వ్యర్ధ ప్రసంగాలొద్దు

Om
Om

వృధా ప్రసంగాలను సాధకుడు చెయ్యకూడదు. పదిమంది ఒకచోట చేరితే మాట్లాడుకునేది మూడే విషయాలు. ఒకటి విషయసుఖాలు, రెండు మిత్రులు, మూడు శత్రువ్ఞలు. ఎవరు మాట్లాడుకున్నా ఈ మూడింటిని గురించే మాట్లాడుకుంటారు. ఇవన్నీ వ్యర్థ ప్రసంగాలు. సాధకుడు అతిజాగరూకుడై వీటికి దూరంగా ఉండాలి.
ధ్యాయతో విషయాన్‌ పుంసః సంగస్తేషూప జాయతే సంగాత్సంజాయతే కామః కామాత్క్రోధోభి జాయతేI
ఒక విషయాన్ని గురించి ఆలోచించడం వల్ల, ధ్యానించడం వల్ల మనిషికి ఆ విషయము నందు సంగత్వము ఏర్పడి, దానియందు కోరిక కలుగుతూ ఉంది. విషయసుఖాలను పొందినా సుఖం లేదు. పొందకపోయినా సుఖం లేదు. కోరిక భక్తుణ్ణి బలహీనపరచి మార్గాన్ని మళ్ళిస్తుంది. మనస్సును యోగం నుండి భోగం వైపు మరల్చుతుంది. కాబట్టి సాధకుడు విషయ చింతనను కలిగించే వ్యర్థ ప్రసంగాల నుండి దూరంగా ఉండాలి. స్నేహం చాలా పవిత్రమైనది. కానీ స్నేహితులు స్నేహమంత పవిత్రులు కారు. మనిషికి స్నేహం ఉండాలే కాని స్నేహితులు అవసరం లేదు. స్నేహితులు మనిషికి ఒకరో, ఇద్దరో లేక నలుగురో ఉంటారు. మైత్రీభావం కనుక మనస్సులో ఉంటే ఎవరు తోడుగా ఉంటే వారే మనకు మిత్రులు. అలా చూస్తే అందరూ మనకు స్నేహితులే. ఈ విధమైన మైత్రిని గాక మిత్రులను పట్టుకుంటే ఆ మిత్రుడు ప్రపంచంలో ఎక్కడున్నా సరే తిన్నగా మన మనస్సులోనే ఉంటాడు. ఇప్పుడు స్నేహితుడు కనుక దూరమైతే బాధిస్తాడు. రేపు ఆ స్నేహం కాస్తా తారుమారైతే అతడు చేరి ఉన్నది మనస్సులో కనుక మనస్సును చిందరవందర చేస్తాడు. నదికి శత్రువ్ఞలు లేరు. మిత్రులు లేరు. ఎవరు దగ్గరకు వస్తే వారికి ఉపయోగపడుతుంది.
యస్వర్వత్రా నభిస్నేహః తత్తత్‌ ప్రాప్య శుభాశుభమ్‌ నాభినందతి న ద్వేష్టి, తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితాII ఎవడు సమస్త విషయముల యందు అభిమానము లేనివాడై తత్సంబంధమైన మంచి చెడులు కలిగినపుడు సుఖదుఃఖములు పొందక యుండునో అట్టివాని బుద్ధి స్థిరముగా ఉండునని గీతాచార్యుని బోధ. స్నేహాలు అమితంగా పెరిగిపోతే ఒక దశలో భగవంతుడినే మరచిపోయే పరిస్థితి ఏర్పడవచ్చు.

ప్రాపంచిక విషయాలన్నీ చర్చించి మనస్సులో లేనిపోనివన్నీ సృష్టించి మన కాలాన్ని హరించేవారే స్నేహితులు. భగవంతుడినే ఆశ్రయస్థానంగా ఆసక్తిస్థానంగా భావించే సాధకుడికి స్నేహితులతో పనిలేదు. అవసరాలలో ఉపయోగపడేవాడు స్నేహితుడు అని భావించేవారిది వ్యాపార స్నేహం. పవిత్రమైన స్నేహంలో వ్యాపారం లేదు. కాబట్టి ఉండవలసినది స్నేహభావమే కానీ స్నేహితులు కారు. చివరగా, శత్రువ్ఞలను గురించిన చర్చ. ఇది మరీ ప్రమాదకరం.
సాధకుడి ప్రగతికి ప్రతిబంధకం. శత్రుత్వం మనస్సులో కదులుతూనే అనవసరమైన ఉద్రేకాలు, ఆవేశాలు తలెత్తి బుద్ధిని పాడుచేస్తాయి. వ్యక్తులలో దోషాలు ఉండవచ్చు. కానీ ప్రపంచంలో వ్యక్తులలోని దోషాలన్నీ మన మనస్సులో ఉండవలసిన అవసరం లేదు. కట్టెలోని అగ్ని కట్టెను దగ్ధం చేస్తుంది. మనిషిలోని ద్వేషాగ్ని, దోషాగ్ని మనిషినే దగ్ధం చేస్తుంది.
ద్వేషాగ్ని, మన మనస్సులోకి ప్రవేశించకుండా మనం కాపాడుకుంటూ ఉండాలి. వృధా ప్రసంగాలలో చోటు చేసుకునేవి ఇంతవరకు మనము చర్చించిన ఈ మూడే. వీటి నుండి సాధకుడు దూరంగా ఉండాలి. నోరు ఉన్నందుకు మాట పవిత్రంగా, అమృత తుల్యంగా, ఎదుటివారి మనస్సును రంజింపజేసే విధంగా, స్పందింప చేసే విధంగా ఉండాలి.
వారిలో ఒక ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపి సన్మార్గంలో నడిపే విధంగా ఉండాలి. కాని ఆవేశాలను, ఉద్రేకాలను రేకెత్తించి పెడత్రోవ పట్టించే విధంగా ఉండకూడదు. ఒక మంచి మాట మాట్లాడటం భగవంతుడు ఇచ్చిన వరం.