ఆహారం ఔషధమే!

                                        ఆహారం ఔషధమే

FOOD
FOOD

ఆరోగ్యం బాగుండాలంటే ముందుగా మనం తీసుకునే ఆహారం బాగుండాలి. సాధారణంగా రోజూ తినే ఆహారమే అయినప్పటికీ శరీర పెరుగుదలకు, ఆరోగ్యంగా ఉండటానికి రోజూ తీసుకునే పదార్థాలే కాకుండా అదనంగా కొన్ని తీసుకోవాల్సి ఉంటుంది. చాలా వరకు మనకు అందుబాటులో ఉండేవే తీసుకోవచ్చు. అయితే పదార్థాల ఎంపికలో జాగ్రత్త వహించాలి. ఎందుకంటే వాతావరణం మార్పులు. శరీరతత్వాలు వంటి సందర్భాలను గుర్తించి అందుకు తగిన పదార్థాలను తీసుకోవడం, సీజనల్‌గా దొరికే పండ్లు, కూరగాయలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొంత వరకు దోహదం చేస్తాయి. ముఖ్యంగా మన ఆహారాపదార్థాలలో తినటానికే కాకుండా ఔషధాలుగా ఉపయోగపడేవి కూడా ఉన్నాయి. ప్రపంచానికి భారతదేశం అందించిన సంపద ఆయుర్వేదం క్రీ.పూ. అయిదో శతాబ్దంలోనే చరకుడు చరకసంహితలో ఆయుర్వేద వైద్యం గురించి తెలిపాడు. భారతీయ జీవన విధానంలోనే శాస్త్రీయత ఇమిడి ఉంది. కూరల్లో వాడే పసుపు దగ్గర నుంచి ఇంగువ వరకు ప్రతి ఒక్క పదార్థానికీ ఒక ఔషధ గుణం ఉంది.

మన వంటకాలు రుచికరమే కాక ఆరోగ్యవంతమని నిపుణులు చెపుతుంటారు. ఇప్పుడు జలుబు చేసినా, కడుపులో ఇబ్బందిగా ఉన్నా మెడికల్‌ దుకాణానికి పరుగెత్తడం పరిపాటిగా మారింది. ఇలా విచక్షణ లేకుండా మందులు వాడటం ఆరోగ్యానికి హానికరమని వైద్యులే హెచ్చరిస్తున్నారు. నగరాల్లో ఔషధాల వాడకం మరీ ఎక్కువ. పెద్దలు చెప్పిన చిన్న చిన్న చిట్కాలతో ఇలాంటి వాటిని నియంత్రించవచ్చు. వంటింట్లో ఉన్న పోపుల డబ్బాలో ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయి. మిరియాలు, జీలకర్ర, ఇంగువ, నువ్ఞ్వలు, దాల్చిన చెక్క, అల్లం, శొంఠికి చాలా వ్యాధులను నయం చేసే శక్తి ఉంది. కాకపోతే వాటిని ఎలా వినియోగించాలో తెలుసుకుంటే మంచిది. కూరల్లోనే కాకుండా ప్రత్యేకంగా వాటితో కషాయాలు, చూర్ణాలు తయారు చేసుకుని తీసుకుంటే కొన్ని జబ్బుల నుంచి ఉపశమనం కలుగుతుంది. పసుపు కూరలకే కాకుండా శరీరానికీ రంగును ఇస్తుంది. స్త్రీలు సౌభ్యాగంగా భావించే పసుపు చర్మరోగాలను నయం చేస్తుంది. జలుబు, గొంతునొప్పి తగ్గడానికి వేడిపాలల్లో పసుపు పొడి వేసుకుని తాగాలి.

ఉసిరి కాయ చూర్ణాన్ని పసుపుతో కలిపి తీసుకుంటే మధుమేహం నియంత్రణలో ఉంటుంది. పసుపును కొంచెం నెయ్యిలో కలిపి తీసుకుటే గర్భాశయం శుద్ధి అవ్ఞతుంది. అల్లం, శొంఠి కడుపు ఉబ్బరానికి బాగా పనిచేస్తుంది. దగ్గు, శ్వాస, హృద్రోగ, జ్వరం, రక్తహీనతను తగ్గిస్తాయి. అల్లం రసాన్ని తేనెలో కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు తగ్గుతాయి. మూర్ఛ వచ్చినప్పుడు అల్లం రసాన్ని ముక్కులో నషంలాగా వేయడం వల్ల రోగి మూర్ఛ నుండి తేరుకుంటాడు. జీర్ణశక్తికి జీలకర్ర ఎంతో మంచిది. జీలకర్రను దోరగా వేయించి, మెత్తగా పొడిచేసి నెయ్యితో కలిపి తీసుకుంటే గర్భాశయం శుద్ధి అవడంతో పాటు, దృఢంగా మారుతుంది. ఇది ఆకలి, జీర్ణశక్తిని పెంచుతుంది. వెల్లుల్లిని క్యాన్సర్‌ నివారిణిగా చెప్పుకోవచ్చు. వెల్లుల్లి రెండు మూడు పాయలను మెత్తగా నూరి, పాలల్లో వేసి ఉడికించి తీసుకోవడం వల్ల పక్షవాతం, అర్దిత వాతం తగ్గుతాయి. దీనికి ఆంటీ బాక్టీరియల్‌ గుణం ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అనవసర కొవ్ఞ్వను నియంత్రించి రక్తప్రసరణ బాగా అయ్యేలా చేస్తుంది.

దాల్చిన చెక్క పెరిగిన షుగర్‌ లెవెల్స్‌ను తగ్గిస్తుంది. తొందరగా నీరసం రాకుండా చేస్తుంది. దీనిని చూర్ణంలాగా చేసి పాలల్లో కలిపి తీసుకోవచ్చు. చిన్న ముక్కను నోట్లో పెట్టుకుని చప్పరించాలి. మిరియాలు ఆకలిని, జీర్ణశక్తిని పెంచుతాయి. జలుబును దూరం చేస్తాయి. ఇందులోని క్రోమియం రక్తంలో గ్లూకోజ్‌ను తగ్గిస్తుంది. మధుమేహం ఉన్న వారి భోజనంలో దీనిని చేర్చవచ్చు. నొప్పిని ఉదర క్రిములను హరించే శక్తి దీనికి ఉంది. శ్వాస, శూల, హృద్రోగాలకు బాగా పనిచేస్తుంది. దీనితో మహా మరిచాది తైలం, అగ్నితుండి వంటి ఔషదాలు తయారు చేస్తారు. ఇంగువ బెల్లంతో కలిపి తీసుకుంటే ఒళ్లు నొప్పులు తగ్గుతాయి. దీనిని నెయ్యిలో కలిపి కడుపుపై లేపనంలాగా పట్టిస్తే ఉదరశూల తగ్గుతుంది. దీనితో హింగుత్రిగుణ తైలం, రజప్రవర్తినీ వటీ, హింగ్వాది గుటిక తయారు చేస్తారు. సహజ గుణాలున్న ఆహార పదార్థాలను వంటల్లో చేర్చాలి. ఆహారంతో మానసిక పరిస్థితి ప్రభావితమవ్ఞతుంది.