మానసిక ఆందోళన

Tension
Tension

మానసిక ఆందోళన

సాధారణంగా ఆందోళన అనేది ఏదైనా ఒత్తిడితో కూడిన పరిస్థితిని అనుసరించి ఏర్పడుతుంది. అయితే, ఒక్కొక్కసారి స్పష్టమైన కారణమంటూ లేకపోయినప్పటికీ కొంతమందికి ఆందోళన ఏర్పడుతుంటుంది. ఆందోళన మనస్తత్వం ఉన్నవారికి జీవితమంతా ఆందోళనగానే గడిచిపోతుంది. భయో ద్రేకం, శంక, ఊహాకల్పన, కలతల వంటివి కలిసి కట్టుగా కనిపించే మానసిక వ్యాధి అతిగా ఆందోళన చెందడం. నిజానికి కొద్దిపాటి ఆందోళన ఉన్నట్లయితే అది మనల్ని బాధ్యతాయుతంగా, మనస్సును కేంద్రీ కరించేలాగా చేస్తుంది.

ఈ ఆందోళన మితిమీరితే అప్పుడు అసలైన సమస్య వస్తుంది. ఆందోళన వల్ల ఆలోచనలు సక్రమంగా కలుగవు. దీని ప్రభావం రోజువారీగా చేసే వివిధ రకాల పనుల మీద పడుతుంది. ఫలితంగా వాటిని పూర్తిస్థాయిలో చేయలేకపోతారు. కేవలం మానసిక ఒత్తిడే కాకుండా, వివిధ రకాల శారీరక రుగ్మతలు సైతం ఆందోళనను ఎక్కువ చేస్తాయి.

తీవ్ర ఒత్తిడి:
కొంతమందికి ఒత్తిడి లేకపోతే వెలితిగా అనిపిస్తుంది. అనేక మందికి మాత్రం ఒత్తిడి ఉంటే ప్రశాంతత లోపిస్తుంది. పని ఒత్తిడి, అపార్థాలు, తాహతకు మించిన జీవన విధానాలు, సంసార జీవితంలో పొర పచ్చాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, దీర్ఘకాలంగా బాధించే వ్యాధులు, విడాకులు… ఇలాంటివన్నీ ప్రశాంతంగా సాగిపోతున్న జీవితాల్లో ప్రకంపనలు సృష్టిస్తాయి. ప్రారంభంలో ఈ సమస్యల తాలూకు ప్రభావా నికి వ్యతిరేకంగా శరీరం తనను తాను మార్చు కోవడంతో శారీరక లక్షణాలు బైటకు తెలియకుండా ఉంటాయి. అయితే, సమస్యల బలం పెరిగినా, శరీరపు శక్తియుక్తులు తగ్గినా శరీరపు యంత్రాంగం ఒత్తిడికి తలొగ్గుతుంది.

ఫలితంగా వివిధ రకాలైన శారీరక లక్షణాలు – ఒణుకు, గుండెదడ, చెమటలు, వేగంగా గాలి పీల్చుకోవడం, కడుపులో దేవుతున్నట్లు ఉండటం, కళ్లు తిరగడం, ఛాతి నొప్పి – మొదలైనవన్నీ కనిపిస్తాయి. ఒత్తిడిని గుర్తించకుండా ఈ శారీరక లక్షణాలను మాత్రమే తగ్గించుకోవాలని ఎంత మంది డాక్టర్ల చుట్టూ తిరిగినా, ఎన్ని మందులు వాడినా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఆయుర్వేదంలో వివిధ రకాలైన వ్యాధులకు మూడు రకాలైన చికిత్సా పద్ధతులను చెప్పారు. అవి – దైవ వ్యపాశ్రయ చికిత్సలు, యుక్తి వ్యపాశ్రయ చికిత్సలు, సత్వావజయ చికిత్సలు. సత్వం అంటే మనస్సు. సత్వావజయ చికిత్సలంటే మనసుకు చేసే చికిత్సలు.

మనస్సు ఉభయేంద్రియం. అంటే జ్ఞానాన్ని గ్రహించే జ్ఞానేం ద్రియంగానూ, వివిధ పనులను చేసే కర్మేంద్రియంగానూ పని చేస్తుంది. శరీరమూ, మనస్సూ పరస్పరం ప్రభావం చూపుకొని వ్యాధులకూ, వ్యాధుల నుంచి విముక్తికీ కారణమవుతాయి. మనస్సు ఒక జలనిధిలాంటిది. ఒకవేళ నీటి అడుగున ఎక్కడో కదలిక ఏర్పడి.. ఒక చిన్న గాలి బుడగ ఏర్పడితే అది నీటి ఉపరితలంపైకి వచ్చే సరికి పరిమాణాన్ని పెంచుకుని పెద్దగా కనిపిస్తుంది.

