కన్నిచ్చిన కన్నప్ప

Bhakta kannapa
Bhakta kannapa

అడవుల్లో అమాయకంగా సంచరిస్తూ, జీవనోపాధి మార్గం మాత్రమే తెలిసి, వాటికై వేటాడుతూ వేటనే వృత్తిగా జీవించే ఆటవికులతో, పురాణ ప్రసిద్ధిగాంచిన వారిలో వాల్మీకి, ఏకలవ్ఞ్యడు ముఖ్యలు. కాగా బోయగా పుట్టి అపర శివభక్తుడిగా ఆయనను ఆరాధించిన తిన్నడు, భక్తకన్నప్పగా ఎనలేని శివసేవ చేసి, తరించాడు. పూజావిధానాలు తెలియని తిన్నడు శివలింగాన్ని పుక్కిట పుట్టిన నీటితో అభిషేకించడం, జంతుమాంసాన్ని నైవేద్యంగా శంకరుడికి సమర్పించడం అతని మూఢభక్తిని తెలియచేస్తుంది. మడి ఆచారాలు పాటిస్తూ, చిత్తశుద్ధి కలిగిన పరమ భాగవతోత్తములు. భక్తశిఖామణులకు తీసిపోని విధంగా, నిర్మలచిత్తంతో, ప్రతిరోజూ ఇల్లు మరచి, శివసాన్నిధ్యంలో పునీతుడైన పుణ్యమూర్తి తిన్నడు. ఒకరోజు శివలింగాన్ని ఆకులతో అర్పించి, జలంతో పూజించి, మాంసఖండాలు ముందుంచగా, శివ్ఞడి ఒక కంట నీరు కారడం గమనించిన తిన్నడు, చింతతో కొన్ని ఔషధ మొక్కల ఆకులు నూరి వైద్యం చేశాడు. కానీ కొంతసేపటికి కంటినుండి నీరుకాక రక్తం రాగా, తనకంటిని పెకలించి, శివ్ఞడికి నేత్రాన్ని అమర్చాడు. రెండవ కంటికి కూడా రుధిరం రాగా, ఒక కాలితో ఒక కంటిని నొక్కిపెట్టి తన రెండవ కన్నుని కూడా తొలగించుకుని ఆ ముక్కంటికి నేత్రధారణగావించాడు. అంతలో బోళాశంకరుడు ప్రత్యక్షమై, ప్రగాధ భక్తికి పరవశుడై, తిన్నడిని, కన్నప్పగా కరుణించి పిలిచి, ముక్తిని ప్రసాదించిన వైనం ఎన్నిసార్లు విన్నా, కన్నా తనవి తీరని కధగా ప్రాచుర్యం పొందింది. శ్రీకాళహస్తి క్షేత్రంలో, సాలెపురుగు, ఏనుగు, పామువంటి మానవ్ఞలు కాని, జీవచరాలు శివలింగ అర్చన, ఒకరిపై ఒకరు పోటీగా మొదటగా పెట్టిన పూజాద్రవ్యాలను తొలగించి తమతమ నైవేద్యాలను సమర్పించే పరంపరలో ఆశువ్ఞలు బాసి, ముక్తికి పాత్రులై శివసాయుజ్యం పొందాయి.
అలాగే శ్రీకాళహస్తి, ఎత్తైన కొండ శిఖరంపై ప్రతిష్ఠింపబడిన, కన్నప్ప ఆలయం కనిపిస్తుంది. భక్తులు వీక్షించి అమితానందం పొందే స్థలంగా తిన్నడి దర్శనం. అతని గాధ, శ్రీకాళహస్తిని మరింత యాత్రాదర్శినిగా అయి అలరిస్తూ ఉంటుంది. తిరుపతి వెంకటేశ్వరుని దేవస్థానం, అలివేలు మంగాపురం వెళ్లిన వారు తప్పక దర్శించే పుణ్యక్షేత్రంగా తిన్నడు నెలకొన్న ప్రదేశంగా శ్రీకాళహస్తి మహత్యం. తరతరాల తీర్ధయాత్రకులకు, పరమార్థం ప్రసాదిస్తుంది. కైవల్యాన్ని కలిగిస్తుంది.

  • యం.వి.రమణకుమారి