మెట్రో, సిటీ ట్రాఫిక్‌ రద్దీ తీర్చేనా

               మెట్రో, సిటీ ట్రాఫిక్‌ రద్దీ తీర్చేనా

METRO
METRO

మొదటి దశ నాగోల్‌…మియాపూర్‌ మార్గంలో తీరని రోడ్‌ ట్రాఫిక్‌ కష్టాలు
హైదరాబాద్‌: మెట్రో రైల్‌ ప్రాజెక్టు రెండవ దశ సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఎల్‌బి నగర్‌, మియాపూర్‌ మార్గంలో మొదలైన ఈ ప్రాజెక్టుపై అటు ప్రభుత్వంతో పాటు ఇటు ప్రజల్లో ఎన్నో ఆశలువున్నా ఆచరణకు వచ్చేసరికి ఎలావుంటుందనేది మరో వారం పది రోజుల్లో తేలిపోనుంది. మెట్రో రైల్‌ మొదటి దశ నాగోల్‌ నుంచి మియాపూర్‌ వరకు గల మార్గం మొదట్లో ఆహా…ఓహో…అనేలా అనిపించినా చివరకు ఆశించిన స్థాయిలో ప్రజల నుంచి స్పందన రాకపోగా చివరకు దీనివల్ల రోడ్‌ ట్రాఫిక్‌ చాలా వరకు తగ్గుతుందని భావించిన ప్రభుత్వ విభాగాలకు తీరని నిరాశను మిగల్చడం తెలిసిందే. మొదటి దశ ప్రాజెక్టుతో పోలిస్తే రెండవ దశ ప్రాజెక్టు రోడ్‌ ట్రాఫిక్‌ తీవ్రంగా వున్న మార్గంలో వుండడంతో దీనివల్ల ట్రాఫిక్‌ సమస్యలకు చాలా వరకు పరిష్కారం లభిస్తుందని పోలీసు, రవాణా విభాగాలు భావిస్తున్నా ఈ విభాగాల ఆశలు ఏ మేరకు నెరవేరుతాయో చూడాల్సివుంది.
జంట నగరాలలో ట్రాఫిక్‌ కష్టాలకు మాస్‌ ట్రాన్స్‌పోర్టు (సామూహిక ప్రజా రవాణా వ్యవస్థ) లేక పోవడం పెద్ద వెలితిగా చెప్పాలి. జంట నగరాలతో పాటు శివా రు ప్రాంతాలు కలిపితే మొత్తం జనాభా కోటిన్నర వరకు వుండగా ఇదే సమయంలో నిత్యం 50 లక్షల మందికిపైగా ఇక్కడ రాకపోకలు సాగిస్తుంటారు. అంటే మొత్తం తెలంగాణ జనాభాలో సగానికి పైగా ఇక్కడే వున్నారన్న మాట. ఈ నేపథ్యంలో ఇందుకు తగినంత ప్రజా రవాణా వ్యవస్థ లేక పోవడంతో నగర వాసులు నిత్యం భయానకమైన ట్రాఫిక్‌ సమస్యను చవిచూడాల్సి వస్తోంది. జంట నగరాల వరకే వస్తే ఇక్కడ 55 లక్షలకు పైగా వాహనాలు వుండగా ఇందులో 40 లక్షల వరకు ద్విచక్ర వాహనాలు వున్నాయి. ఇదే సమయంలో నగర శివార్లలలోని రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలలో మరో 40 లక్షల వరకు వాహనాలు వున్నాయి. ఇందులో 30 లక్షల ద్విచ క్ర వాహనాలు వున్నాయి.

జంట నగరాలతో పాటు శివారు ప్రాంతాలలో మాస్‌ ట్రాన్స్‌పోర్టు వ్యవస్థ లేక పోవడంతో ప్రజలు వ్యక్తిగత వాహనాలను వినియోగించడం చాలా కాలంగా కొనసాగుతోంది. నగరంలో మాస్‌ ట్రాన్స్‌పోర్టు అంటే ఆర్టీసీ బస్సులు ఒక్కటేనని చెప్పాలి. ఎంఎంటిఎస్‌ రైళ్లు, లోకల్‌ రైళ్ల్ళు వున్నా ఇవి ప్రజల అవసరాలను పూర్తిగా తీర్చలేక పోతున్నాయి. జంట నగరాలతో పాటు శివారు ప్రాంతాలలో కాలనీలు విస్పోటనంలా విస్తరించడం లక్షల సంఖ్యలో ఇళ్ల నిర్మాణం జరగడం ఒక్క ఎత్తయితే ఇదే సమయంలో వాహనాల సంఖ్య కూడా పెరగడం మరో ఎత్తుగా చెప్పాలి. అయితే ఇందుకు తగ్గట్లుగా ప్రజా రవాణా వ్యవస్థ విస్తరించక పోవడం గమనార్హం. జంట నగరాలు, శివారు ప్రాంతాలలో ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువగా మార్గాలు అనేకం వున్నాయి.