ఒత్తిడి వలన కలిగే సమస్యలూ అటువంటివే. వాటిని ప్రకంపనల స్థాయిలోనే అరికడితే, అలజ డులుగా మారవు. ఈ సమస్యకు ఆయుర్వేదం సూచించిన పరిష్కారం అద్రవ్యభూత చికిత్సలు. అంటే జపం, ధ్యానం, మంత్రం, కామక్రోధాది అరిషడ్వర్గాలను నియంత్రించుకోవడం, వీటిస్థానంలో త్యాగం, ప్రేమ, జాలి, దయ, సహాయత, నిర్మలత్వాలతో భర్తీ చేయడం, ఆలోచనా విధానాల్లో స్పష్టతను ఏర్పరచుకోవడం… ఇలాంటి ద్రవ్యాలుకాని వాటితో చికిత్సలు చేయాలి. వీటితోపాటు శారీరక వ్యాధులకు కూడా చికిత్స చేయాలి.

భయం అనేది మనలను మనం అహితమైన విషయాలనుంచి రక్షించుకునేలా చేస్తుంది. విశృంఖల శృంగార జీవితాన్ని గడిపే వారికి సుఖవ్యాధులకు సంబంధించిన భయాలు, ఆరోగ్యానికి హాని కలిగించే ధూమపానం వంటి అలవాట్ల వైపు ఆకర్షితులయ్యే వారికి ప్రాణాంతకమైన కేన్సర్‌ వంటి వ్యాధుల గురించిన భయాలు… ఇలా అనేకరకాలైన భయాలు మనుష్యులను అదుపాజ్ఞల్లో పెడుతుంటాయి. ఇది మితిమీరితే ఇబ్బంది.

ఇటు వంటి ‘అర్థంలేని భయాలను ఫోబియాలంటారు. తనకు ఉన్నది అర్థంలేని భయమేనని బాధితుడికి అనిపిస్తుంటుంది. అయినా దానిని అదుపులో పెట్టు కోలేరు. భయం, దాని లక్షణాలు, చికిత్స గురించి ఆయుర్వేదం క్షుణ్ణంగా చర్చించింది.

ఉదాహరణకు విరేచనాల విషయమే తీసుకుంటే ఇవి ఇన్‌ఫెక్షన్ల వల్ల కలుషితాహారాల వల్ల ప్రాప్తిస్తాయని నవీన వైద్యశాస్త్రం చెబుతుంది తప్పితే అంతకు మించిన వివరాలు మనకు లభించవు. అయితే ఆయుర్వేదం విరేచనాలకు పై కారణాలతోపాటు భయాన్ని కూడా కారణంగా చూపుతూ ‘భయాతిసారం అనే వ్యాధి గురించి పేర్కొంది.

భయాతిసారం అంటే భయం కారణంగా కలిగే అతిసారం అని అర్థం. ఇది చాలా మందికి అనుభవమవుతూనే ఉంటుంది. ఏదైనా భయాన్ని గొలిపే అంశం విన్నప్పుడు లేదా ఎదురైనప్పుడు చాలా మందికి విరేచనాలవుతాయి. చికిత్సాపరంగా ఇక్కడ ఆసక్తిని గొలిపే మరొక అంశముంది. ఎలాగైతే భయం అనేది ఒక వ్యాధికి కారణమయిందో, ఆశ్వాసనం లేదా ధైర్యం అనేది వ్యాధిని తగ్గిస్తుంది. ఈ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకునే ఆయుర్వేద చికిత్సలు రూపుదిద్దుకున్నాయి. భయాలను తిరగ్గొట్టి ఆశ్వసనాన్ని కలి గించడమెలా? దీనికి ఆయుర్వేదం ఎంచుకున్న చికిత్సావిధానం ఓకసాత్మ్యం. ఓక అంటే అభ్యాసం.

సాత్మ్యం అంటే అలవాటు. అంటే వివిధ చికిత్సా విధానాలతో క్రమక్రమంగా మనస్సును రాటుతేలేలాగా చేయడం. ఆయుర్వేద దృక్పథం ప్రకారం శారీరక దోషాలైన వాతపిత్త కఫాలు మనోదోషాలైన రజఃతమస్సులను పెరిగిపోయేలా చేసి వ్యాధులు కలగడానికి కారణమవుతాయి. భయం వాత ప్రకోపం వల్ల ఏర్పడే మానసిక వ్యాధి. దీనికి వాతకులాంతక రస వంటి వాత శ్యామక ఔషధాలతోపాటు అభ్యంగనం, ధారాకల్పం, వస్తి కర్మవంటి వాతహర చికిత్సా ప్రక్రియలు అవసరమవుతాయి.