పేదలపై మమకారం చూపాలి

Jesus111
Jesus

పేదలపై మమకారం చూపాలి

ఆయన ఒక గొప్ప సేవకుడు. ఒకసారి విదేశాల్లో ఒక క్రైస్తవ సభ జరుగుతున్నప్పుడు ఈ సేవకుడు అక్కడ ఉన్నారు. సమావేశం జరుగుతున్న సమయంలో ఈ సేవకుడు వంటగదిలోకి వెళ్లారు. అక్కడ ఒక స్త్రీ వంటపనిలో నిమగ్నమైవ్ఞంది. ఆమె వద్దకు వెళ్లి ‘మేడమ్‌ కెన్‌ ఐ హెల్ఫ్‌ యూ? అని అడిగారు. ఆమె ‘ఉల్లిపాయల్ని తరిగే పనిని సేవకుడికి అప్పగించింది. అలా ఉల్లిపాయలు తరుగుతున్న సమయంలో ఆమె వివరాల్ని సేవకుడు అడిగారు. ఆమె ప్రస్తుతం తాను ముంబయిలో నివసిస్తున్నానని, ఇండియాకు వచ్చినప్పుడు ఒకసారి వచ్చి కలవమని చెప్పి అడ్రస్‌ ఇచ్చింది. ఈ సేవకుడు ఆరుసంవత్సరాల తర్వాత ఇండియాకు వచ్చి, ముంబయిలో ఆమెను కలిసేందుకు వెళ్లారు. కానీ ఆమె కుటుంబం అక్కడ లేదని, వారు తిరిగి తమ దేశానికి వెళ్లిపోయారని అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్‌ చెప్పాడు.

నిరాశతో సేవకుడు వెనుతిరిగి వస్తున్నప్పుడు ‘ఇక్కడ మరొక విదేశీయుడు ఉన్నాడు, కావాలంటే అతడిని కలవండి అని సలహా ఇచ్చాడు. ఎందుకులే అనుకున్న సేవకుడు సరే ఒకసారి కలిసి వెళ్దామని ‘అతడి ఇంటికి వెళ్లారు. కాలింగ్‌ బెల్‌ కొట్టగానే ఒక పెద్దాయన వచ్చారు. ‘మీరు ఎవరు? అని ప్రశ్నించారు. అందుకు ఆ సేవ కుడు నేను పలానవ్యక్తి అని చెప్పి తన వివరాల్ని చెప్పారు. వెంటనే ఆ విదేశీయుడు ‘బాప్టిస్ట్‌ చర్చిలో ఈరోజు మీటింగ్‌ ఉంది, ఎవరు దేవ్ఞడి వాక్యం చెబుతారా అని అనుకుంటున్నాం,

సరే నీవు వాక్యం చెప్పు అని అన్నారు. దానికి ఈ సేవకుడు నాకు పెద్దగా వాక్యం రాదు, అయినా దేవ్ఞడి నడిపింపును బట్టి చెబుతానని వాక్యాన్ని బోధించారు. అంతే అలా మొదలైన ఆ సేవకుడి పరిచర్య నేడు దేశంలోనే కాదు విదేశాల్లోనూ విస్తరించింది. దేవ్ఞడు ఆ సేవకుడి ద్వారా ఎన్నో అద్భుత కార్యాలను చేశాడు. ఆ సేవకుడు ఎవరో కాదు సహోదరుడు భక్త్‌సింగ్‌గారు. ఈయన గురించి తెలియని వారుండరు. ఒక సందర్భంలో భక్త్‌సింగ్‌గారు ‘చూడండి ఆరోజు ఆ స్త్రీకి నేను ఉల్లిపాయల్ని కట్‌ చేసే చిన్న సాయం చేసినందుకు దేవ్ఞడు నాకు ఎంతటి పరిచర్యను ఇచ్చాడో, కాబట్టి చిన్నసాయం అయినా దేవ్ఞడు దాన్ని పదింతలుగా దీవిస్తాడని చెప్పారు. నిజమే ‘నాపేరిట గ్లాసెడు నీళ్లు ఇచ్చేవాడు తన ఫలాన్ని పోగొట్టుకోడు అని యేసు చెప్పాడు.

‘పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము (అపొ: 20:35) అనే మాటను గమనిస్తే ఇవ్వడంలో ఉన్న ప్రాధాన్యతను గమనించవచ్చు. ఇతరులకు మనం సాయం చేసేవిషయంలో ఎప్పుడూ నిర్లక్ష్యం వహించకూడదు. మనకు చేతనైనంతమట్టుకు సాయం చేయాలి. అదే మనకు అనుకోని పరిస్థితుల్లో పెద్ద ఉపకారంగా ఉపయోగపడుతుంది. సారెపతు అనే ఊరికి ఏలీయా అనే ఒక దైవప్రవక్త వెళ్తాడు. అక్కడ విపరీతమైన కరువ్ఞ ఉంది. తినేందుకు ఆహారం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏలీయాను దేవ్ఞడు అక్కడికి వెళ్లమంటాడు.

సారెపతుకు వెళ్లిన తర్వాత ఏలీయా ఒక విధవరాలిని చూసి ‘తాగేందుకు కాస్త నీళ్లు ఇమ్మంటాడు, తర్వాత తినేందుకు ఒక రొట్టెముక్కను తీసుకుని రమ్మంటాడు. అందుకు ఆమె ‘తనవద్ద తొట్టిలో పట్టెడు పిండి మాత్రం వ్ఞంది. చనిపోయేందుకు ముందు నేను నా బిడ్డ తినేందుకు సిద్ధం చేసుకునేందుకు పుల్లల కోసం ఇక్కడకి వచ్చానని చెబుతుంది. అందుకు ఏలీయా ‘భయపడవద్దు, పోయి నీవ్ఞ చెప్పినట్లు చేయుము, అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసికొనిరమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసికొనుము. భూమి విూద యెహోవా వర్షము కురిపించువరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువకాదు, బుడ్డిలో నూనె అయిపోదని (1రాజులు 17:8-16) అని చెబుతాడు.

ఆ స్త్రీ ఏలీయా చెప్పినట్లుగా మొదట ఒక అప్పము చేసి ఏలీయాకు ఇస్తుంది. తద్వారా దేవ్ఞడు ఆమెను దీవించడం ద్వారా ఆమె ఇంట్లో నూనె, పిండి అయిపోలేదు. ఏలీయా కూడా ఆమె ఇంట్లో అనేకదినాలు భోజనాన్ని చేశారు. సారెపతు ఊరిలో ఉన్న విధవరాలైన స్త్రీ తనకున్న కొద్దిపిండిలోనే తన బిడ్డకంటే ముందుగా ఏలీయాకు అప్పము చేసి తీసుకొచ్చింది. దీంతో భయంకరమైన కరువ్ఞ పరిస్థితుల్లో ఆమె, ఆమె బిడ్డ, ఏలీయా ముగ్గురు తృప్తిగా పోషించాడు. చాలాసార్లు మనం దానం చేసేందుకు వెనుకాడతాం. దాని గురించి పెద్దగా పట్టించుకోం. దానమంటే కోటిశ్వరుడే చేయనక్కర్లేదు. ‘మనకే ఇబ్బందిగా ఉంది, ఇక ఇతరులకేం ఇస్తాం! అని అనుకుంటారు. కోటిరూపాయలు ఉన్న వ్యక్తి వెయ్యిరూపాయాల్ని దానం చేయడం సులభం. కానీ వందరూపాయలు ఉన్న పేదలు పదిరూపాయల్ని దానం చేయడం కష్టం.

కానీ ఆ కష్టం, ఇబ్బందుల్లో దానం చేస్తే అదే పెద్ద ఉపకారంగా దేవ్ఞడు మరింతగా మనల్ని ఆశీర్వదిస్తాడు. కొందరు దానమంటే పాత దుస్తుల్ని, పాడైపోయిన ఆహారపదార్థాల్ని ఇస్తారు. ఇలా చేయడం కూడా పాపమే. మనం ధరించలేని దుస్తుల్ని, మనం తినలేని ఆహారాన్ని ఇవ్వడం సరైంది కాదు. దీన్ని దేవ్ఞడు హర్షించడు. ‘బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును (కీర్తన 41:1) అనే మాటను మనమెంతవరకు నెరవేరుస్తున్నాం? నిత్యం మనకెన్నో ఆపదలు పొంచి వ్ఞంటాయి. వీటన్నింటి నుంచి మనం తప్పించబడాలంటే ఖచ్చితంగా బీదలపై కరుణను చూపాలి. పేదలకు, మనకు వచ్చే ఆపదలకు పోలిక ఏంటి? పేదలపై దేవ్ఞడి ప్రేమను మనం అర్థం చేసుకోవచ్చు. మనం దీవింపబడాలన్నా, ఆపదల నుంచి తప్పించబడాలన్నా మనకున్న ఏకైకమార్గం బీదలపై మమకారాన్ని చూపడమే. ఒక మంచిపని చేస్తే ఆ మేలు తగిన మంచిఫలం ఎప్పుడైనా మనకు లభిస్తుంది. పేదలనే కాదుకాని అవసరమైన పరిస్థితుల్లో ఎవరికైనా సాయం చేసే స్థితిలో మనం ఉన్నపుడు చేతుల్ని ముడుచుకోరాదు.

– పి. వాణీపుష్ప