ఇందులో ముఖ్యమైనవి ఎల్‌బి నగర్‌ నుంచి దిల్‌సుక్‌నగర్‌, మల క్‌పేట్‌, కోఠి, మోజంజాహీ మార్కెట్‌, లక్‌డికాపూల్‌, ఖైరతాబాద్‌, అమీర్‌పేట్‌, సనత్‌నగర్‌, రాంచంద్రాపురం, సంగారెడ్డి మార్గం. దీంతో పాటు ఎల్‌బి నగర్‌ నుంచి నాగోల్‌, హబ్సిగూడ, సికింద్రాబాద్‌, ప్యాట్నీ, బేగంపేట్‌, బాలానగర్‌, పటాన్‌చెరు, సంగారెడ్డి మార్గం. మూడవ మార్గం. చార్మినార్‌, మదీనా, అఫ్జల్‌గంజ్‌, కోఠి, చిక్కడపల్లి, ఆర్టీసీ చౌరస్తా, ముషీరాబాద్‌, సికింద్రాబాద్‌ మార్గం. నాలుగవది ఐబిఎస్‌ నుంచి మదీనా, బహదూర్‌పురా, జూపార్క్‌, ఆరాంఘర్‌, శంషాబాద్‌ నుంచి షాద్‌నగర్‌ మార్గం. ఐదవది. ఎల్‌బి నగర్‌ నుంచి విజయవాడ మార్గంలోని యాదాద్రి జిల్లాలోని భువనగిరి వరకు గల మార్గం. ఆరవది సికింద్రాబాద్‌ నుంచి ప్రజ్ఞాపూర్‌, గజ్వేల్‌ మార్గం.

ఇక నగరంలోని కీలక ట్రాఫిక్‌ రద్దీ మార్గాలను పరిశీలిస్తే చార్మినార్‌ నుంచి మదీనా మీదుగా దిల్‌సుక్‌నగర్‌ వెళ్లే రహదారి, కోఠి నుంచి కాచిగూడ, శంకర్‌మట్‌, తార్నాక, ఓయు వెళ్లే మార్గం. సికింద్రాబాద్‌ నుంచి బేగంపేట్‌, పంజగుట్ట, జూబ్లీహిల్స్‌ వెళ్లే మార్గం. జూబ్లీహిల్స్‌ నుంచి ఫిలింనగర్‌ మీదుగా రాయదుర్గం వెళ్లే మార్గం, మొహదీపట్నం నుంచి రేతిబౌలి, రాయదుర్గం, గచ్చిబౌలి వెళ్లే మార్గం. రేతిబౌలి నుంచి ఆరాంఘర్‌ వెళ్లే మార్గం, అమీర్‌పేట్‌ నుంచి యూసుప్‌గూడ మీదుగా కృష్ణానగర్‌, జూబ్లీహిల్స్‌ చెక్‌ పోస్టు వెళ్లే మార్గం నిత్యం వాహనదారులకు నరకాన్ని చూపుతున్నాయి. నగరంలో ప్రస్తుతం వాహనాల సగటు వేగం 12 కిలోమీటర్లలోపే నంటే ఆశ్చర్యం కలిగించకమానదు.

