మహర్షుల సత్రయాగం

Maharshi

మహర్షులు సత్రయాగాన్ని వేయి సంవత్సరాలు చేశారు. మహర్షులు, దేవతాగణాలు, అగ్నులు, మునులు, వారి శిష్యులు ఆ యాగానికి వచ్చారు. సూర్యతేజస్సు గల దక్షుడు కూడా వచ్చాడు. ఆయన్ను చూసి అందరు గౌరవంగా లేచి నిలబడ్డారు. ఎప్పుడూ ధ్యానం చేస్తూ అంతర్ముఖుడైన శివుడు మాత్రం లేచి నిలబడక అలాగే కూర్చొన్నాడు. దక్షప్రజాపతికి పట్టరాని కోపం కలిగింది. శివుడిని ఏమేమో నిందించాడు. ‘అమంగళ స్వరూపుడు. ఈ పొగరుబోతుకు స్నేహితులు కూడా తమో గుణమునకు ప్రతీకలైన భూతగణములు, ప్రమథ గణములే! అటువంటి శౌచములేని శివునికి, బ్రహ్మ చెప్పటచే, నా కుమార్తె నిచ్చి ద్రోహము చేసినాను, అని అనటమే కాక క్రోదాంధుడై చేతిలోకి జలాన్ని తీసుకుని ‘ఈతడు దేవతలతో పాటు యజ్ఞభాగమును పొందజాలడు, అని శపించాడు. దాన్ని చూసిన నందీశ్వరుడు, ‘ఈ దక్షుడు మూఢుడు. అశాశ్వతమైన శరీరాన్ని శాశ్వతమని తలచుచున్నాడు.

శివదూషణమే కాక శివుని శపించి మరియొకసారి శివదూషణము చేసినాడు. ఈతడు తత్త్వజ్ఞాన రహితుడై మోక్షమును కోల్పోవును. స్త్రీ వ్యామోహముల చేతను, వేదోక్తమైన కర్మలను కపటబుద్ధితో చేయుచూ మేకవంటి ముఖము కలవాడు అగుగాక! ఈ దక్షుని ఆగడములను హర్షించిన బ్రాహ్మణులు కూడా సంసారమందు బాధితులై మోక్షమునకు దూరమగుదురు. ఈ బ్రాహ్మణులు తినకూడనివన్నీ తింటూ భార్యాపిల్లలను పోషించుకొనుటకై విద్యా పతస్సులను అమ్ముకొని జీవింతురు. భూమిపై యాచకులై తిరిగెదరు కాక! అంటై శపించాడు. దాన్ని చూసిన భృగుమహర్షి ‘శివవ్రత దీక్షను అసురించే శివవ్రత దారులంతా వేదోక్తమైన కర్మలకు అనర్హులగుదురుగాక! అని శపించాడు. శివభగవానుడు దీన్నంతా చూసి వికలమైన మనస్సుతో అచటినుండి వెళ్లిపోయాడు.

ప్రజాప్రతులంతా వేయి సంవత్స రముల సత్రయాగమును పూర్తి చేసి గంగా యమునలందు స్నానాలు చేసి తమ తమ నివాసాలలకు వెళ్లిపోయారు. మన పవిత్ర గ్రంథమైన భాగవతములోని ఈ కథ నుంచి తెలుసుకోవలసింది, నేర్చుకోవలసింది ఎంతో ఉంది. కాలక్షేపము కోసం చదివ ప్రక్కన పెట్టే త్రంఘం కాదిది.
జరిగినది ఘనమైన సత్రయాగము. వచ్చిన వారు సామాన్యులు కారు, మహర్షులు, దేవతలు, అగ్నులు, మునులు, ప్రజాపతులు. అక్కడ, అప్పుడు జరిగిందేమిటి? కోపాలు, శాపాలు, ప్రతి శాపాలు. శివభగవానుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అంటే ఎంత ఘనంగానైనా యజ్ఞయాగాదులు చేసినా అక్కడ కోపాలు, తిట్టుకోవటాలు ఉంటే అక్కడ దైవం ఉండదు. దైవం లేని తంతు అది. సమయం వృథా, పడిన శ్రమ అంతా వృధా! ఆశించిన ఫలితం దక్కదు. ఎంత మంచం నీతి!

  • రాచమడుగు శ్రీనివాసులు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/