ఆచారం-దైవసంకల్పం

ఆధ్యాత్మిక చింతన

Om
Om

ఆమె ఒక బ్రాహ్మణ స్త్రీ. వివాహమై పిల్లల్ని కనిన తల్లి. ఆమె మరణించింది. శ్మశానికి తీసుకెళ్లి ఆ శవాన్ని దహనం చేయాలి. కానీ లింగం పెట్టారు, గుడికట్టారు, చుట్టూ ఆశ్రమం ఏర్పడింది. ఇదీ నేడు తిరువణ్ణామలైలో నున్న శ్రీరమణాశ్రమం.

లక్షలమంది దర్శించే పుణ్యక్షేత్రం 1946-47 ఆ ప్రాంతంలో కామకోటి పీఠాధిపతులు ప్రచారంగా అరుణాచలం (తిరువణ్ణామల) వెళ్లారు. రమణాశ్రమం ముందు నుంచే వెళ్లిపోయి ఒక బహిరంగ సభలో పాల్గొని ఉపన్యసిం చారు.

‘అన్ని ఆశ్రమాలకు కట్టుబాట్లున్నవనీ, అవి ఉల్లంఘించేందుకు వీలుకాదని అత్యాశ్రమికి ఏమీ ఉండవనీ అదే అవధూత ఆశ్రమమనీ, రమణమహర్షి వంటి మహనీయులకే అది సాధ్యమనీ చెబుతూ అనర్గళంగా చాలాసేపు ఉపన్యసించారు.

(పుట 641-శ్రీరమణాశ్రమ లేఖలు-సూరినాగమ్మ). ఆ తర్వాత ఏమైందో చూద్దాం.

నాలుగైదు రోజు ల తర్వాత ఆశ్రమంలో వేదపారాయణ చేయటా నికి, అమ్మ కోవెలలో మహాన్యాసం చెప్పేందుకు టవ్ఞన్‌ నుంచి రాజు, శాస్త్రి మొదలైన శ్రోతియులంతా వచ్చారు.

వారు రమణమహర్షితో ‘భగవాన్‌! కామకోటి పీఠాధిపతులు నిన్న మాకందరకూ నిషేధ పత్రికలు పంపారు అని విన్నవించారు.

‘ఏమని? అని అడిగారు భగవాన్‌. స్త్రీ సన్యాసం పనికి రాదనీ, అందువల్ల అమ్మసమాధి, సమాధి మీద లింగం శాస్త్రీయం కాదని, అక్కడ మహాన్యాసం చెప్పరాదని నిషేధిం చారు అన్నారు.

(పుటలు 641-642 శ్రీరమణాశ్రమలేఖలు సూరి నాగమ్మ) అంటే అక్కడ జరుగుతున్నది ఆచారవిరుద్ధం, శాస్త్రవిరుద్ధం అని తెలుస్తుంది. ఒకరోజు రమణాశ్రమంలో ఏమి జరిగిందో చూడండి.

సనాతన సాంప్రదాయ, సదాచార, సద్భ్రాహ్మణ కుటుంబాలకు చెందినవారు వారంతా.

బ్రహ్మముహూర్తంలో లేయటం, స్నానం చేయటం, సంధ్యవార్చుకోవటం, పూజాదులను చేసి శుద్ధాహారాన్ని తినటం వారి ఆచారం. ఒక అమావాశ్యరోజు ఉదయం ఊళ్లో నుంచి స్వామిని చూడ్డానికి ఆశ్రమానికి వచ్చారు

ఆ శ్రోత్రియబ్రాహ్మణులు. ముందు స్వామి సేవించి, తర్వాత ఊళ్లోకి పోయి, స్నానాలు చేసి, తర్పణాలు విడిచి తర్వాత తినాలన్నది వారి ఉద్దేశం.

రమణాశ్రమం శ్మశానంలో ఏర్పడిందన్న భావం ఉన్నందున ఆ కాలంలో శ్రోత్రియులెవరూ ఆశ్రమంలో భోజనం చేసేవారు కారు.

ఆశ్రమం నుంచి ఇంటికిపోగానే స్నానం కూడా చేసి ఆ తర్వాతనే భోజనం చేసేవారు. కానీ ఆ రోజు ఆ శ్రోత్రియలతో మాట్లాడిన తర్వాత వారిని ఫలహారానికి రమ్మని పిలిచాడు భగవాన్‌ రమణమహర్షి ‘ఎట్లా అమావాస్య! స్నానం లేదు, తర్పణం లేదు.

కానీ ఎవరన్నా పెడతానన్నప్పుడు తినకపోతే ఆ రోజు తిండి పుట్టదని భయం. పైగా తమను పిలుస్తున్నవారు స్వామి.

ఏం తోచక చివరికి అందరితోపాటు ఉప్మాతిని, కాఫీతాగారు. భగవాన తిరిగి వచ్చి హాల్లో కూచుని, ఉల్లిపాయలు ఎంత ఆరోగ్యకరమో,ఉల్లిపాయల వల్ల ఎన్ని వ్యాధులు నయం చేయవచ్చునో ఉపన్యాసం ఇస్తున్నారు.

ఊళ్లో నుంచి వచ్చిన పెద్దలందరూ చుట్ట చేరి వింటున్నారు. ఉల్లిపాయలు వాసన అంటారుగానీ సరిగా వండితే వాసన వేయవ్ఞ అని పెద్దల వంక అడిగారు.

వరి నోట మాటలేదు. తెల్లబోయి నారు. ఉల్లిపాయలు సన్నగా తరిగి ఆముదంలో వేయించి ఉప్మాలో కలిపితే, వాసనరాదు, మలబద్దమూ ఉండదన్నారు భగవాన్‌ (పుట 208, భగవాన్‌ స్మృతులు-చలం)

ఎట్టిట్టో ఆ ఉప్మాను దళిత వితంతువ్ఞ చేస్తే ఇంకా బాగుంటుందని మహర్షి చెప్పలేదు. చెప్పింటే ఆ శ్రోత్రియులకు వెంటనే ప్రాణం పోయి మోక్షం వచ్చి ఉండేది.

అక్కడికక్కడే చూడండి. అది శ్మశానం, ఆ రోజు అమావాశ్య. స్నానం, సంధ్య, తర్పణం ఏవిూ లేకుండానే ఉల్లిపాయలు వేసిన ఉప్మాను ఆ సదాచార సద్భ్రాహ్మణులు ఆ రోజు తినాల్సి వచ్చింది.

ఎంత విచిత్రం. వాటి పని తీరిపోగానే అంతర్ధానమవ్ఞతాయి. మనం ఎంత గట్టిగా వాటిని అంటిపెట్టుకోవాల నుకున్నా, కలకాలం కొనసాగించాలనుకున్నా అది సాధ్యం కాదు.

ఎన్నెన్నో ఆచార నియమాలు ఏర్పడ్డాయి, అంతరించిపోయాయి. మనం అనుసరించాల్సింది, విశ్వసించాల్సింది భగవంతుడినేగాని మానవనిర్మిత లేక బుషిప్రోక్తిత సూత్రాలను, నియమాలను కాదు. సర్వశక్తివంతం దైవసంకల్పం.

అదే ఎప్పటికీ జరిగి తీరుతుంది. మనల్ని మనం దానికి అర్షించుకుంటే దక్కుతుంది ఎంతో సుఖం, సంతోషం.

ఆందోళన శాశ్వతంగా దూరమవుతుంది. ఇది నిజం.

  • రాచమడుగు శ్రీనివాసులు

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/