రోగులకు పాదరక్షలు

DIABETIC CHAPPAL
DIABETIC CHAPPAL

రోగులకు పాదరక్షలు

కాళ్ల సమస్యలతో బాధపడే మధుమేహ రోగులు, ముఖ్యంగా మహిళలు హావాయి చెప్పులకు దూరంగా ఉండడమే మంచిదంటున్నారు పరిశోధకులు. ప్రతిసంవత్సరం భారత్‌లో మధుమేహ రోగుల్లో ఇన్‌ఫెక్షన్లవల్ల కాళ్లు తీసివేసే కేసులు వేలల్లో నమోదవుతున్నాయి. మధుమేహ రోగులకు నొప్పి అంత త్వరగా గ్రహణకు రాకపోవడం వల్ల గాయాలు, పుళ్లుగా మారి తగ్గడానికి చాలా సమయం తీసుకుంటాయి. తీవ్రమయిన మధుమేహ పరిస్థితుల్లో ఇన్‌ఫెక్షన్‌ వచ్చి కాళ్లు తీసివేయాల్సి వస్తుంది.

మధుమేహ రోగి గాజు ముక్కమీద గానీ, గుండుపిన్నులు, బ్లేడు వంటి వాటి మీద కాళ్లు వేసి గాయమయినా వెంటనే గుర్తించలేరు. ఈ కారణంగా ఆ గాయాలు పుళ్లు గా మారే వరకు పెద్దగా పట్టించుకోకపోవడం, చివరికి ఇన్‌ఫెక్షన్‌ వచ్చినపుడు డాక్టర్‌ దగ్గరికి వెళ్లినా ఫలితం లేకపోవడం వల్ల కాలు తీసివేయడం మినహా గత్యంతరం ఉండదు. సాండిల్స్‌ కూడా వేళ్లను గట్టిగా పట్టి ఉంచేవి వాడకుండా ఉండడమే మంచిది. ఒత్తిడికి వేళ్లు పుళ్లుపడే అవకాశం ఉంది. అలాగే ఎక్కువ ఎండ ఉన్న సమయంలో వట్టికాళ్లతో నడవడం అంత మంచిది కాదు. గుళ్లు, గోపురాలకు వెళ్లిన సమయంలో ప్రదక్షిణలు చేసేటపుడు ఎండగా ఉన్నా పట్టించుకోకుండా ప్రదక్షిణలు చేస్తారు. ఎండ సమయంలో కాళ్లకు చెప్పులు లేకుండా నడవడం వల్ల ఎండవేడికి కాళ్లు కాలి ఇది పాదాల అల్సర్‌కు దారితీస్తుంది. కాబట్టి మధుమేహ రోగులు చెప్పుల ఎంపికలో ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి.