కట్నం వేధింపుల చట్టంతో మేలెంత?

sad ness
sad ness

ఈ మధ్యకాలంలో 498-ఏ కేసులు కూడా దుర్వినియోగం అవుతున్నాయి. దీంతో ఈసెక్షన్‌లో కొన్ని అమెండ్‌మెంట్స్‌ చేయడం జరిగింది. బాధిత మహిళలు కంప్లైంట్‌ ఇచ్చిన తర్వాత భర్త తరపు వారిని కూడా పిలిచి కౌన్సిలింగ్‌ ఇవ్వడం, నిజ నిర్ధారణ చేసి ఎఫ్‌ఐఆర్‌ కట్టడం జరుగుతుంది. ఇది నాన్‌బెయిల్‌ అయినప్పటికీ దీనికి స్టేషన్‌ బెయిల్‌ కూడా ఇచ్చే అవకాశం ఉంది. లేని ఎడల సంబంధిత మెజిస్ట్రేట్‌ నుంచి ఆంటిసిపెటరీ బెయిల్‌ గానీ, హైకోర్టు నుంచి నాట్‌ టూ అరెస్టు ఆర్డర్‌ గానీ తెచ్చుకుంటారు. ఆరు నెలల క్రితం సుప్రీంకోర్టు మరో అమెండ్‌మెంట్‌ చేసింది. కుటుంబ సంక్షేమ కమిటీలు ఏర్పాటు చేయాలన్న ఆదేశాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది.

సమాజంలో మహిళలపై దాడులు, దౌర్జన్యాలు నిత్యకృత్యమయ్యాయి. ఎన్ని చట్టాలున్నా నేరాలు జరుగుతూనే ఉన్నాయి. బయిటనే కాదు. ఇంట్లోకూడా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. వరకట్న వేధింపులకు గురవుతున్న వారిలో పేద, మధ్య తరగతి మహిళలే కాదు… సంపన్న వర్గాల వారు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, సినీ యాక్టర్లు, వివిధ ఫ్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న మహిళలు ఉన్నారు. ఆఖరికి మహిళా జడ్జి కూడా అత్తింటి వేధింపులకు గురైన సంఘటనలు చూశాం.ఈ వరకట్న వేధింపుల తాళలేక మహిళలు భర్తలు, అత్తమామల చేతుల్లో గాయాలు పాలుకావడం, హత్యకు గురికావడం, లేదా ఆత్మహత్యలకు పాల్పడటం, పిల్లలతో సహా బలవన్మరణానికి పాల్పడిన సంఘటనలు కోకొల్లలు.

పెళ్లిపేరుతో విదేశాలకు తీసుకెళ్లి అక్కడ మహిళలను హింసించేవారు, వారి వేధింపుల వల్ల ఆత్మహత్యలు చేసుకున్న మహిళలు ఉన్నారు. వరకట్నం కోసం భార్యకు హెచ్‌ఐవి వైరస్‌ ఎక్కించిన ప్రబుద్ధులు ఉన్నారు. ఇలాంటి వేధింపులకు గురవుతున్న మహిళలకు రక్షణ కల్పించేందుకు రూపొందించిన చట్టమే 498ఏ. అయితే ఈచట్టం మహిళలను వరకట్న వేధింపుల నుంచి రక్షించేందుకు తీసుకొచ్చిన కొందరి మహిళల కారణంగా ఈ చట్టం దుర్వినియోగం అవుతున్న సందర్భాలున్నాయి. అమాయకపు భర్తలు, వారి కుటుంబ సభ్యులు బలవుతున్న సందర్భాలున్నాయి. అలాంటి సెక్షన్‌ 498ఏ: వరకట్న వేధింపుల చట్టంపై ప్రత్యేక కథనం…


మహిళలపై వరకట్న వేధింపులు
భారతదేశంలో శతాబ్ధాల నుంచి వరకట్నం ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయం కొనసాగుతోంది. దక్షిణాదికి చెందిన ఈ సంప్రదాయంలో వివాహ సమయంలో వధువు తల్లిదండ్రులు వరుడి కుటంబానికి నగదు, బట్టలు, ఆభరణాలు వంటివి బహుమతిగా ఇస్తారు. కొందరు విశాల దృక్పథంతోనో, ఆదర్శాల కోసమో కట్నాన్ని తిరస్కరించినట్లయితే, వరుడిలో ఏదో లోపం ఉందన్న అనే భావన కలుగుతుందని అలాంటివారు కూడా కట్నాన్ని తీసుకొనేవారు. వాస్తవానికి ఇలా బహుమతిగా ఇవ్వడం ఆ తల్లిదండ్రులకు తమ కూతురు మీద ఉన్న ఇష్టంకారణంగా ఇచ్చేవారు. రాను రాను అది వరుడు హక్కుగా మార్చుకొని వరకట్నం తీసుకురావాలని భర్తలు, వారి కుటంబ సభ్యులు ఆడపిల్లలను వేధించడం ప్రారంభించారు.

