ఐస్‌బర్గ్‌ ఇన్ఫెక్షన్‌

                                     ఐస్‌బర్గ్‌ ఇన్ఫెక్షన్‌

Manaswani
Manaswani

మనకు ఏ చిన్న జబ్బు చేసిన డాక్టర్‌ దగ్గరికి వెళ్లినపుడు ఇన్ఫెక్షన్‌ వుందంటూ మందులిస్తుంటారు. ఈ ఇన్ఫెక్షన్‌ అనేది రకరకాల సూక్ష్మజీవుల వల్ల కలుగుతుంది. సూక్ష్మజీవుల వలన శరీరానికి హానికల్గినప్పుడు ఇన్ఫెక్షన్‌ అంటాము. ఈ సూక్ష్మజీవులు శరీరంలో చేరి వృద్ధి చెంది వ్యాధుల్ని కల్గించడం వల్ల వీటిని పాథోజెన్స్‌ అంటారు. ఇది శరీరంలోని ఏ భాగానికైనా లేదా శరీరమంతట రావచ్చు. దీనికి వయోభేదం, స్త్రీ, పురుష భేదం లేదు. ప్రపంచంలో ఇన్ఫెక్షన్‌తో బాధ పడని జీవి అంటూ ఏదీ లేదు. మనుష్యులు జంతువుల శరీరంపై కాని దుస్తులపై కాని చేరి వృద్ధి చెంది పునరుత్పత్తి అయ్యే చిన్న క్రిముల వంటి కీటకాల్ని ఇన్‌ఫెస్టేషన్‌ అంటారు. ఉదా:పేలు, ఇచ్‌మైట్స్‌, ఆస్కారిస్‌ మొదలైనవి. ఒక్కొక్క వ్యాధిలో ఇన్ఫెక్షన్‌ ఒక్కొక్క విధంగా వుంటుంది. ఇది వ్యాధి క్రిముల సంఖ్య, వ్యాప్తి, తీవ్రత, రోగనిరోధక శక్తిని బట్టి వుంటుంది.

ఇన్ఫెక్షన్‌ అనేది ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒకే ఇన్ఫెక్షన్‌ ఒక ఇంట్లో వున్న నలుగురు కుటుంబ సభ్యులకు వచ్చినపుడు వ్యాధి లక్షణాలు అందరిలో ఒకేలా వుండవు. అందరికి ఇన్ఫెక్షన్‌ వల్ల వ్యాధి రావాలని లేదు. వ్యాధి స్వరూపం అనేది రోగిలోని వయస్సు, ప్రతి స్పందనను బట్టి వుంటుంది. దీన్నే స్పెక్ట్రమ్‌ ఆఫ్‌ డిసీజ్‌ అంటారు. చాలా వ్యాధులు గుప్తంగా వుండి దీర్ఘకాలిక వ్యాధులుగా పరిణమించే అవకాశం వుంది. ఉదా: కేన్సర్‌ తరుణ దశల్లో వ్యాధి స్వరూపాన్ని బట్టి వ్యాధి లక్షణాలుగా బహిర్గతమవుతాయి. వీటినే క్లినికల్‌ ఇన్ఫెక్షన్‌ అంటాము. వెంటనే డాక్టర్‌ దగ్గరికెళ్ళి చికిత్స తీసుకుంటాము. ఇన్ఫెక్షన్‌ వున్న శరీరంలో ఎటువంటి లక్షణాలు కన్పించకపోతే దాన్ని సబ్‌క్లినికల్‌ లేదా సైలెంట్‌ లేదా ఇన్‌ అపరెంట్‌ ఇన్పెక్షన్‌ అంటారు. సర్వసాధారణంగా నేడు హైపర్‌టెన్షన్‌, డయాబెటీస్‌, పోషకాహారలోపం, మానసిక రుగ్మతలు వంటి అనేక వ్యాధులు శరీరంలో మనకు తెలియకుండనే వుంటాయి.

మనం ఏదైన లేబరేటరీ పరీక్షలు, స్కానింగ్‌ చేసుకున్నప్పుడు ఈ వ్యాధులు బైట పడే అవకాశం వుంది. అందుకే వ్యాధిని నీటిలో మునిగి వుండే ఒక ఐస్‌ (మంచు) ముక్కతో పోల్చవచ్చు. దీనివల్ల వ్యాధి ప్రోగ్రెస్‌ చాలా వ్యాధుల్లో తెలుస్తుంది. నీటి పై భాగంలో కొంత తేలుతూవుండే మంచు ముక్కవంటి వ్యాధి స్వరూపాన్ని మనం లక్షణాల ద్వారా, డాక్టర్‌ పరీక్షల ద్వారా నిర్ధారించి చికిత్స తీసుకొని నయం చేసుకుంటాము, అంటే వ్యాధి మూలాన్ని మనం గ్రహించలేమన్న మాట. కొందరిలో వ్యాధి మాటిమాటికి తిరగబడుతున్న దీర్ఘవ్యాధిగా పరిగణమిస్తున్న, హఠాత్తుగా ప్రాణాపాయస్ధితి ఏర్పడడానికి మూలకారణం లాటెంట్‌ ఇన్ఫెక్షన్‌. ఇన్ఫెక్షన్‌ వల్ల వ్యాధిని సూక్ష్మజీవులు కల్గించక చాలా కాలం పాటు శరీరంలోనే వుండిపోయి ఇన్ఫెక్షన్‌ రిజర్వాయర్‌గా పనిచేయడం వల్లనే ఇది జరుగుతుంది. నీటిలో మునిగివుండే అధికభాగం మంచు ముక్కతో మన శరీరంలోని అనేక వ్యాధుల్ని సకాలంలో గుర్తింతంచలేక పోవడమనేది వైద్యరంగానికి సవాళ్లలాంటిది అని చెప్పవచ్చు.

జలుబు, జ్వరం లాంటి చిన్నచిన్న వాటిని పట్టించుకోము, తగ్గిపోతుందిలే అని నిర్తక్ష్యం చేస్తాము. ఒక్కోసారి మాటిమాటికి వచ్చినపుడు ప్రాణాపాయ స్ధితి ఏర్పడినప్పుడు మనకు ఇబ్బంది కల్గినప్పుడు చికిత్స తీసుకుంటాము. దీనికి కారణం బిజీ లైఫ్‌లో టైమ్‌ లేకపోవడం,డబ్బుతోపనికావడం, డాక్టర్ల దగ్గర వ్యాధి లక్షణాల్ని, వారిగత ఆరోగ్య చరిత్ర గురించి సరిగా చెప్పకపోవడం, డాక్టర్లు సరిగా డయాగ్నోసిస్‌ చేయలేకపోవడం, మందులు సరిగా వేసుకోకపోవడం, తగ్గిన తర్వాత చెకప్‌కు పోకపోవడం, వ్యాధి గురించిన స్క్రీనింగ్‌ లేకపోవడం ప్రివెంటివ్‌గా జాగ్రత్తలు తీసుకోకపోవడం, రోగికి శరీరం పట్ల, ఆరోగ్యంపట్ల అవగాహన లేకపోవడం వంటి పలు కారణాల వల్ల వ్యాధులు ఎక్కువుగా రావడానికి ఆస్కారముంది. ఆరోగ్యంగా వున్నప్పుడే హెల్త్‌ చెకప్‌లు చేయించు కోవడం, మంచి ఆహారం, వ్యాయమం చేయడం, రిలాక్సేషన్‌ వంటి పద్దతుల ద్వారా వ్యాధిని సకాలంలో గుర్తించి కంట్రోల్‌ చేయడం ద్వారా శరీరంలో నిగూఢమైన అనేక వ్యాధుల్ని గుర్తించవచ్చు.

ఉదా: హెపటైటిస్‌ బి వైరస్‌ లివర్‌ ఉన్నప్పటికి వ్యాధి లక్షణాలు కన్పించని కారియర్స్‌గా వీరు వ్యాధిని ఇతరులకు రక్తమార్పిడి, లైంగిక సంపర్కంద్వారా, ఇంజెక్షన్స్‌, బ్లేడ్ల ద్వారా ఇతరులకు వ్యాపింపచేస్తారు. ఒక ఏరియాలో విష జ్వరాలు ప్రబలినప్పుడు లేదా విరేచనాలుతో బాధపడుతున్నప్పుడు వారికి రక్త పరీక్షలు చేసి వ్యాధిని గుర్తించడాన్ని ప్రిస్పటివ్‌ స్క్రీనింగ్‌ లేదా మాస్‌ స్క్రీనింగ్‌ అంటారు. వ్యాధిని కంట్రోల్‌ చేయడానికి మందులివ్వడం, దోమల్ని అరికట్టడం, పరిశుభ్రత పాటించడం, పరిసరాల్ని శుభ్రపరచడాన్ని ప్రొస్పెక్టివ్‌ స్క్రీనింగ్‌ అంటారు. అలాగే 40 సంవత్సరాలు దాటిన స్త్రీలలో రొమ్ము కేన్సర్‌ గుర్తించడానికి మమ్మోగ్రామ్‌, సర్విక్స్‌ కేన్సర్‌ గుర్తించడానికి పాప్‌స్మియర్‌ చేయడం, అలాగే బి.పి, షుగర్‌ కొలెస్ట్రాల్‌ పరీక్షలు చేయడం ద్వారా చాలావరకు వ్యాధినికల్గించే రిస్క్‌ఫ్యాక్టర్స్‌ని గుర్తించడాన్నే సెలెక్టివ్‌ స్క్రీనింగ్‌ అంటారు.

స్కూల్‌ పిల్లల్లో తరచుగా కన్పించే వర్మ్‌ ఇన్ఫెక్షన్స్‌ని, చూపులో తేడా, ఆకలి లేకపోవడం, పరిశుభ్రత లేకపోవడం, చర్మవ్యాధుల్ని తరుచుగా హెల్త్‌ చెకప్‌ల ద్వారా గుర్తించడాన్ని మల్టిఫేషిక్‌ స్క్రీనింగ్‌ అంటారు. మనం వ్యాధి వచ్చి డాక్టర్‌ దగ్గరకెళ్ళి చికిత్స తీసుకోవడమే కాకుండా తరుచుగా శరీరంలో నిగూఢమైన అనేక వ్యాధుల్ని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోవడానికి ఈ స్క్రీనింగ్‌ పరీక్షలవసరం. దీనివల్ల మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్నట్లే లెక్క. ఎందుకంటే సమాజంలో తలెత్తే కొత్త వ్యాధుల్ని నీటిలో మునిగి వుండే ఐస్‌బర్గ్‌ ని (వ్యాధి మూలాల) చాలా వరకు ఛేదించి నట్లేనని చెప్పాలి.
– డాక్టర్‌. కె.ఉమాదేవి, తిరుపతి