ప్రార్థనా విజయాలనేకం

అంతర్వాణి: బైబిల్‌ కథలు-

Jesus
Jesus

‘విూరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమేగాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి.. (మత్తయి 26:41).

ఇది యేసు ప్రభువే స్వయంగా అంటున్న మాటలు. అవును నిత్యం సమస్యలు, ఇబ్బందులు వంటి శోధనలు ఎన్నో మనల్ని చుట్టుముడుతున్నాయి.

అనేక శ్రమలు అనుభవించి పరలోకానికి ప్రవేశించాలి. ఈ విషయాన్ని విని చాలామంది ప్రభువును వెంబడించేందుకు వెనుకాడుతుంటారు. అసలు యేసుప్రభువే ఎన్నో శ్రమలను, హింసలను ఎదుర్కొన్నారు.

మనం ఏపాటివారం? ‘ఆయన శ్రమపడిన తరువాత నలువది దినములవరకు వారికగపడుచూ, దేవు ని రాజ్యవిషయములనుగూర్చి బోధించుచు, అనేక ప్రమాణములను (రుజువులను) చూపి వారికి తన్నుతాను సజీవునిగా కనుపరచుకొనెను (అపొ 1:3).

ప్రభువే పలు శ్రమలను అనుభవించడం మాత్రమే కాదు ఏకంగా ప్రాణాలనే ఇచ్చాడు. ఇంత త్యాగం మనకోసం చేసాడు. మనం కూడా ఆయన శ్రమల్లో పాలివారమై కొద్దిలో కొన్నైనా శ్రమలను అనుభవించి, పరలోకానికి చేరుకోవాలి.

అందుకే ప్రభువు మనకు శ్రమలు, ఇబ్బందులను అనుమతిస్తుంటాడు. అంతేకాదు ఈ శ్రమల వల్ల ఆధ్యాత్మికంగా బలపడేందుకు దోహదం చేస్తాయి.

అయితే ప్రభువు ముందుగానే ఒక హెచ్చరిక చేస్తున్నాడు. మీరు శోధనలో పడకుండా మెలకువగా వ్ఞండి ప్రార్థన చేయమని చెబుతున్నాడు.

అవును ప్రార్థన వల్ల మనకు విజయం. నేటికాలంలో మనకు ప్రార్థన చాలాచాలా తక్కువైపోయింది. అన్నింటికీ ప్రాధాన్యతనిస్తున్నాం కానీ ప్రార్థనకు మాత్రం సరైన సమయాన్ని కేటాయించలేకపోతున్నాం. మనకు అన్ని అత్యవసరమైనవిగానే కనిపిస్తున్నాయి.

కానీ ప్రార్థన మాత్రం అత్య వసరమైనది భావించ లేకపో తున్నాం. టైమ్‌ ఉంటే చేద్దాం, ఏదో కాసేపు చేస్తే చాలు వంటిభావాలు మనలో ఉన్నాయి. అందుకే మనం శోధనలను జయించలేకపోతున్నాం.

సమస్యలవలయంలో కొట్టుమిట్టాడుతున్నాం. సాతానుకు బలాన్ని ఇస్తున్నాం. మన మోకాళ్లు ఎప్పుడైతే వంగుతాయో అప్పుడు అపవాదికి భయం కలుగుతుంది.

దేవుడి శక్తి, బలాన్ని మనం చూడగలం. శోధనలను జయించగలం. ప్రార్థన అంటే హృదయాన్ని కుమ్మరించే అనుభవంతో చేసేదిగా ఉండాలి. ఉపవాసంతో చేయాలి.

ఎప్పుడైతే ప్రార్థన అనే భారం మనకు ఉంటుందో అప్పుడే మనం ఆసక్తితో, కన్నీటితో, ఉపవాసంతో ప్రార్థన చేయగలం. ఆ భారం లేకపోతే మనకెన్ని ఇబ్బందులు వస్తున్నా వాటిని తేలిగ్గా తీసుకుంటాం.

కాబట్టి ప్రార్థన భారాన్ని ఇవ్వమని దేవ్ఞడిని వేడుకోవాలి. సంఘంపట్ల, దేశంపట్ల, కుటుంబాలపట్ల భారం ఉన్నప్పుడు తప్పనిసరిగా ప్రార్థన కోసం సమయాన్ని కేటాయిస్తాం.

అవసరమైతే నిద్రను తగ్గించుకుని వేడుకుంటాం. అబ్రాహాము ప్రార్థన వల్ల లోతు కుటుంబం కాపాడబడింది. నీనెవె పట్టణస్తులు ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు నాశనం నుంచి ఆ పట్టణం కాపాడబడింది.

ఒక్క ఏస్తేరు ఉపవాస ప్రార్థన వల్ల మొత్తం యూదాజాతి కాపాడబడింది. దానియేలు ప్రార్థన వల్ల సింహాల నుంచి రక్షించబడ్డాడు.

ఇలా ప్రార్థనవల్ల రక్షించబడినవారు, అద్భుతాలను అనుభవించనవారు అనేకులు ఉన్నారు. కాబట్టి ప్రార్థన కోసం తప్పనిసరిగా సమయాన్ని కేటాయించి, శోధనల నుంచి గట్టెక్కుదాం. దేవుడు అట్టి కృపను అనుగ్రహించునుగాక..

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/