1961లోనే వరకట్న నిరోధక చట్టం రూపొందించబడింది. ఈ చట్టం ప్రకారం వరకట్నంతీసుకోవడం, ఇవ్వడం కూడా నేరాలే. కానీ దీని వల్ల పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. భర్త లేదా వారి కుటుంబీకులు వారి కుటుంబ అవసరాల తీర్చుకోవడం కోసం పెళ్లికి ముందే అధికమొత్తంలో వరకట్నాన్ని, ఇతర కానుకలను వసూలు చేయడం. పెళ్లైన తర్వాత మరింత కట్నం కోసం, కానకుల కోసం కోడలిని వేధించడం, కోడలిని వంటింటి కుందేలును చేయడం, కేవలం పిల్లలను కనే యంత్రంగా చూడటం, పురుషుని విచ్చలవిడి తనం, దుర్వ్యసనాలు, అక్రమ సంబంధాల వంటి కారణాల వలన గృహహింస పెరిగిపోయవడం జరుగుతుంది.

ఈ వరకట్నం కారణంగా అత్తింట వధువుల వరకట్న చావులకు కారణమవుతుంది. మహిళలపై వేధింపులు జరుగుతున్నాయి. డబ్బుకోసం భార్యని భర్తే కాకుండా అతని బంధువులు, తల్లి, తండ్రి, ఆడపడుచులు హింసిస్తున్న సంఘటనలు మనకు ప్రతిరోజుల కోకొల్లలుగా కనిపిస్తాయి. ఇది సర్వసాధారణ మైపోయింది. కొత్త ప్రదేశంలో కొత్త మనసుల మధ్యకు వచ్చిన కొత్త కోడలు జీవితం ఇలాంటి మనుషుల మధ్య దుర్భరమై పోతుంది. వారి క్రూరత్వం వల్ల అమ్మాయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.


వివాహితపై హింసను నిరోధించేందుకు 498-ఏ చట్టం
వివాహిత మహిళల పట్ల భర్త లేదా అమె కుటుంబ సభ్యులు, బంధువులు శారీరక క్రూరత్వం, మానసిక క్రూరత్వం అమానుషమైనదైనప్పటికీ దానికి తగిన శిక్షలు చట్టాల్లో లేకపోవడంతో 1983లో ఐపిసి సెక్షన్‌ 498ఏను పొందుపరి చారు. వరకట్నం లేదా తమ ఇతర డిమాండ్లు నెరవేర్చుకోవడం కోసం వివాహితపై ఆమె భర్తగానీ అతని బంధువులు గానీ శారీరకంగా, మానసికంగా క్రూరంగా ప్రవర్తిస్తే ఈ చట్ట ప్రకారం అది నేరం అవుతుంది. భార్య భర్తల మధ్య విభేదాలు తలెత్తిన తర్వాత భార్యలు ఈసెక్షన్‌ కింద కేసు పెట్టవచ్చు. భార్యను ఆమె భర్తగానీ, భర్త తరుపు బంధువులు కానీ శారీరకంగా, మానసికంగా హింసిస్తే ఈ నిబంధన ప్రకారం కేసు పెట్టవచ్చు. వాళ్లు ఈసెక్షన్‌ ప్రకారం శిక్షార్హులవుతారు. మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది.

చట్ట వ్యతిరేకమైన డిమాండ్‌ చేస్తూ ఆమెను గానీ, ఆమె బంధువులను గానీ, కట్నం గానీ ఇతర కోరిక లు గానీ తీర్చమని ఒత్తిడి చేసినప్పటు అది క్రూరత్వమంటారు. ఈనేరం రుజువు కావాలంటే 1.ఆమెకు పెళ్లైందని, 2. ఆమె హింసించబడిందని, 3. ఆ హింస ఆమె భర్తగానీ అతని బంధువులచే గానీ జరిగిందని రుజువు చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధన క్రింద కేసును ఆస్త్రీ బతికి ఉన్నప్పుడు గానీ, చనిపోయినప్పుడు గానీ పెట్టవచ్చు. ఆమె వైవాహిక జీవిత కాలపరిమితితో సంబంధం లేదు. ఇది నాన్‌బెయిలబుల్‌ నేరం. వీటికి సంబంధించిన కేసులను ఆమెగానీ, ఆమె తరుపు వారుగానీ, వేయవచ్చు. వీటికి సంబంధించిన కంప్లైంట్‌ సమాచారాన్ని ముందుగా పోలీస్‌ స్టేషన్‌లో ఇవ్వవలసి ఉంటుంది.

