ప్రసాదించేది ఆ పరమాత్మయే

That is the Supreme Self

మనకున్నవన్నీ మాధవ్ఞడివే. అన్నీ తనవే. తాను ఇచ్చినవే మన వద్ద ఉన్నాయి. ఉన్నప్పుడు వాటివిలువ తెలియదు. దూరమైనపుడే గుండెలు బరువెక్కుతాయి. చేతుల్ని ఎంతగా ఊపుతామో, ఎంతగా కదిలిస్తామో? చేతులతో ఎందరిని పిలుస్తామో, ఎంతగా తింటామో? ఎంతగా బరువ్ఞలు ఎత్తుతామో, ఎంతగా ఎత్తుకుంటామో? కాని ఒక్క క్షణంలో, పక్షవాతం రాగానే ఎంతగా ప్రయత్నించినా చేతుల్ని కదపలేకపోతాము. ఏమైంది ఉన్న శక్తి అంతా? భగవాన్‌! ఉన్నప్పుడు అంతా నా మహిమేనని ఎగిరిపడ్డానే గాని, అదంతా నీ వైభవమేనని, నీకారుణ్యమేనని గ్రహించలేకపోయా ను. చేయవలసిన అర్చనాదులు చేయకపోయినా చేయకూడనివి ఎన్నో చేశాను. రెండు చేతులతో ఆర్జించానే గాని రెండు చేతులు జోడించి అర్చించలేకపోయాను .ప్రాణంలేకపోయినా గడియారం పని చేస్తోంది. మనస్సులేకపోయినా మేఘం ఊరేగుతుంది. ప్రాణం లేకపోతే మనిషి కదలలేడు. ప్రాణాన్ని తగిలించుకుని ఈ ప్రపంచంలోకి మనిషి వచ్చాడు. ప్రాణ దీపం కొడిగట్టకుండా ఉండానికి తైలాన్ని ఒడిగట్టుకొని రాలేదు. ప్రాణవాయువ్ఞ మనకొరకు ఈ ప్రపంచంలో సిద్ధంగా ఉంది. ఆక్సిజన్‌ రూపంలో ఉన్నది ఎవరో కాదు, అచ్యుతుడే. సుందరమైన రూపాలు, రంగులు ఎన్నో ఉన్నాయి ఈ ప్రపంచంలో. శ్రావ్యమైన సుశ్రావ్యమైన మధుర శబ్దాలు ఎన్నెన్నో ఉన్నాయి. కోకిల పాటలున్నాయి. ఉరుముల శబ్దాలున్నాయి. పారే నదులు ఉన్నాయి. దూకే జలపాతాలు ఉన్నాయి. ఇవన్నీ నేను చూచేందుకు, నాకు చూపేందుకు ఆకాశంలో అద్భుతమైన అమరదీపం, ఆరనిదీపం నా కన్నా ముందే వెలుగుతూ ఉంది. ఉన్నవన్నీ ఆ వెలుగులోనే తెలుస్తూ ఉన్నాయి. పచ్చనిచెట్లు ఉన్నాయి. వెచ్చని కాంతి ఉంది. చల్లని నీళ్లున్నాయి. మెత్తని పువ్ఞ్వలున్నాయి. హాయినిచ్చే గాలులున్నాయి. తృప్తినిచ్చే నవ్ఞ్వలు న్నాయి. విశాలమైన ఆకాశం ఉంది. గంభీరమైన సముద్రముంది. ఇదంతా పరమాత్మ వైభవం. వీటన్నిటి వెనుక భగవంతుని అదృశ్యహస్తమే కదుల్తూ ఉంది.
ఇవన్నీ అర్థం చేసుకొనేందుకే ఉన్నాయి. అర్జునా! దేనిలో వైభవముందో, దేనిలో ఐశ్వర్యముందో, దేనియందు ఉత్సాహం అతిశయించి ఉందో – అవన్నీ నా తేజస్సులోని అంశా లేనని తెలుసుకో! అన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ. ఏది ఉన్నా, ఎవరు ఉన్నా, అవి అలా ఉండట మనేది భగవంతునిపై ఆధారపడి ఉంది.
యావద్విశ్వానికి సత్తాస్ఫురణలను ప్రసాదించేది పరమాత్మయే కనుక, ఎక్కడ ఏ వైభవమున్నా అదంతా భగవద్వైభవమే. నడిపేవాడు లేనపుడు నావ ఏ క్షణాన అయినా మునిగిపోవచ్చు. బ్రతుకులో భగవంతుడు లేనపుడు జీవననౌక కూడా మునిగిపోవచ్చు. భగవంతుడు బుద్ధిలో చేరితే బ్రతుకు పండుతుంది.అంతా సవ్యంగానే సాగుతుంది. బ్రతుకులో భగవంతుడు దూరమైననాడు ఏదైనా ఉండవచ్చు. శాంతి ఉండదు. సుఖం మిగలదు. భగవంతుడు ఒక్క డు మనవాడు అయితే ప్రపంచం సర్వదా మన కు అనుకూలంగానే ఉంటుంది. అదే అక్షయ సంపద. లోకేశ్వరుడు మనవాడైన నాడు ముల్లో కాలలో మనకు ఎదురుండదు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/