ఈ అన్యాయాలను అరికట్టలేమా?

HERROSMENT
HERROSMENT

భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఆమె తన రెండేళ్ల పాపతో సహా పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇల్లాలు మరణించింది. కూతురు చావ్ఞబతుకుల మధ్య పోరాడుతున్నది. ఇది ఒక గృహిణి వ్యథ. తనను ప్రేమించడం లేదని, హోటల్‌ గదిలోకి తీసుకొచ్చి హత్య చేసేందుకు ప్రయత్నించాడు ఓ ప్రేమికుడు. ఇక అత్యాచారాలకు, దాడులకు కొదువ లేదు. ఏరోజు దినపత్రికలు తిరగేసినా అత్యాచారం లేని వార్తే ఉండదు. మోసాలు, ముంచివేతలు లేని కాలమ్‌ ఉండదు. ప్రపంచంలో 18వ శతాబ్దం ఆరంభం నుండీ ప్రజల్లో ఆవిర్భవించిన ప్రజాస్వామ్య వాదం ప్రజలే ప్రభువ్ఞలని చెప్పింది. ఆ వాదన విశ్వవ్యాప్తంగా పరిఢవిల్లింది. నియంతలు, సామ్రాజ్యకాంక్షలు, విలువల హీనతలు ఇక ఉండవని భావించారు. ఆశించారు. చట్టాలు, రాజ్యాంగాలు, విధివిధానాలు, ఆదర్శవాదాలు ఏర్పడ్డాయి. నూతన యుగం ఆవిర్భవింపబడింది. ఎన్నెన్నో నూత్న ప్రయోగాలు. సాంకేతిక విప్లవాలు, భావసృష్ఠి, సమవాదం, సామ్యవాదం, హక్కుల పరిరక్షణ ఏర్పడ్డాయని అప్పుడూ, ఇప్పుడూ ఎప్పటికీ చెప్పుకుంటుంటాం. బాహ్యపరమైన మార్పు, అభివృద్ధి కొట్టొచ్చినట్టుగా కానొస్తున్న మాట వాస్తవమే కానీ-మానసిక సంస్కారం మాత్రం ఆదిమానవ్ఞని పోలి ఉంటుందనేది ఒప్పుకుని తీరాలి. లేకుంటే అత్యాచారాల, హింసల, వేధింపుల పరంపరలను ఏమనుకోవాలి? దిగజారుతున్న హీనసంస్కృతి కాదన్నది నిలువరింపలేకపోవడం అశక్తత కాదా?
ఏయేటికాయేడు స్త్రీలపై అత్యాచారాల రేటు పెరగడమే కానీ తరిగిన దాఖలాలు ఉన్నాయా? ఇది చట్టాలనో, ప్రభుత్వాలనో తప్పు పట్టడం కాదు. సమాజంలో పేరుకుపోయిన రుగ్మత. ఇది రుగ్మత కూడా కాదు. అబలలు అన్న దురహంకారంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులు చెలరేగిపోయే వైనం. భారతదేశంలో సగటున గంటకో అత్యాచారం జరుగుతోందని నివేదికలు, సర్వేలు ఘోషిస్తున్నాయి. సామూహిక అత్యాచారాలు వేల సంఖ్యలో నమోదు అవ్ఞతున్నాయి ప్రతియేడు. పోలీస్‌స్టేషను పరిధిలోకి రాకుండా ఉండే కేసులు అంతకు నాల్గింతలు, ఐదింతలూ ఉంటాయి. అర్థరాత్రి స్వాతంత్య్రం వచ్చింది. అర్థరాత్రి ఆడది ఒంటరిగా తిరగగలిగితే అదే నిజమైన స్వాతంత్య్రం అన్నారు. అర్థరాత్రి కాదు పగటి పూట నట్టనడి బజారుల్లో, పార్కుల్లో, విహారస్థలాల్లో, వీధుల్లో, గొందుల్లో, సందుల్లో ఈ జనారణ్యంలో అంతా అభద్రతే. కామెంట్లకు, వెర్రిచేష్టలకు, వేధింపులకూ అదుపే ఉండదు. జనాభా, నాగరికత, విజ్ఞానం ఏస్థాయిలో ఐతే పెరుగు తున్నాయో అదే స్థాయిలో ఈనేరప్రవృత్తి సైతం పెరుగుతోంది. ఈ వికృత చేష్టలూ పెచ్చరిల్లుతున్నాయి. ఏది? ఏ మహిళనైనా, ఏ ఆడపిల్లనైనా అడిగిచూడండి. భయం లేకుండా స్వేచ్ఛగా, ఏ కామెంట్ల బారిన పడకుండా ఒంటరిగా బజారు నుండి తిరిగి ఇంటికి రాగలదేమో. మంచిని మాత్రమే గ్రహించాల్సిన మీడియా నుండి చెడును, హింసను మాత్రమే ఒంట పట్టించుకుని -‘గజానికో గాంధారి సూతుని మాదిరిగా హీనంగా బతికే బతుకులను నేటి హైటెక్‌ సమాజంలో కోకొల్లలుగా చూడవచ్చు. సెక్షన్‌ 357 ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లో కఠినంగానూ, విస్తృతంగానూ ఉంది.