నీతి కథ: ముగ్గురు మిత్రులు

NEETI KADHA
NEETI KADHA


అది ఒక అడవి. అడవి అన్నాక జంతువులు, పక్షులు సమస్త జీవరాశులు ఉంటాయి కదా! ఈ అడవిలోను కొన్ని కోతులు ఉన్నాయి. ఒక కోతి అటుగా పోతున్న తేలును చూసింది. కడుపు నిండా తిని పనులు లేకుండా ఉంది. ఈ తేలుతో ఆడుకుంటా అనుకుంది కోతి. ఒక కర్రను తీసుకుంది. తేలుకు అడ్డం పెట్టింది. ఆకలితో ఉన్న తేలు కర్రను కాటేసింది. కోతి నవ్వుకుంది. ఓసి! పిచ్చి మొద్దు! కర్రను కాటేస్తే కర్రకు ఏమవుతుంది. ఎన్నిసార్లు కాటేసినా నీకు కష్టమే కాని దానికి ఏమీ కాదు అనుకుని కోతి నవ్వుకుంటూ ఉండగా తేలు సరసరా కోతి చేతి దగ్గరకు వచ్చి టక టకా రెండు కాట్లు వేసింది. కోతి మంటా, మంటా అని ఎగురుసాగింది. తేలు తన ఆహారం వెతుక్కునేందు అక్కడి నుండి పాకుతూ వెళ్లిపోయింది. చెట్టుపైన ఉన్న రామచిలుక ఇదంతా చూసి అయ్యో! కోతి తేలు జోలికి ఎందుకు వెళ్లావు అన్నది. ఓ§్‌ు! చిలుకా నేను బాధతో అరుస్తుంటే నీ మాటలేంటి, నీ పనులు నీవు చూసుకో పో, అంది చిరాకుగా. అదే నేను అనేది ఆ తేలు జోలికి ఎందుకు పోయావు. ఇదిగో ఈ ఆకుపసరు ఆ తేలు కుట్టిన చోట రాయి.

మంట తగ్గుతుంది. అని రెండు ఆకులు ఇచ్చింది. కోతి ఆ రెండు ఆకులు నలిపి తేలు కుట్టిన చోట పసరు రాసింది. మంట తగ్గింది. అరే! మంట తగ్గిందే. చిలుకా నీ మేలు మరువ ను. నా బాధను తగ్గించి పుణ్యం కట్టుకున్నావు అంది కోతి సంతోషంగా. తేలు సహజగుణం కాటేవేయడం. పాపం అది ఆకలితో ఆహారం వెతుక్కునేందుకు పోతూ ఉంటే నీవు దానితో ఆడుకోవాలనుకుంటావా? అందుకే దానికి కోపం వచ్చి నిన్ను కాటేసింది. కాని తేలు చాలా మంచిది తెలుసా! అంది రామచిలుక. ఇవి ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే తేలు అటుగా వచ్చింది. కోతి నన్ను క్షమించు! అంది తేలు. నీకు బాధ కలిగించాను. చూసావా, తేలు మంచితనం అంది చిలుక. అయ్యో! నేను తప్పు చేసాను. నీ పరిస్థితి గమనించకుండ నీతో ఆడుకోవాలనుకున్నాను. అమ్మో! నీ కాటు అంత మంటగా ఉంటుందా? నన్ను కరిస్తే కరిచావుగాని, బడిపిల్లలను మాత్రం కరువకు. ఆటలతో పాటలతో అల్లరి చేసే పిల్లలను మాత్రం కరువకు. వారు తట్టుకోలేరు అంది కోతి. దాని జోలికి వస్తేనే అది వడ్డిస్తుంది అంది చిలుక. ఇక అప్పటి నుండి కోతి, చిలుక, తేలు మంచి మిత్రులుగా మారాయి. అవి మూడు రోజు కొద్దిసేపు కబుర్లు చెప్పుకుంటూ ఆనందించేవి.

  • పెందోట వెంకటేశ్వర్లు
    సిద్ధిపేట
  • తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/