త్రిశంకు స్వర్గం!

తెలుసుకో

TRISANKU
TRISANKU

త్రిశంకు స్వర్గం!

ఏదైనా వ్యవహారంలో ఎటూ తేల్చుకోలేని వారిని త్రిశంకు స్వర్గంలో ఉన్నాడు అంటారు. అటూ ఇటూ కాకుండా మధ్యలో ఊగిసలాడే వారంతా త్రిశంకు స్వర్గంలో ఉన్నట్లే. మరి ఈ నానుడి ఎలా వచ్చిందో, దాని కథాకమామీషు ఏమిటో తెలుసుకుందాం. త్రిశంకుడు ఒక రాజు. అతడి అసలు పేరు సత్యవ్రతుడు. అతడి తండ్రి అరణుడు. అతడు ఇక్ష్వాక వంశరాజు. సత్యవ్రతుడు విచ్చలవిడిగా తిరిగి తండ్రికి చెడ్డపేరు తెచ్చాడు. ఇతడు మూడు శంకలు అంటే తప్పులు చేశాడు. ఒకటి పెళ్లి పీటల మీద ఉన్న బ్రాహ్మణ కన్యను ఎత్తుకుపోయాడు. రెండవది తండ్రి కోపానికి గురయి ఇంటి నుండి పారిపోయాడు. మూడవది వసిష్ట మహారుషి ఆవ్ఞని చంపి దాని మాంసాన్ని తిన్నాడు.

ఈ మూడు పాపాలకు గుర్తుగా నెత్తిపై మూడు బుడిపెలతో వికృతంగా ఉండాలని వసిష్ట మహాముని శాపం పెట్టాడు. త్రిశంకుడు అలాగే మారాడు. అప్పుడు అతడు తన తప్పు తెలుసుకున్నాడు. మనసు మార్చుకున్నాడు.

ఆదిశక్తిని ప్రార్థించి వికృత రూపం పోగొట్టుకున్నాడు. తండ్రి మరణించిన తరువాత అయోధ్యకు రాజయ్యాడు. ఎవరివైనా ఆత్మలు మాత్రమే స్వర్గానికి వెళతాయి. కానీ, త్రిశంకుడు శరీరంతో పాటు స్వర్గం వెళ్లాలనుకున్నాడు. రాజర్షి వశిష్టునికి తన కోరిక తెలిపాడు. అసాధ్యం అన్నాడు వసిష్టుడు. విశ్వామిత్రుని అడిగాడు. త్రిశంకుడి కోరిక తీర్చాలనుకున్నాడు విశ్వామిత్రుడు. తపఃశక్తితో స్వర్గానికి పంపాడు. అయితే అక్కడున్న దేవతలు త్రిశంకుడిని రానివ్వకుండా క్రిందకు నెట్టారు. క్రిందపడే త్రిశంకుడిని మార్గమధ్యంలో నిలిపాడు విశ్వామిత్రుడు. భూమి మీద పడకుండా చేశాడు. అటు స్వర్గం పోకుండా, ఇటు భూమి మీదకు రాకుండా మధ్యలోనే ఊగిసలాడే త్రిశంకుడి కథ నుండి త్రిశంకు స్వర్గం నానుడి ఉద్భవించింది.

– దార్ల బుజ్జిబాబు, చిలకలూరిపేట