అహంకారం

ఆధ్యాత్మిక చింతన:

Devotional Stories

అహంకారం – స్వార్థం, అసూయ, ద్వేషం మొదలైన దుర్గుణాలని బయట పెడుతూ ఉంటుంది. అగ్నిలో ఆజ్యం పోస్తే ప్రజ్వరిల్లినట్లు అహంకారం వల్ల మనిషిలోని దుర్గుణాలు అడ్డులేకుండా వెల్లడవు తుంటాయి.

శివుడికి భక్తుడై ఉండీ అభయమిచ్చి చంద్రుని రక్షించినందుకు గాను దక్షుడు తన అహంకారంతో దేవదేవునే తూలనాడాడు. నిరీశ్వర యజ్ఞాన్ని తలపెట్టి తన కుమార్తె అయిన సతీదేవిని కూడా పిలువకపోయినప్పటికీ ఆమె వచ్చినా ఆదరించక అవమానపరిచాడు.

తత్ఫలితంగా తన కుమార్తెనీ, తన ప్రాణాలనీ పోగొట్టుకున్నాడు. రావణుడు గొప్ప శివభక్తుడై ఉండి తనను మించిన వారు లేరనే అహంకారంతో దుష్కార్యాలు చేసి సర్వనాశనమయ్యాడు. అతడి అహంకారం పరస్త్రీ వ్యామోహాన్ని బహిర్గతం చేసి నాశనం చేసింది.

హిరణ్యకశిపుడు అహంకారంతో తననెవరూ ఏమీ చేయలేరనుకుని విష్ణుమూర్తిపై కక్ష కట్టి ఆ కోపంలో తన కన్న కుమారుడైన ప్రహ్లాదుడు చిన్న పిల్లవాడని కూడా చూడకుండా నానా హింసలు పెట్టి చివరికి చావ్ఞని చేతులారా కొని తెచ్చుకున్నాడు. అతడి అహంకారం పితృప్రేమని కూడా మరుగు పరిచింది. స్వార్ధబుద్ధి బహిర్గతమై ప్రాణాలు తీసింది.

కురుక్షాధిపాలుడు అహంకారంతో దాయాదులైన పాండవులపై నిష్కారణంగా అసూయ, ద్వేషాలు ప్రజ్వరిల్లగా వారిని ఇక్కట్లపాటు చేసి తుదముట్టించాలనే ప్రయత్నంలో తన బంధువులు సోదరులతో సహా సర్వనాశనం అయ్యాడు.

కంసుడు అశరీరవాణి పలుకులనాలకించి ఎప్పుడో తన మేనల్లుడి వల్ల తనకు చావ్ఞందని తెలుసుకుని ఎంతో గారాబంగా చూసుకుంటున్న చెల్లెల్ని, స్నేహితుడైన వసుదేవుణ్ణి విరోధులుగా తలచి వారిని చెరసాల పాలు చేసి వారి సంతానాన్ని చంపాడు. అక్కడితో ఆగక అష్టమ గర్భంలో పుట్టినది ఆడపిల్ల అని తెలిసి ఆమెని కూడా చంపబోయాడు.

అతడి అహంకారం చెల్లిలి మీద, స్నేహితుడి మీద మేనల్లులైన పసికందుల మీద ప్రేమని కసిగా మార్చింది. ప్రాణం మీది తీపే ప్రాణాల్ని తీసింది. శిశుపాలుడు అహంకారంతో శ్రీకృష్ణుడిపై అసూయ ద్వేషాలు ప్రజ్వరిల్లగా అకారణ వైరంతో తన స్నేహితుడు రుక్మి చెల్లెలు రుక్మిణిని చేసుకున్నాడన్న కోపంతో కక్షబూనాడు.

దానికితోడు ధర్మరాజు రాజసూయ యాగమప్పుడు శ్రీకృష్ణునికి అగ్రతాంబూలం ఇవ్వడం అతడిని మరీ రెచ్చిపోయేలా చేసింది. దాంతో శ్రీకృష్ణుని చక్రాయుధానికి బలయ్యాడు. అహంకారం అనర్ధ హేతువ్ఞ. అది ప్రబలినప్పుడు మంచిచెడ్డలు బుర్రకెక్కవ్ఞ. అహంకారంతో, ఆవేశంతో చేసే పనులు మంచి ఫలితాలనివ్వవు.

అహంకారాన్ని అదుపులో ఉంచుకోగలిగితే తప్పు ఒప్పులు ఎవరికి వారికే అవగతమవుతాయి. తర్వాత నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే సత్ఫలితాలు కలుగుతాయి. అహంకారాన్ని అదుపులో ఉంచుకోవాంటే ఒకటే మార్గం. భగవధ్యానం. భగవంతుని మీద పూర్తిగా మనసుని లగ్నం చెయ్యగలిగినప్పుడే అహంకారం అదుపులో ఉంటుంది. మనసు ప్రశాంతత పొందుతుంది.

     - వులాపు బాలకేశవులు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/