గర్భిణీలకు సోకే వైరల్‌ హెపటైటిస్‌

Pragnancy
Pragnancy

గర్భిణీలకు సోకే వైరల్‌ హెపటైటిస్‌

గర్భిణీ స్త్రీలలో మూడు శాతం వైరల్‌ హెపటైటిస్‌ సోకుతుంది. ఇది పోషకాహారలోపం, అపరిశుభ్రత, జనసామార్ధ్యం ఎక్కువగా ఉన్న మురికివాడల్లో నివసించే గర్భిణుల్లో కనిపిస్తుంది. ట్రోపికల్‌ ఏరియాల్లో ఇది ఎపిడమిక్‌గా ప్రబలే అవకాశముంది. ఇతర మహిళల కన్నా గర్భిణి రెండింతలు ఎక్కువగా హెపటైటిస్‌కు గురవ్ఞతారు. ముఖ్యంగా మూడవ ట్రెమిష్టర్‌లో (7-9నెలలమధ్య) ఎక్కువగా పచ్చకామెర్ల వ్యాధికి గురయ్యే అవకాశం ఉంది. కారణాలు: గర్భం రాకముందే లివర్‌ వ్యాధి ఉన్నట్లయితే గర్భస్రావం జరగడం బిడ్డ తగినంత ఎదగక పోవటం వంటివి ఉంటాయి.

మలేరియా జ్వరం వచ్చిన వారిలో లివర్‌ సమస్య వస్తుంది. ఫ్రీ ఎ క్లాంప్సియా, హీమోలైటిస్‌ జాండీస్‌, మందుల వల్ల , ఇన్‌ఫెక్షన్స్‌ ముఖ్యంగా వైరస్‌ ఇన్‌ఫెక్షన్స్‌ వల్ల వస్తుంది. రకాలు: మూడురకాల వైరల్‌ ఇన్‌ఫెక్షన్స్‌ వల్ల వస్తుంది. హెపటైటిస్‌ ఎ , హెపటైటిస్‌ బి, నాన్‌ ఎ, నాన్‌ బి వ్యాప్తి: తాగే నీరు కలుషితం కావటం, బ్లడ్‌ట్రాన్స్‌ప్యూజిన్‌ వల్ల , స్టెరిలైజ్‌ చేయని సూదులతో ఇంజెక్షన్‌ ఇవ్వడం వల్ల వస్తుంది. ఒకరికి వాక్సిన్‌ వేసి అదే సూదితో మరొకరికి వాక్సిన్‌ వేసిన పచ్చకామెర్లు వస్తాయి. కలుషితమైన పాలు, డయాలసిస్‌ , ఆహారపదార్ధాల్ని నిల్వఉంచే రసాయనాలు, లైంగిక సంపర్కం, ఆహారపదార్థాలకు పట్టే బూజు, తల్లి నుంచి పిల్లలకు, వ్యాధిగ్రస్తుల్ని కొరికి గాయపర్చిన పచ్చబొట్లు పొడిపించుకోవడం, ముక్కు,చెవులు కుట్టించుకోవడం,వ్యాధిగ్రస్తులు వాడిన రేజర్లు, టూత్‌బ్రష్‌లు వాడినప్పుడు వస్తుంది. ఇది కలుషిత ఆహారం, మలం మీద వాలిన ఈగలు ఆహారపదార్థాల మీద వాలితే ఆ ఆహారం తిన్న వాళ్లకు వస్తుంది.

మనదేశంలో ఈ వ్యాధి సంవత్సరం పోడవునా కన్పించినా ముఖ్యంగా వర్షాకాలంలోనే ఎక్కువని చెప్పాలి. ఎవరికి రిస్క్‌ ఫ్యాక్టర్స్‌: గర్భిణీలు, పిల్లలు, హోంసెక్సువల్స్‌, కిడ్నీపేషెంట్స్‌, డయాబెటిక్‌ పేషెంట్స్‌,రక్తం గడ్డకుండా వాడే మందులు వాడేవారు, డ్రగ్స్‌ వాడేవారిలో ఎక్కువ. రక్తహానత, పోషకాహారలోపం ఉన్నవారిలో సెక్స్‌వర్కర్స్‌, లాబ్‌ టెక్నీషియన్స్‌ బ్లడ్‌ డోనర్స్‌లలో ఎక్కువ రిస్క్‌ ఉంటుంది. హెపటైటిస్‌ ఎ: ఇది ఎంటరోవైరస్‌ వల్ల వస్తుంది. దీన్నే ఇన్‌ఫెక్టివ్‌ హెపటైటిస్‌ అని అంటారు. ఇది అంటువ్యాధి. ఇంట్లో కాని హెపటైటిస్‌ ఎ రోగి తిరిగే ప్రాంతంలో ఎవరున్నా ఇతరులకి వ్యాపిస్తుంది. నీటి కాలుష్యంవల్ల , బహిరంగ మలవిసర్జన వల్ల, మల విసర్జన తర్వాత చేతులు శుభ్రపరుచుకోకపోవటం వల్ల వ్యాధిగ్రస్తుల మలంలో వ్యాధి క్రిములు ఎక్కువగా ఉండి వర్షాకాలంలోనీరు కలుషితమైనప్పుడు ఆ నీరు తాగటం వల్ల అందరికి హెపటైటిస్‌ లక్షణాలు కన్పిస్తాయి.

