మంచి – చెడు

Shirdi Sai Baba
Shirdi Sai Baba

సాయిబాబా కోరిన వరములను కురిపించే కొండంత దేవుడు. జిల్లేళ్లమూడి అమ్మగా పేరు పొందిన అనసూయ మాత కూడా అనుగ్రహించేంది. సాయిబాబా, అమ్మ సర్వదేవతామూర్తులుగా భక్తుల ఇష్టదైవాలుగా సాక్షాత్కరించారు. ఇద్దరకూ అన్నదానమంటే విశేష అభిమానమే. ఇద్దరూ తమను నమ్మిన వారి బాధలను స్వయంగా అనుభవించినవారే. అయితే భక్తులకు మాత్రం కొన్ని కొన్ని సందర్భాలలో ఆ భక్తులు అనుకున్న మంచి జరగలేదు. పైగా చెడు జరిగింది. నానాసాహెబ్‌ చందోదర్కరు సాయినాధుని అంకితభక్తుడు. నానాను సాయి స్వయంగా తన వద్దకు పిలిపించుకున్నారు. అటువంటి నానాసాహెబ్‌చందోర్కరు తన అల్లుని, మనుమడిని కోల్పోయారు. ఏకైక కూతురు మైనాయి విధవ అయింది. నానా శోకంలో మునిగి పోయాడు. సాయిని కర్మధ్వంసినే నమః అని కీర్తిస్తారు. ఇక్కడ నానాను ఆయన కర్మకు ఆయనను వదలివేసినట్లు సాయిబాబా కనపడతాడు. కర్మలను వీలయినంతవరకు అనుభవించుటయే వ్యక్తికి శ్రేయస్కరం.

ఈ విషయం ముఃకములో ఉన్న వారికి అర్ధము కాదు. భక్తునకు జరుగు ప్రతిసంఘటన సాయికి తెలియకుండ జరుగునట్టిది కానేకాదు. సాయితాను అవసరము అనుకోనినప్పుడు మాత్రం కల్పించుకొనును. భక్తుని జీవితంలో జరుగు ప్రతి సంఘటన – మంచిదిగాని, చెడ్డది గాని సాయి అనుమతి లేకుండా భక్తునిచే అనుభవింపబడదు.

సాయి నిరంతరం భక్తుల శ్రేయస్సును చూచుచుండును. కనుక మంచిగాని చెడుగాని అనిపించిన వానిని సాయి ప్రసాదముగా స్వీకరింపవలెను. శ్రీమతి గజేంద్రమ్మ అమ్మ భక్తురాలు. అప్పుడ్పుడు వచ్చి అమ్మను దర్శించుకునేది. ఒకసారి గజేంద్రమ్మ పడిపోయింది. ఫలితంగా ఎడమచెయ్యి విరిగింది. గజేంద్రమ్మ కట్టు కట్టించుకున్నది. ఆమె ఆ సమయంలో అమ్మ దగ్గరకు వచ్చింది. నమస్కరించింది. గజేంద్రమ్మ అమ్మతో ఇలా చెప్పసాగింది.

‘మీ అమ్మగారికి (అంటే జిల్లేళ్లమూడి అమ్మగారికి) నీ మీద ఎంతో ప్రోమదయమూ గదా! ఆ విషయమే నీవు చెబుతుంటావు గదా. అమ్మ దయ ఉంటే ఇట్లాగే జరుగుతుందా? అని మా వాళ్లు అంటున్నారమ్మా. అమ్మ వెంటనే స్పందించింది. గజేంద్రమ్మ మాటలకు. ‘నా దయ వల్లనే ఇట్లా జరిగిందని చెప్పు గజేంద్రమ్మా అన్నది అమ్మ.

భగవంతుని కటాక్షం ఎప్పుడూ ఉంటుంది. మంచి జరిగినప్పుడు మాత్రమే మనము గుర్తిస్తాము. భగవంతుని కటాక్షాన్నే కాదు, సాక్షాత్తు భగవంతుడు కనిపించినా మనం అనుకున్న రూపంలో కనిపిస్తేనే గుర్తిస్తాము. ‘ఒడిదొడుకులు కూడా నా ఆశీర్వచనమే అంటుంది అమ్మ. అమ్మగాని, సాయిమాతగాని భక్తునకు చెడు చేయరు. కనిపిస్తున్న చెడును తీసివేయుమనిగాని, వాయిదా వేయమనిగాని, కోరక చెడును సహించి, అనుభవించగల శక్తి ప్రసాదింపుమని కోరుకుందాం. జయహోమాతా, శ్రీఅనసూయ రాజరాజేశ్వరి శ్రీపరాత్పరిని ధ్యానిద్దాం.. శాంతిచిత్తులమవుదాం.

  • ఎం.పి.సాయినాథ్‌

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/