రురుడు – ప్రమధ్వర

Brughu maharshi

భృగుమహాముని ముని మనమడు ప్రమతి. అతడు సద్గుణాలు కలవాడు. అతడి కుమారుడు రురుడు. ఈతడు గొప్ప తపశ్శాలి. సత్యవ్రతుడు అనుకున్నది సాధించిగాని నిద్రపోడు. అంతడు ఒకరోజున తన ఆశ్రమానికి కొద్దిదూరంలో ఉండే స్థూల కేశమహాముని ఆశ్రమానికి వెళ్లాడు. అక్కడ ఆశ్రమంలో అతడు ఒక యువతిని చూచి ఆమె అందానికి ఆశ్చర్యపోయాడు. అప్సరసలను మించి ఉంది ఆమె రూపం. ఆమెను చూచిన తక్షణమే ఈమెనే వివాహమాడాలని తలంచాడు.

కాని ఈ విషయం తల్లిదండ్రులతో చెప్పలేదు. చెబితేవారు ఏమౌనా అభ్యంతరం చేస్తారేమోనని భయపడ్డాడు. రురుడు విచారంగా ఉండటం గమనించి అతని తల్లిదండ్రులు కారణం అడిగారు. రురుడు చాలా సేపటికి కారణం చెప్పలేదు. కాని చెప్పకపోతే ఎలా అని భావించి తండ్రితో, తండ్రీ! నేను స్థూలకేశముని ఆశ్రమంలో ఒక యువతిని చూశాను. ఆమెనే వివాహం చేసుకోవాలనుంది. కుమారుని నిర్ణయం విని అలాగే నాయనా! నేను వెళ్లి స్థూలకేశుడితో మాట్లాడి వస్తానని తెలిపాడు. తన మాట కాదనకపోవడం సంతోషమైంది.

ఇంతకీ ఆ యువతి ఎవరో మనం తెలుసుకునే అవసరం ఉంది. మేనక అనే అప్పరస విశ్వావసువు అనే గంధర్వుడిని ప్రేమించింది. వెంటనే గర్భవతి అయ్యింది. మేనక స్థూలకేశుడి ఆశ్రమానికి దగ్గరలో ఉన్న నది దగ్గర ప్రసవించగా ఒక బాలిక జన్మించింది. మేక ఆ బాలికను విడిచి వెళ్లిపోయింది. ఆ బాలికే ప్రమద్వర. ఆ బాలిక ఏడుపు విని స్థూలకేశుడు దగ్గరకు వెళ్లి చూశాడు. ఎవరో వదిలి వెళ్లారని నిర్ణయానికి వచ్చి తన ఆశ్రమానికి తెచ్చి పెంచాడు. రురుడు వివాహం చేసుకోదలచిన కన్య ప్రమద్వర. మేనకకు జన్మించిన ఆమె. ఆపూర్వ అందంతో మెరిసే ఆ కన్య అందరినీ ఆశ్చర్యపరిచింది.

ప్రమతి వెళ్లి స్థూలకేశుడిని కలుసుకుని ప్రమద్వరను రురుడికిచ్చి వివాహం చేయమని కోరాడు. స్థూలకేశుడు ఎంతో సంతోషపడి తప్పక వివాహం చేద్దామని సమ్మతించాడు. ఇరుపక్షాల వారి నిర్ణయం జరిగిపోయింది. ముహూర్త నిర్ణయం కూడా జరిగింది. ఇంక కొద్ది రోజుల్లో వివాహం జరగబోతోంది. ఒకరోజు ప్రమద్వర ఆశ్రమ వాకిట నిద్రిస్తున్న సర్పాన్ని చూడకుండా తొక్కింది. ఆ సర్పం కోపంతో బుస్సుమంటూ ప్రమద్వరను కాటువేసింది. ఆ పావు విషం తిరుగులేనిది అవడంతో ప్రమద్వర వెంటనే మరణించింది. ఆమె అకాల మరణానికి అక్కడ స్థూలకేతుడు మిగతా మునులు అందరూ దుఃఖించసాగారు. పెద్దగా ఏడవటం కూడా మొదలుపెట్టారు.