దీన్నే ఎపిడమిక్‌ హెపటైటిస్‌ అంటారు. పచ్చకామెర్లు బైటికి కనపడక రెండు వారాల ముందు కన్పించిన తర్వాత ఒక వారం వరకు వ్యాధిగ్రస్తుడు వేరేవారికి ఈ వ్యాధి కలిగిస్తాడు. లక్షణాలు: పచ్చకామెర్లకి సంబంధించిన వైరస్‌ క్రిములు శరీరంలోకి చేరిన 15-35 రోజులకు వ్యాధి లక్షణాలు బైట పడతాయి. పచ్చకామెర్లు వచ్చే ముందు నీరసం, కొద్దిపాటి పనికే అలిసిపోవడం, వికారంగా ఉండి ఏమీ తినలేకపోవడం ఉంటుంది. కడుపులో ఇబ్బంది, వాంతులు, ఆకలి తగ్గడం, ఒళ్లునొప్పులు, కీళ్లనొప్పులు, తలనొప్పి,ఫ్లూ జ్వరం లాగా చలి,వణుకు, జ్వరం 100-102 డిగ్రీలు ఉంటుంది. వెలుతురు చూడలేకపోవడం, గొంతునొప్పి, ముక్కునుండి నీళ్లుకారడం, భోజనం రుచించదు. వాసనలు సహించవు.

3-7 వరోజు కళ్లు పచ్చగా మారి మూత్రం పచ్చగా వస్తుంది. కొందరిలో విరోచనాలు, వికారం, పొట్టఉబ్బరం, ఉంటాయి. కాలేయం సైజు పెద్దదవటం వల్ల కడుపునొప్పి, మంట ఉంటుంది. చర్మంపై దద్దుర్లు, దురదలుంటాయి. మలం తెల్లగా ఉంటుంది. లివర్‌ కణాలు ఇన్‌ఫెక్షన్‌ వల్ల ఉబ్బిపోవడంతో పసరు (పైత్యం) సరిగా ప్రవహించక పోవడం వల్ల తెల్లటి విరోచనాలుంటాయి. యూరిన్‌లో బిలురుబిన్‌పోవడం వల్ల మూత్రం పచ్చగా, చిక్కగా ఉంటుంది. కుడిచేయి వైపు మెడలోని లింఫ్‌ గ్రంధులు వాచి ఉంటాయి. కామెర్లు రెండు వారాల తర్వాత తగ్గుముఖం పడుతుంది. వ్యాధి తగ్గడానికి 6-10 వారాలు పడుతుంది. పచ్చకామెర్లు వచ్చిన తర్వాత తిరగబెట్టడం అరుదు.

కొందరిలో క్రానిక్‌ హెపటైటిస్‌గా మారే ప్రమాదముంది. హెపటైటిస్‌ బి : హెపటైటిస్‌ బి వైరస్‌ వల్ల వచ్చే దీన్ని సీరం హెపటైటిస్‌ అంటారు. రక్తం,లాలాజలం, వీర్యం ఈ వ్యాధి వ్యాప్తికి తోడ్పడుతుంది. వ్యాధి లక్షణాలు: వ్యాధి క్రిములు శరీరంలో ప్రవేశించిన 40-100 రోజుల్లో వ్యాధి లక్షణాలు కన్పిస్తాయి. ఇది మూడు దశలలో ఉంటుంది. మొదటిదశ: ఆకలి తక్కువగా ఉండి వాంతులు, అలసట, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు తలనొప్పి గొంతునొప్పి, జ్వరం, జలుబు, దగ్గు, కామెర్లు కలగడానికి 1-2 వారాల ముందు నుంచి ఉంటుంది. రెండవదశ: 1-5 రోజుల ముందు నుంచి మూత్రం పచ్చగా మలం బంక మట్టి రంగులో ఉంటుంది. కాలేయం పెద్దదిగా ఉండి తాకితే నొప్పిమూత్రం, చర్మం, కళ్లు పచ్చగా అవుతాయి.

– డాక్టర్‌. కె.ఉమాదేవి, తిరుపతి