మెడికల్‌ జర్నల్‌లో ప్రచురించబడిన ఈ అధ్యయనం ఫలితాలని బట్టి చూస్తే, ఇన్నాళ్లు అనుకున్నట్లుగా పాలు అధికమోతాదులో తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదట. రోజుకు మూడు గ్లాసు పాల కన్నా అధికంగా తీసుకుంటే, జీవితంలో చావ్ఞని త్వరగా కొనితెచ్చుకున్నట్లేనని ఈ అధ్యయనం చేసిన పరిశోధకులు చెబుతున్నారు. అధికంగా తీసుకునే పాలలో ఉండే లాక్టోస్‌, గలాక్టోస్‌ అనే రెండు రకాల షుగర్లు మనిషి శరీరంలోని ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని వివరిస్తున్నారు. ఈ రెండు రకాల షుగర్ల కారణంగానే ఒంట్లో రోగనిరోధకశక్తి తగ్గిపోవడం, చిన్నచిన్న ప్రమాదాలకే ఎములకు విరిగిపోవడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని అంటున్నారు.

కొన్ని సందర్భాల్లో ఇది మృత్యువ్ఞ వరకూ వెళ్లొచ్చట. 1987-1990 మధ్యకాలంలో 39 నుంచి 74 ఏళ్ల ఏజ్‌ గ్రూప్‌ గల 61,433 మంది మహిళల్ని, అలాగే 1997లో 45 నుంచి 75 ఏళ్ల ఏజ్‌ గ్రూప్‌ గల పురుషుల్ని ఈ అధ్యయనం కోసం ఎంపిక చేసుకున్నారు. వాళ్లు తీసుకునే ఆహారంలో ఉన్న పాలు, వెన్న వంటి పదార్థాల మోతాదుపై అధ్యయనం జరిపారు. ఆ తర్వాత ఓ 20ఏళ్ల పాటు ఈ పరిశోధనలో పాల్గొన్న మహిళల ఆరోగ్య పరిస్థితులపై దృష్టిసారించారు. వారిలో 15,541 మంది మహిళలు వివిధ రకాల సమస్యలతో మృతిచెందగా మరో 17,252 మందికి ఎముకలు విరిగినట్లు తెలిసింది. ఇక పురుషుల విషయానికొస్తే, 11ఏళ్లపాటు వీరి ఆరోగ్యంపై దృష్టి సారించారు. ఈ 11ఏళ్ల మధ్యకాలంలో 10,112 మంది పురుషులు ప్రాణాలు విడవగా, మరో 5066మందికి ఎముకలు విరిగిన సమస్యలు తలెత్తాయి. ఈ ఫలితాల ఆధారంగానే అధ్యయనంపై పరిశోధకులు ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.