అనిరుద్ధుని వివాహం

om
om

అనిరుద్ధుని వివాహానికి రుక్మిణి, శ్రీకృష్ణుడు, బలరాముడు మిగతా యాదవ ప్రముఖులు భోజకటకమను నగరమునకు వెళ్లారు. అచట వివాహం అయిన తరువాత రుక్మి స్నేహితులంతా కలసి బలరామునితో పాచికలాడమని ప్రోత్సహించారు. ఆటలో మొదట బలరాముడు నూరు పణములు ఓడెను. పిమ్మట రెండవ ఆటలో వేయి పణములు ఓడెను. అటు పిమ్మట పదివేల పణములు ఒడ్డిరి. అందులోనూ రుక్మియే ఎగలిచాడు. ఆట గెలిచిన గర్వముతో బలరాముని ఎగతాళి చేశాడు. అతని మిత్రుడు కాళిందుడు పగలబడి నవ్వాడు. ఈసారి బలరాముడు లక్షపణము ఒడ్డి అందులో గెలిచాడు. కానీ రుక్మి దాన్ని ఒప్పుకోక తానే గెలిచానని వివాదం లేవదీశాడు. రుక్మి చేస్తున్న మోసానికి బలదేవునికి కోపము వచ్చి పందెములో ఈ సారి పదికోట్లు పణముగా పెట్టాడు, గెలిచాడు. రుక్మి ఒప్పుకోలేదు. అప్పుడు అశరీరవాణి ‘బలదేవుడే జయించినాడు, రుక్మి అసత్యము పలుకు చున్నాడని పలికెను. రుక్మి ఆ మాటను లెక్క చేయక మీరు ఆవులను మేపటంలో నిపుణులు. పాచికలాట మీకేం తెలుసు? అని ఇంకా ఏమేమో దుర్భాషలాడాడు. బలరామునికి పట్టరాని కోపము వచ్చింది. రుక్మిని చంపివేశాడు. తనను చూసి నవ్విన కాళిండుది పళ్లను ఊడగొట్టాడు. వివాహ మందిరము ఒక రణరంగంగా మారింది. ఎందరో రాజుల తొడలు, చేతులు, కాళ్లు బలరాముని నాగలి దెబ్బకు తునాతునకలయ్యాయి. ఆ ప్రదేశమంతా రక్తసిక్తమైంది. భాగవతంలోని ఈ భాగాన్ని చదువుతున్నపుపడు ఈ మధ్యే ఒక పెళి సందర్భంగా వివాదం మొదలై పెళ్లి పందిరిలోనే మాటామాటా పెరిగి పెళ్లి కొడుకు బంధువులు, పెళ్లి కుమారై మంధువులు కుర్చీలతో, కర్రలతో ఎలా ఒకరినొకరు తన్నుకున్నారో, తిట్టుకున్నారో గుర్తుకొస్తున్నది. దాన్ని టివిలో అందరూ చూసే ఉంటారు. దాన్ని చూసి చాలా మంది అన్నారు ఆ పెళ్లికొడుకు, పెళ్లి కూతురు జాతకాలను చూపించి ఉండరని, జాతకాలు – గుణాలు సరిపోయి ఉండవని, పూజారికి సరైన ముహూర్తం, శుభ ఘడియలెక్కించేకి వచ్చి ఉండదని, పూజాదికాలు శాస్త్రోక్తంగా జరిపించి ఉండరని అందుకే ఇట్టి దుస్సంఘటనలు సంభవించి ఉంటాయని. సరే మరి శ్రీకృష్ణపరమాత్ముని సమీప బంధువులు అనిరుద్ధుడు. ఆనాడు వారంతా జాతకాలను, ముహూర్తాలను బాగా తెలిసిన పండితులకే చూపించి నిర్ణయించి ఉంటారు కదా? మరి ఆ శుభకార్యంలో హింస జరగటమేమిటి? హత్యలు జరగటమేమిటి? పెళ్లి మంటపం రణరంగం కావలమేల, రక్తపుటేరులు పారటమేల. సాక్షాత్తు అవతార పురుషులు బలరామకృష్ణులు అక్కడ ఉన్నారన్న విషయం మరువరాదు. అన్నీ శాస్త్రోక్తంగానే జరిగి ఉంటాయి. యోగ్యులైన పండితులే ముహూర్తాన్ని నిర్ణయించి ఉంటారు అయినా జరుగరాని వన్నీ జరిగాయి. కారణం నిగ్రహం లేకపోవటమే, నోటిపై అదుపు లేకపోవటమే. ఎదుటి వారిని నిందింపరాని విధంగా నిందించటమే. ముహూర్తలం, లగ్నం, దివసం కాదు బాగుండవలసింది. మనసు మంచిదై ఉండాలి. మాట మంచిదై ఉండాలి. మనసు మాట బాగుంటే అంతా మంచే జరుగుతుంది. ప్రతి దినము శుభదినమే. – రాచమడుగు శ్రీనివాసులు

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana