మృదువైన మాట జీవితాన్ని నిలుపుతుంది

JESUS---
JESUS—

మృదువైన మాట జీవితాన్ని నిలుపుతుంది

‘ఎవడైనను నోటికి కళ్లెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తిగలవాడనని అనుకొనిన యెడల వాని భక్తి వ్యర్థమే (యాకోబు 1:26), ‘తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును. ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును (సామె 13:3), ‘విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదువ్ఞలను మూసికొనువాడు బుద్ధిమంతుడు (సామె 10:19). ఈ వాక్యాలను గమనిస్తే, నోటిని మనమెంతగా కాపాడుకోవాలో అర్ధం చేసుకోవచ్చు. దైవభక్తిగలవారని చెప్పుకునేవారు తమ నోటిని కాపాడుకోవాలి. నోటిని గురించి యాకోబు భక్తుడు తన గ్రంధంలో చాలాచక్కగా వివరించారు. ‘నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాపప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యము కలుగజేయుచు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును (యాకోబు 3:6). నాలుక నిజంగా అగ్నివంటిది. కొందరి మాటలు కత్తులా చాలాపదునుగా ఉంటాయి. ఎదుటివారి మనసును, హృదయాన్ని గాయం చేయనిదే వారికి నిద్రపట్టదు. మరికొందరు తమ నాలుకలతో ఎదుటివారిని హతమారుస్తుంటారు. నాలుకతో అబద్దాలు చెబుతారు. నాలుక వలన అనేకులు నరకానికి పాత్రులుగా జీవిస్తున్నారు. ఆదివారం మాత్రం బుద్ధిమంతులుగా, నీతిమంతులుగా దేవాలయానికి వచ్చి, ప్రభువ్ఞను ఆరాధిస్తారు. తమ సాక్ష్యం గొప్పదని భావిస్తారు. నోటిని అదుపులో పెట్టుకోలేకపోతే మన క్రైస్తవ విశ్వాసమంతా వ్యర్థమని యాకోబు భక్తుడు చాలాస్పష్టంగా చెబుతున్నారు. కాబట్టి మనం ప్రభువ్ఞను నమ్ముకొనకముందు ఎలాపడితే అలా మాట్లాడి వ్ఞంటాం. మాటలతో ఎంతో పాపం చేసివ్ఞంటాం. కానీ దయగల దేవ్ఞడు తన కృపాసమృద్ధినిబట్టి ఈ సంకేళ్ల నుంచి విడిపించాడు. మన మాట విధానాన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యర్ధంగా మాట్లాడకూడదు, బూతుమాటల్ని ఉపయోగించకూడదు. కోపంతో రగిలిపోతూ, ఎదుటివారిని తిట్టకూడదు. ఇవన్నీ అందరికీ తెలుసు. కానీ దీన్ని ఆచరణలో పాటించేవారు మాత్రం కొంతమందే. ‘కోపపడుడిగాని పాపము చేయకుడి, సూర్యుడస్తమించువరకు విూ కోపము నిలిచియుండకూడదు (ఎఫె 4:26). ఈ వాక్యాన్ని చాలామంది సగం వరకే అర్ధం చేసుకుని, పాటిస్తున్నారు. కోపపడుడి అని ఉందికదాని కోపపడుతూనే ఉంటారు. కానీ రెండోవాక్యాన్ని విస్మరిస్తారు. ‘నాకు కోపం వస్తే నేను మనిషిని కాదంటారు. ‘కోపం ఏం చేస్తానో నాకే తెలియదని అంటారు. తమకు నియంత్రణశక్తి లేదని అంగీకరిస్తారు. మరి నోటిని అదుపులో పెట్టుకోలేకపోతే భక్తి అంతా వ్యర్థమేనని దేవ్ఞడి వాక్యం సెలవిస్తుంది కదా! ఒకటిమాత్రం నిజం వాస్తవంగా మన హృదయంలో దేవ్ఞడు ఉంటే, పరిశుద్ధాత్మ కార్యం మనలో జరుగుతుంటే నోటిని నిజంగానే అదుపులో పెట్టుకుంటాం. దేవ్ఞడి వాక్యానికి లోబడతాం. విశ్వాసాన్ని కాపాడుకుంటాం. దేవ్ఞడిని ప్రేమించేవారు ఆయన ఆజ్ఞల్ని కూడా పాటిస్తారు. నరుడి కోపం దేవ్ఞడి నీతిని జరిగించలేదు. మన కోపం మంచులా ఉండాలే తప్ప మంటలో వేసిన నిప్పులా ఉండకూడదు. పెదవ్ఞలపై ఎప్పుడు ‘క్షమించమనే పదాన్ని ఉంచుకోవాలి. సారీ అనే మాటను చెప్పేందుకు ఎక్కువ సమయాన్ని తీసుకోకూడదు. అప్పుడే మన ప్రార్ధన దేవ్ఞడు వింటాడు. మన భక్తిజీవితాన్ని దేవ్ఞడు మెచ్చుకుంటాడు. అందరితో సమాధానం, పరిశుద్ధత కలిగి ఉండాలని పౌలు తన పత్రికలో పేర్కొన్నాడు. కాబట్టి మనం విశ్వాసులమని భావిస్తే, ఆవిధంగా మన ప్రవర్తన ఉండాలి. అప్పుడే ఆత్మీయంగా మరింతగా ఫలిస్తాం. లేకపోతే వాడిపోయి, రాలిపోయి, నరకంలో పడిపోతాం. జాగ్రత్త సుమా!

– పి.వాణీపుష్ప