ఆ ఏడుపుల రోదన విని రురుడు అక్కడకు పరుగెత్తుకొచ్చాడు. ప్రమద్వర మరణవార్త విని నిలువునా కూలిపోయాడు. తన భార్యగా ఆమెను ఊహించుకుంటూ కలలుగనే రురుడు ఆమె మరణవార్త విని భరించలేకపోయాడు. ఆమెను చూచి ఆనందం పొందే రురుడు అతని ఆశలు ఒక్కసారి నిరాశ చెందటంతో భరించలేని శోకం అనుభవించాడు

. కాని తాను చనిపోయినంత మాత్రాన ఆమె బ్రతుకలేదు కదా తాను ఆమెను చేరలేడు గదా. ఇలా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి నది వైపు కదిలాడు. స్నానం చేసి ఆచమనం చేసి చేతిలో నీరు పట్టుకుని దేవతలను స్మరిస్తూ ఇలా అన్నాడు. నేను నిత్యం దేవతాచర్చన మొదలు పుణ్యకార్యాలు చేసి ఉంటే గురువుల్ని భక్తితో పూజించి ఉంటే నా కాబోయే ప్రియురాలు ప్రమద్వర బ్రతకాలి. లేకపోతే నేనూ మరణిస్తాను. అంటూ చేతిలో ఉన్న నీరు నేలమీద పోశాడు. మరుక్షణమే ఒక దేవదూత ప్రత్యక్షమయ్యాడు. అతడు మునికుమారా! నీ విచారం అర్ధం లేనిది. ప్రపంచంలో ప్రతి వాడికి చావు పుట్టుకలు సహజం.

అలాగే ఆమె ఆయుష్షు తీరడంతో మరణించింది. ఆమె మరణానికి నీవు దుఃఖపడవద్దు. నీకింకా వివాహం జరగలేదు కదా. నీవు వెళ్లి మరో కన్యను శాస్త్ర సమ్మతంగా వివాహం చేసుకుని సుఖపడు అని చెప్పాడు. కాని ఆమెను ఎంతో ప్రేమించిన రురుడికి దేవదూత మాటలు నచ్చలేదు. మీరు చెప్పినంత సులభంగా నేను మరొక కన్యను వివాహమాడలేను.

దయచేసి వేరే ఏ మార్గమైనా చెప్పి ప్రమద్వరను బ్రతికించండి. లేకపోతే నేను మరణిస్తాను అంటాడు. దేవదూత ఇతను అన్నంత పని చేసేలా ఉన్నాడనుకుని మునికుమారా! నేనొక ఉపాయం చెపుతాను విను. ఇది ఇంతకు ముందు దేవతలు ఉపదేశించిన ఉపాయం. నీవు నీ ఆయుష్షులో సగం ఆమెకు ధారపోస్తే ఆమె తప్పక బ్రతుకుతుంది అంటాడు.

రురుడు ఆయన మాటలకు సంతోషపడి దేవాణ మీరు చెప్పిన పద్ధతికి నేను అంగీకరించాను. నా ప్రాణమైన ప్రమద్వర బ్రతకటమే నాకు కావాలి అంటాడు. ఆ దేవదూత యమధర్మరాజు వద్దకు వెళ్లి రురుడి నిర్ణయం వివరిస్తాడు. అంతే మరుక్షణమే ఆమె నిద్ర నుంచి లేచినట్లు లేచింది. అతడి సంతోషం అంతులేనిదయింది. ఆ తర్వాత వివాహం చేసుకుని సుఖసంతోషాలు అనుభవించారు. పూర్వం పద్ధతులు ఎంత నీతిమంతంగా ఉన్నాయో ఆమెను వివాహం చేసుకోకముందే ఆమెను భార్యగా భావించి సగం ఆయువును ఆమెకు ధారపోసి ప్రాణప్రతతిష్ట చేశాడు రురుడు.

  • ఉలాపు బాలకేశవులు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/