మెట్రో రైలు పథకం వల్ల కేవలం ఎల్‌బి నగర్‌, నాగోల్‌, సికింద్రాబాద్‌, అమీర్‌పేట్‌ వరకు అక్కడి నుంచి మియాపూర్‌ వరకు గల 30 కి లోమీటర్ల దూరం వరకు ట్రాఫిక్‌ కష్టాలు కొంత వరకు తీరే అవకాశాలున్నాయని మొదట్లో భావించినా దీనివల్ల రోడ్‌ ట్రాఫిక్‌ కష్టాలు ఏ మాత్రం తీరలేదని తేలిపోయిం ది. గత నవంబర్‌ నెల 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోది నాగోల్‌-మియాపూర్‌ మార్గాన్ని ప్రారంభించడం తెలిసిందే. మొదట్లో ఈ ప్రాజెక్టుపై అంచనాలు భారీగానే వున్నా ఆ తరువాత ఆశించినంతగా విజయం సాధించలేక పోయింది. మొదటి దశ తీరు ఇలావుంటే సోమవారం నాడు మెట్రో రెండవ దశను గవర్నర్‌ నరసింహన్‌ ప్రా రంభించారు. వాస్తవానికి మొదటి దశతో పోలిస్తే రెండవ దశ మార్గం రోడ్‌ ట్రాఫిక్‌ తీవ్రంగా వున్న మార్గంగా చెప్పాలి.

ఈ మార్గంలో మెట్రో రైల్‌ సర్వీసులు బాగా న డిస్తే కచ్చితంగా రోడ్‌ ట్రాఫిక్‌ తగ్గే వీలుందని నిపుణులు అంటున్నారు. అయితే మెట్రో రైలు ప్రయాణం తక్కువగానే వున్నా టికెట్‌ ధరలు మరీ ఎక్కువగా వుండడం, మెట్రో స్టేషన్లలో మౌలిక వసతుల లేమి ప్రయాణీకులకు కష్టంగా మారాయి. దీని కారణంగా మెట్రోలో ప్రయాణించే వారు తక్కువగా వుండే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఇదే జరిగితే మెట్రో వల్ల రోడ్‌ ట్రాఫిక్‌ తగ్గుతుందని భావిస్తున్న రవాణా, పోలీసు విభాగాలకు భంగపాటు తప్పక పోవచ్చు. వాస్తవానికి ఎల్‌బి న గర్‌ నుంచి మియాపూర్‌కు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే కనీసం గంటన్నర నుంచి రెండు గంటల సమయం పడుతుండడం తెలిసిందే.

ఇదే మెట్రోలో అయితే 50 నుం చి 55 నిమిషాల వ్యవధిలో వెళ్లే వీలుందని మెట్రో వర్గాలు చెబుతున్నాయి. ఈ ఒక్క అంశం మెట్రోలో ప్రయాణీకులు వెళ్లేందుకు ఇష్టపడేలా చేస్తున్నాయి. అయితే టెకట్ల ధరలు భారీగా వుండడంతో పాటు ఇతరత్రా అనేక కారణాలు మెట్రో రైలుకు మైనస్‌ పాయింట్‌గా మారుతున్నాయని నిపుణుల వాదన. వీటిని అధిగమించి రోడ్‌ ట్రాఫిక్‌ను తనవైపుకు తిప్పుకుంటే మెట్రోకు లాభాల పండ పండడంతో పాటు రోడ్‌ ట్రాఫిక్‌ సమస్యలను కూడా తీర్చినట్లవుతుందని నిపుణలు చెబుతున్నారు. ఇది ఏ మేరకు ఫలితాలిస్తాయో…? చూడాల్సి వుంది.
మెట్రో రైలు పథకాన్ని దూర ప్రాంతాలకు విస్తరించాలంటున్న నిపుణులు
ఇదిలావుండగా మెట్రో రైలు పథకాన్ని ఓవైపున భువనగిరి నుంచి సంగారెడ్డి వరకు ఇంకో వైపున షాద్‌నగర్‌ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం మీదుగా ఆరాంఘర్‌ , అత్తాపూర్‌, రేతిబౌలిల నుంచి గచ్చిబౌలి వరకు, మరో వైపున సికింద్రాబాద్‌ నుంచి శామీర్‌పేట్‌ వరకు విస్తరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా భువనగి రి, సంగారెడ్డిల వరకు మెట్రో రైలు పథకం విస్తరిస్తే తెలంగాణలోనే అత్యంత రద్దీ మార్గంగా వున్న ఈ మార్గంలోని రహదారులపై ట్రాఫిక్‌ రద్దీ చాలా వరకు తగ్గుతుందని, దీని వల్ల వాహన కాలుష్యం తగ్గి ప్రజారోగ్యం మెరుగు పడుతుందని వారంటున్నారు. ఇదే సమయంలో సికింద్రాబాద్‌ నుంచి ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువగా వున్న మరికొన్ని మార్గాలను గుర్తించి అక్కడ కూడా మెట్రో రైలు పథకాన్ని విస్తరించాలని నిపుణులు సూచిస్తున్నారు.