కొన్ని సందర్భాల్లో స్త్రీలు అనుమాస్పద పరిస్థితుల్లో మరణిస్తారు. ఆ స్త్రీలు వివాహితులై ఏడు సంవత్సరాలలో మరణించి, మరణానికి ముందు వరకట్నం కోసం వేధింపులు ఉంటే అది సెక్షన్‌ 304-బి ప్రకారం నేరమవుతుంది. అదేవిధంగా వివాహిత ఆత్మహత్య చేసుకునే విధంగా భర్తగానీ, అతని బంధువులు ప్రవర్తిస్తే వాళ్లపై భారతీయ శిక్ష్మాస్మృతిలో సెక్షన్‌ 306ప్రకారం కేసు పెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా కొట్టినప్పు డు కూడా భారతీయ శిక్షాస్మృతిలో సెక్షన్‌ 324 ప్రకారం కేసులు పెట్టే అవకాశం ఉంది.


ఈ చట్టం దుర్వినియోగం అవుతున్న సందర్భాలు
వరకట్న వేధింపులను అడ్డుకునేందుకు భారతదేశంలో 1983లో ఐపిసి సెక్షన్‌ 498-ఏ ప్రకారం వరకట్న వేధింపుల వ్యతిరేక చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం కింద ఫిర్యాదు చేస్తే నిందితులు, అంటే అసాధార ణంగా భర్త, అతడి కుటుంబ సభ్యులను పోలీసులు వెంటనే అరెస్టు చేస్తారు. కానీ దీనికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నవారు ఈ నిబంధన దుర్వినియోగం అవుతుందని, చాలా మంది మహిళలు తప్పుడు కేసులు పెడుతు న్నారని ఆరోపించారు.తమ అక్రమైన డిమాండ్ల సాధన కోసం ఒక వివాహితను హింసించడం దుర్మార్గమని, ఒక మంచి ఉద్ధేశ్యంతో అలాంటి హింసకు గురవుతున్న స్త్రీలను హింస నుంచి రక్షించాలని భారత శికాస్మృతిలో 498-ఏ సెక్షన్‌ను చేర్చడం జరిగింది.

కానీ తదనంతర కాలంలో ఈ సెక్షన్‌ చాలా దుర్వినియోగమ వుతూ వస్తుంది. ఈసెక్షన్‌ ముసుగులో కొంతమంది స్త్రీలు తమ అహాన్ని సంతృప్తి పరుచుకోవడం కోవడానికి కూడా భర్తపై, భర్త సంబంధీకులపై తప్పుడు కేసులు పెట్టడం అరెస్టు, అరెస్టు చేయించడం జరుగుతుందన్న ఆరోపణలు న్నాయి. ఈకేసుల ముసుగులో నిందితులను భయభ్రాంతులకు గురిచేసి పెద్దఎత్తున డబ్బులు రాబట్టుకున్న సందర్భాలు ఉన్నాయని ఆరోపణలున్నాయి. వరకట్న వేధింపుల కేసుల్లో చాలా వరకు పోలీసులు ఒత్తిళ్ల మూలంగా, ఇతరత్రా కారణాలతో నిందితులను అరెస్టు చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టి జైలుకు పంపించే విధంగా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి.

అనేకమైన కారణాలతో భర్తపై, భర్త కుటుంబీకులపై తప్పుడు కేసులు వేయడం వారిని అరెస్టు చేయించడం వల్ల అనేక కుటుంబాలలో తీవ్రమైన సంక్షిష్ట పరిస్థితులు ఉత్పన్నం కావడం, కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడం జరుగుతుంది. ఆయా కేసుల్లో విచారణ జరిగి కేసులు వీగిపోవడం, కొన్ని కేసుల్లో సరైన కారణాలు చూపకపోవడం మూలంగా విచారణ దశలోనే మూసి వేయడం జరిగింది. దేశవ్యాప్తంగా దాదాపు 5లక్షల కేసులు పెం డింగ్‌లో విచారణలో ఉన్నాయి. కానీ ఈ కేసుల్లో 15శాతానికి మించి శిక్ష పడటం లేదు.

  • పోతుగంటి వెంకట రమణగుప్త