శ్రీ వాసవీ కన్యకా దేవి పురాణం పూర్వము

Vasavi maata
Vasavi maata

పరాంబికచే సబాంధవ మోక్షమును వరముగ నందిన సమాధి అను వైశ్యోత్తముడు కైలాసమున సోమదత్తుడను పేర జన్మించి అచటి సిద్ధ వైశ్యులకు అధిపతి అయ్యాడు. సోమదత్తునకు చాలాకాలం వరకు సంతానం కలుగలేదు. నారదుని సలహా ననుసరించి సంతానప్రాప్తికై దేవీ మహాయజ్ఞమును చేశాడు. సోమదత్తుని భక్తికి మెచ్చి పరాంబిక వానికి పుత్రికగా పుట్టింది. ఆ పుత్రిక కులమంతటికీ కీర్తి కూర్చగలదని, ఆ బాలిక ద్వారా వైశ్య సముదాయమున కంతటికీ మోక్షము కలుగునని ఆ బిడ్డ జనన కాలమున ఆకాశవాణి పలికింది. ఆ బిడ్డకు కీర్తికన్య అని పేరు పెట్టాడు సోమదత్తుడు. ఆమె దినదినప్రవర్ధమానయై అన్ని కళలలో ఆరితేరింది. యవ్వనవతియై త్రి జగన్మోహన సౌందర్యవతి అయింది. ఆమె భక్తి, జ్ఞానవైరాగ్యాలు మునులకు, దేవతలకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించేవి. ఒకనాడు ఆమె చక్కగా అలంకరించుకుఇన ఉద్యానవనంలో విహరిస్తుంటే చిత్రకంఠుడను గంధర్వరాజు ఆమెను చూసి మోహించాడు. ఆమెను వివాహమాడదలిచాడు. తన కోర్కెను ఆమెకు తెలిపాడు.
కీర్తికన్య అతనితో ‘ఓ రాజా! నేను నిరంతర పరమాంబికా పద ధ్యాన నిమగ్నురాలను. ఆమరణ బ్రహ్మచారిణిగా నుండుటకు నిశ్చయించుకున్నదానను, అని చెప్పింది. తన గృహానికి వెళ్లిపోయింది. చిత్రకంఠుడు ఆమె ఇంటివద్దకే వెళ్లి అక్కడున్న వైశ్య రుషి సంఘంతో తన మనసులోని మాటను చెప్పి అక్కడున్న వైశ్య రుషి సంఘంతో తన మనసులోని మాటను చెప్పి అంగీకరించమని కోరాడు. వైశ్యులు అతని కోరికను తీర్చ నిరాకరించారు. గంధర్వరాజు కోపోద్రిక్తుడై వారితో ‘ ఓ దుష్టులారా! నన్ను నిరాకరించిన ఈ కన్యయు, మీరును భువిలో జన్మించి భయంకరమైన అగ్నిలో పడి భస్మమయ్యెదరుగాక! అని శపించాడు. వైశ్యులు కోపోద్రిక్తులై ‘ ఓ మూర్ఖుడా! నిరపరాధులైన మమ్ములను శపించిన నీవు సర్వభ్రష్టుడవై మనుష్య లోకమలో జన్మించి పిడుగు వంటి వార్త విని శిరము వేయి వ్రయ్యలై ఘోర మరణము పొందెదవుగాక అని ప్రతి శాపమిచ్చారు. దానితో మణిపురాధిపతియైన ఆ గంధర్మునకు, కైలాసవాసులైన వైశ్యులకును నాటి నుండి వైరము ప్రారంభమైనది. ఈ కథ అంతా శ్రీవాసవీ కన్యకాదేవి పురాణములో ఉంది. దీన్ని చదివి ‘కైలాసమేమిటి? పుట్టుడమేమిటి? మోహించటమేమిటి? శపించటమేమిటి? వైరము కలిగి ఉండటమేమిటి? అవన్నీ అక్కడ కూడా ఉంటే ఈ భూలోకానికి, ఆ కైలాసానికి తేడా ఏమిటి? ఏమిటో అంతా కట్టుకథ అని తీసిపారేయవలసిన పనిలేదు.
అదంతా నిజమైనా కాకున్నా, కైలాసం ఉన్నా, లేకున్నా ఈనాడు మన చేతిలో ‘శ్రీ వాసవీ కన్యకాదేవి పురాణము అంటూ ఒక గ్రంథముంది. మనం నిజంగా తెలివైన వారమయితే ఈ కథ నుండి మనం గ్రహించవలసిన అనుసరించవలసిన నీతి ఏమైనా ఉందా అని వివేక పూరిత విచారణ చేయాలి.
శ్రద్ధతో అధ్యయనం చేసి అన్వేషించాలి. ఫలితం దక్కుతుంది. అంతా కల్పిత కథేయైనా ఒక విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఈ కథ లోకాలు ఎన్ని మారినా, కాలాలు ఎన్ని జరిగినా మనము చేసిన కర్మను మనం అనుభవింపక తప్పదన్న హెచ్చరిక చేస్తుందీ కథ. కైలాసములోని ఆకాశవాణి పలుకులుగానీ ఒండొరుల శాపాలు గానీ ఆ కాలంలో ఆ లోకంలో నిజం కాలేదు. ఆ తర్వాత ఎప్పుడో భూలోకంలో నిజమయ్యాయంటుంది పురాణము. నీతిని గ్రహించి కథను వదలవచ్చు.

-రాచమడుగు శ్రీనివాసులు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/