తులాధరుడు

Vasavi Ammavari mahatyam
Vasavi Ammavari mahatyam

వైశ్యకుల ఆకాశంలో దేదీప్యమానంగా వెలిసే తార తులాధారుడు. శతాబ్దాలు, సహస్రాబ్దులు గతించినా వన్నె తరగని మణి ఆయన. మహాభారతంలోనూ ఆయన్ను గురించిన ప్రస్తావన కనపడుతుంది. తులాధారుని కథ అత్యంత మహత్వపూర్ణమైనదని సాలంకాయన మహర్షి మణిగుప్తాదులకు చెబితే ఆయన్ను గూర్చి విపులంగా చ్పెమని వేడుకొంటారు వారు. అప్పుడు ఆయన వారికి ఇలా చెబుతాడు. జాజిలియను బ్రాహ్మణోత్తముడు అడవిలో తీవ్రమైన తపస్సు చేసేవాడు. కొంచమైనా చలించక కొయ్యవలె ఉండేవాడు.

రెండు కళింగ పక్షులు ఆయన జడలలో గుడ్లు పెట్టి నివసించేవి. జాజిలికి ఆ విషయం తెలిసినా ఆ పక్షుల స్వేచ్ఛకు భంగం కలిగించలేదు. ఆ గ్రుడ్లు పిల్లలై రెక్కలు వచ్చి ఎగురగలిగే శక్తి వచ్చే వరకు ఆయన శిరస్సుపైనే ఉండి వృద్ధి చెందాయి. ఆ తర్వాత కూడ అక్కడి నుండి ఎగిరిపోక అక్కడే తల్లీ పిల్లలున్నాయి. ఆ మహర్షి తన నిశ్చలత్వానికి, ఓర్పుకు తానే సంబరపడి నేనెంత ధర్మశీలుడనైతిని అని అనుకొన్నాడు. అంత అంతరిక్షము నుండి ‘ ఓ జాజిలీ! నీవు ధర్మముచే తులాధారునకు సమానము కావు. ఇలా గర్వించటము నీకు తగదు, అని వినపడింది.

జాజిలికి ఆశ్చర్యము కలిగింది. ఏమీ! క్రయ విక్రయాలు చేసే ఒక వైశ్యుడు, అంగట్లో సరుకులను అమ్మే ఒక వ్యాపారి నా కంటే ఉన్నతుడా? అడవిలో ఘోర తపస్సు చేస్తున్న నా కన్నా ధర్మాత్ముడా! అది ఎలా సాధ్యమో చూడాల్సిందే అనుకొని అడవి నుండి తులాధారుడున్న పట్టణంవైపు అడుగులు వేశాడు. తులాధారుడు ఆయనకు ఎదురొచ్చి చేతులు జోడించి నమస్కరిస్తూ వినమ్రంగా తన ఇంటికి ఆహ్వానించాడు.

ఆయన వినయ విధేయతలు, తియ్యటి మాటలు క్రమక్రమంగా జాజిలిలోని అహంకారాన్ని అణచివేశాయి. ఆయనలోని గొప్పతనం జాజిలికి తెలిసివచ్చింది. ‘ఓ తులాధారుడా! వ్యాపారివైన నీకు ఇట్టి బుద్ధి శక్తి ఏ విధంగా లభించినది? అని ప్రశ్నించాడు. అప్పుడు తులాధారుడు ‘ఓ బ్రాహ్మోణోత్తమా! పూర్వము బ్రహ్మవేత్తల చేత నాకు పురాతమైన ధర్మస్థితి ఉపదేశింపబడినది. భూతదయ, సర్వప్రాణులయందు స్నేహభావము, దేవతారాధనము, ద్విజానుసరణమ, సకలోచిత ధర్మాచరణము, నిరహంకారము ఇవియే పరమపదసోపానాలు.

అహంకారము చేత నీ తపస్సు నష్టమై పోయినది. నేను ధర్మము చేత సంపాదించిన తపశ్శక్తిని నీకు ప్రదానం చేసెదను. దానితో నీవు సమస్త పుణ్యలోకాలను పొందగలవు, అని చెప్పి తన తపశ్శక్తినంతటిని హృదయపూర్వకంగా జాజిలికి ధారపోశాడు.
అరణ్యాల్లో చేసే ఘోర తపస్సుల కన్నా తీవ్ర సాధనలకన్నా వినయ విధేయతలు, భూతదయ, స్నేహభావము, ధర్మాచరణ ఒక వ్యక్తిని ఉన్నతునిగా చేస్తాయని తెలుపుతుంది ఈ కథ. న్యాయంగా, ధర్మంగా, నరసేవయే నారాయణసేవగా, జీవసేవయే దైవసేవగా భావించి చేసే వ్యాపార వాణిజ్యాలు తపోసాధనకన్నా మిన్న యని ప్రకటిస్తుంది ఈ ఉదంతం. నేర్చుకొనే నైపుణ్యం ఉంటే వేదాంత గ్రంథాల సారాన్నే అందిస్తుంది. ఈ వాసవీ కన్యకా పురాణం ఇతర పురాణాల లాగ.

  • రాచమడుగు శ్రీనివాసులు

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/