మెనోపాజ్‌ ఇబ్బందులు

 MENOPAUSE
MENOPAUSE

మెనోపాజ్‌ ఇబ్బందులు

బిడ్డకు జన్మనిచ్చే వయస్సుమళ్లాక ప్రతి మహిళా తన జీవితంలో ‘మెనోపాజ్‌ దశకు చేరుతుంది. మహిళలందరూ అనుభవించే శారీరక ప్రక్రియ ఇది. ఈ దశ 30వ దశకం నుంచి అరవైలదాకా ఎప్పుడైనా రావచ్చు. ఎన్నాళ్లైనా కొనసాగవచ్చు. మహిళ ఈ దశకు వచ్చేనాటికి ఆమెకింకా మూడోవంతు జీవనం మిగిలి ఉంటుంది. మరెన్నో ఆరోగ్యవంతమైన సంవత్సరాలు హాయిగా గడిపేయాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవల్సిందే. మెనోపాజ్‌ లక్షణాలేమిటో, ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో తెలుసుకుందాం. ఈ దశలో సహజ సెక్స్‌హార్మోన్లు-ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టరాన్‌లను ఓవరీలు తక్కువస్థాయిలో ఉత్పత్తినారంభిస్తాయి. ఈస్ట్రోజన్‌ మహిళ స్తనాలు, గర్భసంచిల సాధారణ అభివృద్ధిని మెరుగుపరుస్తూ, ఓవ్ఞ్యలేషన్‌ ప్రక్రియను నియంత్రిస్తూ, మహిళ శారీరక, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన అంశాల్ని ప్రభావితం చేస్తుంది. ప్రొజెస్టరాన్‌ బుతుక్రమాన్ని నియంత్రిస్తూ యుటిరస్‌ లైనింగ్‌ను అండాన్ని స్వీకరించడానికి సంసిద్ధపరుస్తుంది.

ఈ రెండు హార్మోన్ల ఉత్పత్తిస్థాయి తగ్గుతున్నప్పుడు వివిధ ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటారు. అయితే ఇదంతా వయస్సురీత్యా కలిగే ప్రభావాలే కాని, ఆరోగ్య సమస్యలు ఏమేమి ఉంటాయో తెలుసుకుని సరైన పోషకాహారం తీసుకుంటూ వ్యాయామాలు చేస్తుంటే చాలా మంచిది. ఈ ‘మార్పు రకరకాలుగా కనిపిస్తుంది. కొందరికైతే చెప్పుకోదగ్గ లక్షణాలేవీ కనిపించవ్ఞ లేదా ఏవో చిన్నచిన్న సమస్యలు మాత్రం ఉంటుంటాయి. చాలామందిలో హాట్‌ఫ్లషెస్‌, మూడ్స్‌లో తేడా వంటివి తలెత్తి దైనందిన జీవితంలో ప్రతికూల ప్రభావం చూపుతాయి. వీటి నుంచి తప్పించుకోవడం కోసం చాలామంది హార్మోన్‌ థెరపీ తీసుకుం టుంటారు. అయితే దీర్ఘకాలిక థెరపీల వల్ల ఇతరత్రా సమస్యలు తలెత్తవచ్చు. వేడి ఆవిర్లు, వెజినల్‌ డ్రైనెస్‌, నిద్రలేమి మెనోపాజ్‌ దశలో ఎక్కువమంది మహిళలు ఎదుర్కొనే సమస్యలు. దీర్ఘకాలం హార్మోన్లలేమి ఉంటే ఆస్టియోపోరోసిస్‌, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదు. హాట్‌ ఫ్లషెస్‌తో పాటు కొన్నిసార్లు బాగా చమటలు పట్టేస్తాయి.

ఈస్ట్రోజెన్‌ స్థాయిలు తగ్గుతున్నప్పుడు శరీరం ప్రతిస్పందించే లక్షణమిది. హాట్‌ ఫ్లషెస్‌ 30 సెకన్ల నుంచి ఐదు నిమిషాలదాకా ఉండి, ఈ సమయంలో హార్ట్‌బీట్స్‌శీఘ్రంగా ఉంటాయి. శారీరక ఉష్ణోగ్రత పెరుగు తుంది. ఆస్టియో పోరోసిస్‌ వల్ల ఫ్రాక్చర్ల అవకాశం ఎక్కువ. మెనోపాజ్‌, గుండెజబ్బుల అవకాశాల్ని పెంచుతుందని చాలామంది మహిళలకు తెలియదు.

మెనోపాజ్‌ కొంత గందరగోళాన్ని సృష్టిస్తుంది. అలాగే ప్రత్యామ్నాయాలు క్లిష్టంగా ఉన్నట్లు కనిపిస్తాయి. ప్రతి మహిళ కూడా మెనోపాజ్‌ పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలి. తమకు ఏది సరైనదో స్పష్టంగా తెలుసుకుని ఆ దిశగా చర్యలు ప్రారంభించాలి. మెనోపాజ్‌కు ముందు అత్యధిక కొవ్ఞ్వ గల డైట్‌ వల్ల కలిగే ప్రభావాల నుంచి ఈస్ట్రోజెన్‌ కాపాడుతుంది. దీనివల్ల గుండెజబ్బుల అవకాశాలు అదే వయస్సులోని పురుషుల కంటే మహిళలకు తక్కువగా ఉంటాయి. మెనోపాజ్‌ దశలో, ఆ తర్వాత ఈస్ట్రోజెన్‌ స్థాయిలు తగ్గిపోతాయి. దీనివల్ల మంచి కొలెస్ట్రాల్‌ తగ్గి చెడు కొలెస్ట్రాల్‌ పెరగనారంభిస్తుంది.

ఫలితంగా ఈ దశలోని మహిళలకు అదే వయస్సులో గల పురుషుల కంటే గుండె జబ్బుల అవకాశాలు ఎక్కువ అవ్ఞతాయి. కాబట్టి మెనోపాజ్‌ దశలోని స్త్రీలు మాంసాల్లోని శాచురేటెడ్‌ ఫ్యాట్‌ పూర్తి కొవ్ఞ్వ ఉండే డెయిరీ పదార్థాలు, ఇతర జంతు సంబంధిత ఉత్పత్తుల్ని తగ్గించాలి. లీన్‌మీట్స్‌, లోఫ్యాట్‌ డెయిరీ పదార్థాలు తింటుండాలి. కుకీలు వంటి ప్రాసెస్‌ చేసిన పదార్థాలు తగ్గించాలి. కాఫీ, టీ ఇతర శీతల పానీయాల్లో ఉండే కెఫైన్‌ను తగ్గించాలి. ఎక్కువ కెఫైన్‌ వల్ల క్యాల్షియాన్ని నష్టపోవాల్సి వస్తుంది. అయితే కొన్ని కప్పుల వరకు కాఫీ, టీలు పర్వాలేదు. కాఫీ, టీలు అనేక సందర్భాల్లో అవసరమైన పానీయాలే. మెనోపాజ్‌ దశకు చేరిన మహిళలందరూ కూడా ముందుగానే సమస్యల్ని అవగతం చేసుకుని, ఆ దిశగా తగిన ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటే తరువాత జీవితం ఆనందమయంగా ఉంటుంది.