మంత్ర జ(జా)లం!

sun rises
sun rises

తానొకటి తలచిన దైవమొకటి తలచును అని పెద్దలు చెబుతారు. మరుక్షణంలో ఏమి జరుగుతుందో సామాన్య మానవులు కాదు కదా మహనీయులు, మహర్షులు కూడా చెప్పలేరు అనటానికి మహాభారతం అరణ్యపర్వం ద్వితీయాశ్వాసంలో చెప్పబడిన మాంధాత చరిత్ర ఒక్కటి సాక్ష్యం. యువనాశ్వుడనే రాజు ఉండేవాడు. ఆయన ఇక్ష్వాకు వంశానికి చెందినవాడు. ఆయన అనేక అశ్వమేధ యాగాలను చేసి భూసురులకు భూరి దక్షిణలిచ్చి సంతృప్తి చేశాడు. కానీ ఆయనకు ఎంత కాలానికీ సంతానం కలుగలేదు. సంతానం లేదన్న చింతతో రాజ్యభారాన్ని మంత్రులపై మోపి తపస్సు చేయటానికి ఆయన అడవులకు పోయాడు. మార్గమధ్యమున భృగుమహర్షి ఆశ్రమానికి వెళ్లి ఆయనను దర్శించి తన బాధను వ్యక్తపరచాడు. సంతానం కలిగే ఉపాయాన్ని చెప్పమని ఆయనను ప్రార్థించాడు.
భృగుమహర్షి యువనాశ్వునిచే పుత్రకామేష్టి జరిపించాడు. ఆ యాగమందు రాజునకు పుత్రోత్పత్తి నిమిత్తము మంత్రపూత జలపూర్ణంబైన కలశాన్ని ఏర్పాటు చేశాడు. ఆ జలాన్ని రాజపత్నిచే తాగించాలన్నది భృగుమహర్షి ఉద్దేశం. కానీ ఆ రోజు రాత్రి యాగోపవాసదీక్షితుడైన ఆ రాజుకు దప్పికయింది. ఆ మంత్ర జలాన్ని ఆయన తాగాడు. మరుసటి రోజు ఉదయాన రాత్రి జరిగిన విషయాన్నంతా భృగుమహర్షికి చెప్పాడు. అప్పుడు భృగుమహర్షి ఆయనతో ‘రాజా! ఆ మంత్రజలాన్ని నీ భార్యచే తాగించాలన్నది నా ఉద్దేశం. అపుడు ఇంద్ర సమానుడగు కొడుకు నీకు కలిగేవాడు. విధి విచిత్రము! జలాన్ని ఎవరు తాగితే వారి గర్భంలో కుమారుడు జన్మించుట తథ్యం. కాబట్టి నీ భార్య గర్భంలో జనించవలసిన వాడు నీ శరీరంలోనే జన్మిస్తాడు. ఇది తప్పదు అని చెబుతాడు. అయితే దానివల్ల ఆయనకు ఎలాంటి హాని కలుగకుండుటకు మరియొక యిష్టి చేయిస్తాడు. నూరేండ్ల తర్వాత యువనాశ్వునకు సూర్యుని లాంటి కొడుకు పుడతాడు. వానిని చూడటానకి ఇంద్రుడు వస్తాడు. అతని వెంట వచ్చిన దేవతలు జరిగినది తెలుసుకుని ఈ శిశువు ఏమి తాగి వర్ధిల్లుతాడు అని అడుగుతారు. అప్పుడు ఇంద్రుని చూపుడు వేలు ద్వారా అమృతాన్ని తాగి క్రమంగా పెరిగి పదమూడు జేనలంత వాడయ్యాడు. అందుకే వానికి మాంధాత అని పేరు స్థిరపడింది. వాడు ధ్యాన మాత్రమున వేదాలను, విలువిద్యను, అస్త్రవిద్యను నేర్చాడు. ఎన్నో అస్త్రశస్త్రాలను పొందాడు. సకల భూమండలానికి ప్రభువయ్యాడు. అనేక యజ్ఞాలను చేశాడు.
కానీ పండ్రెండేళ్లు అనావృష్టి సంభవించింది. జనులు క్షామపీడితులయ్యారు. ఇంద్రుని సమక్షంలోనే మాంధాత మేఘములను తన బాణములచే భేదించాడు. వాన సమృద్ధిగా కురిసింది. ప్రజలు సంతోషపడ్డారు. ఇది మాంధాత చరిత్ర. రాణి గర్భాన్ని దాల్చాలని భృగుమహర్షి తలిస్తే రాజే గర్భాన్ని దాల్చి పుత్రుని కన్నాడు. యగ్న యాగాదులు చేస్తే సమృద్ధిగా కురవాల్సిన వర్షాలు అలా కురవక మాంధాత మేఘాలను తన వాడి బాణాలచే భేదించినప్పుడు కురిశాయి. ఇది మహాభారతం స్పష్టం చేసే విషయం. మానవుడు చేయ కలిగింది కర్మ మాత్రమే. దాని ఫలితాన్ని నిర్ణయించేది, నిశ్చయించేది, జరిపించేది అంతా ఆ భగవంతుడే.
దైవాధీనం జగత్‌ సర్వం.

  • రాచమడుగు శ్రీనివాసులు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/