జ్ఞ్ఞానోదయం

sun rises
Knowledge is a mercy

మన మతగ్రంథాలయిన భారత, భాగవత, రామాయణాదులను చదువుతున్నప్పుడు శాస్త్రజ్ఞుడు తన ప్రయోగశాలలో ఏకాగ్రతతో ఎలా పరిశీలన చేస్తాడో అలా పరిశీలన చేయవలసి ఉంటుంది. శ్రద్ధతో చేసే పరిశీలన సత్యాన్ని కనుగొనగలుగుతుంది. అంతరార్ధాన్ని పసిగట్ట గలుగుతుంది. ‘అనంతమైన జలములందు ఈ పద్మమెట్లు వచ్చింది? నేను ఎవరు? ఎచ్చటి నుండి వచ్చితిని? దీనికి ఆధారంగా ఏ వస్తువు ఉన్నది? ఈ విధంగా ఆలోచించిన బ్రహ్మ ఆ పద్మపుకాండము ద్వారా నీటిలోనికి ప్రవేశించెను. అట్లుపోగా ఆయన పద్మమునకు ఆధారమైన నాభి స్థానమునకు చేరుకొనెను. ఈ విధంగా తన ఉత్పత్తి స్థానమును వెదకుచూ చాలా కాలము గడచిపోయినది.

తిరిగి ఆయన తన స్థానమునకు వచ్చి శ్వాసను జయించి మనస్సును నిరోధించి సమాధిస్థితిని చేరుకొనెను. బ్రహ్మ ఈ విధంగా వంద సంవత్సరములు సమాధి స్థితి పొంది యుండెను. పిదప ఆయనకు జ్ఞానోదయమై తన జన్మ కారణము తెలియవచ్చెను. దీన్ని విశ్లేషిద్దాం. ఎవరు ఎన్ని చెప్పినా, ఏ మతగ్రంథాలు ఏమి బోధించినా మనము పైపైన కొంత నమ్మినా కొన్ని ప్రశ్నలు, సందేహాలు మనలను వెంటాడుతూనే ఉంటాయి. నేను ఎవరు? ఈ ఇంట్లోనే ఈ తల్లిదండ్రులకే ఎందుకు పుట్టాను? అసలు ఈ ప్రపంచం ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు సృష్టించారు? ఎందుకు సృష్టించారు. ఇందులో నా పాత్ర ఏమిటి? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు కలుగుతాయి.

సమాధాన కోసం గ్రంథాలు చదువుతాం. ఇతరులను ఆశ్రయిస్తాం. ఎక్కడెక్కడో వెళతాం, ఏమేమో చేస్తాం. అయినా సమాధానాలు దొరకవు, దొరికిన విషయాలు మన మనస్సును సమాధాన పరచి శాంతింప చేయలేవు. సరిగ్గా భాగవతములోని ఈ కథలో బ్రహ్మకు అలాగే జరిగింది. ఎన్నెన్ని ప్రశ్నలు కలిగాయి. జవాబులు చెప్పటానికి ఇంకొకరు లేరు కాబట్టి తానే బయటకు వెళ్లి తిరిగి తిరిగి అన్వేషించాడు.

బయట ఎక్కడా ఆయన ప్రశ్నలకు సమాధానాలు చిక్కలేదు. తిరిగి తన స్థానానికి వచ్చి ఆసనం వేసుకుని కళ్లు మూసుకుని నెమ్మదిగా శ్వాసను గమనిస్తూ లోపల అన్వేషించాడు. జ్ఞానోదయమైంది. సందేహాలు, సమస్యలు తీరిపోయాయి. మరి, ఈ కథ బోధ ఏమిటి? ‘సంచారం అంటే బయటి అన్వేషణ ప్రయోజనం లేనిది, ‘విచారం అంటే లోపలి అన్వేషణ ప్రయోజనకరం. దాని వల్లే వస్తాయి జ్ఞానం, విశ్వప్రేమ. మహనీయుల జీవితాలు దాన్నే మరీ మరీ దృఢపరుస్తాయి.

  • రాచమడుగు శ్రీనివాసులు

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/