కష్టాలకోర్చి కరుణ చూపిన మహనీయులు

ఆధ్యాతిక చింతన

vaartha devotional stories
om

మూఢ విశ్వాసాల నుంచి, మూర్ఖ ఆచారాల నుంచి, అజ్ఞాన అంధకారం నుంచి, సంకుచిత భావాల నుంచి సామాన్య జనాన్ని బయటికి తేవటానికి అలుపెరుగక కృషి చేసిన మహనీయులు ఎందరెందరో! వారికి మానవ సమాజం పట్ల ఉన్న ప్రేమకు హద్దులే లేవని తెలుపుతుంది

ప్రపంచ చరిత్ర. మంచిని కోరిన సోక్రటీసుకు హెమ్లాక్‌ అను విషాన్నిచ్చి చంపింది ఈ లోకం. ‘బహుజన హితాయ, బహుజన సుఖాయ అని రాత్రింబవళ్లు తన ఆరోగ్యాన్ని లెక్కచేయక శ్రమించిన గౌతమ బుద్ధుడిని నానా ఆగచాట్ల పాలు చేసింది ఈ సమాజం.

చివరి క్షణం వరకు, చివరి రక్తపు బొట్టు వరకు క్షేమాన్నే కాంక్షించిన యేసు ప్రభువ్ఞను శిలువ వేసి క్రూరాతిక్రూరంగా హింసించింది ఈ లోకం.

ప్రతి శ్వాసతో శాంతినే కోరిన మహ్మద్‌ ప్రవక్తను మక్కా నుంచి మదీనాకు అజ్ఞాతంగా పోయేట్టు ఇబ్బందుల పాలయ్యేట్టు చేసింది ఈ సంఘం.

పరోపకారమే ప్రాణమై జీవించిన గురునానక్‌ ఎముకలు కొరికే చలిలో ఒక రాత్రంతా కసూర్‌ పట్టణంలో ఎవరూ ఏ ఇంటిలోనికి అనుమతించకపోవటంతో ఒక కుష్టురోగితో పాటు పాకలో గడిపాడట!

ఇక ఆర్యసమాజ స్థాపకుడు మహర్షి దయానంద సరస్వతికి విషాహారం పెట్టి చంపారు. వివేకానంద స్వామికి, మహర్షి మలయాళ స్వామికి అడుగడుగునా ఎన్నో ఇబ్బందులు కలిగించింది ఈ సంఘం.

సంకుచిత మత మౌఢాన్ని వీడమని చెప్పినందుకు, సమస్త మానవాళిని గురించి ఆలోచింపుడని చెప్పిన గాంధీ మహాత్ముడిని నిస్సంకోచంగా హతమార్చింది

ఈ మానవ సమాజం. ఆ మహనీయులెవ్వరూ సంపాదన కోసం, అధికారి కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం ప్రాకులాడలేదు. వారి రాజ్యాలను, భార్యాపిల్లలను, సుఖసంతోషాలను, చివరకు ప్రాణాలను సైతం దారపోశారు.

వారు కోరిన దంతా కేవలం సంఘ శ్రేయస్సే, సమాజాభివృద్ధే. ప్రజల కష్టాలను, నష్టాలను, రోగాలను, పాపాలను వారే భరించారు.

వారు మానవ మాత్రులా లేక రూపం దాల్చిన దివ్య మూర్తులా? సహనం, ఓర్పు, దయ, ప్రేమ, కరుణ, శాంతి ఇవే వారి ప్రాణాలు, వారి రూపాలు. వారి శరీరాలు కేవలం ఆ సద్గుణాల తొడుగులు మాత్రమే.

వారిని పొగుడుతూ, కీర్తిస్తూ, పూజిస్తు, స్మరిస్తూ వారి జయంతులను, వర్దంతులను హుషారుగా జరుపుకొంటే ప్రయోజనం లేదు.

వారిలోని సద్గుణాలను మనం అలవరచుకొని, ఆచరిస్తూ జీవించాలి, మరణించాలి.
వారు చూపిన బాట నుండి వైదొలగక వారి అడుగుజాడల్లో నడవాలి.

ఇందాక ఈ ప్రపంచం నుంచి ఈ ప్రకృతి నుంచి, ఈ మానవ సమాజం నుంచి రెండు చేతులతో, మెదడుతో ఎంతో, ఎంతెంతో తీసుకున్నాము.

ఇకనైనా నెమ్మదిగా కొంతకొంతైనా ఇస్తూ, ఇస్తూ ఖాళీ చేతులతో, ఖాళీ మెదడుతో, సులభంగా, హాయిగా జారుకుందాం. మన స్వస్థలానికి చేరుకుందాం.

సంతోషంగా మనం అలా చేయటానికి సిద్ధపడకపోతే ఏమవ్ఞతుందంటారా? అయితే వివేకానందస్వామి ఏమి చెబుతాడో వినంది ‘ప్రకృతి నుండి అంతా తీసుకుని గట్టిగా నీ చేతుల్లో మూసి బెట్టుకోవాలని చూస్తావ్ఞ. కానీ ప్రకృతి నీ గొంతుపై అదిమి నొక్కి చేతులను తెరిచేట్లు చేస్తుంది.

నీ నుంచి అంతా లాగేసుకుని, నిన్ను ఖాళీ చేసి పక్కన పడేస్తుంది.

మరి బాధపడుతూ అన్నిటిని పోగొట్టుకొని పోవటం మంచిదా లేక ఆ మహనీయుల్లాగా స్వచ్ఛందంగా, ప్రేమతో అన్నిటిని అందరికి పంచి, ఆనందంగా పోవటం మంచిదా?

  • రాచమడుగు శ్రీనివాసులు

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/health1/