ధర్మార్జితం

Maharshi
Maharshi

న్యాయమార్గంలో, ధర్మమార్గంలో ధనాన్ని సంపాదించవలసిన ఆవశ్యకతను గూర్చి మన పూర్వీకులు, మనగ్రంథాలు పదేపదే చెప్పిన కథలెన్నేన్నో! ఒక సాధువు విసన కర్రలను తయారుచేసి అమ్మి, వచ్చిన ధనంతో తాను జీవించి, ఇతరులకు కూడా కొంత ఇచ్చేవాడట. ఒకసారి ఒక ధనవంతుడు అతని దగ్గరకు వచ్చి నా వద్ద చాలా డబ్బు ఉంది, మీరు తీసుకోండి అన్నాడట ఆయతనో. అపుడా సాధువు నాకు వద్దుగానీ నీవు ఆ బాటపైకి వెళ్లి ఎవరు కనపడితే వాని కివ్వు, వానికి తెలీకుండా వాని వెనుక పో, వాడు ఆ డబ్బుతో ఏం చేస్తాడో చూసి వచ్చి, చూసిందంతా చూసినట్టుచెప్పు అన్నాడు. ఆ ధనికుడు అలాగే బాటపైకి వెళ్ళి ఒక వ్యక్తికి ఇచ్చాడు. వాడు సంతోషంతో మద్యం దుకాణానికి పరుగులు తీశాడు. బాగా తాగాడు, మాంసాన్ని తిన్నాడు.
బాగా తలకెక్కిన మత్తుతో ఇంటికి పోయి భార్యాపిల్లలతో గొడవపడి వారిని చావ దన్నాడు. ఆ ధనికుడు సాధువు వద్దకు తిరిగి వచ్చి విషయాన్నంతా చెప్పాడు. సాధువు ఒక చిరునవ్వు నవ్వి తన చాపక్రింద తాను విసనకర్రలను అమ్మి సంపాదించి పెట్టిన ధనాన్ని తీసి ఇచ్చి ఇంతకు ముందులాగే చేసి, గమనించి, వచ్చి చెప్పమన్నాడు. వాడు సంతోషంగా ఆ డబ్బును తీసుకొని, కృతజ్ఞతలు చెప్పి, సరాసరి ఒక మందుల షాపుకు వెళ్లి కొన్ని మందులను కొన్నాడు. పండ్ల అంగడికి వెళ్లి పండ్లను కొన్నాడు. వస్త్రాల అంగడికి వెళ్లి తండ్రి కొరకు పంచ, తల్లి కొరకు చీర కొన్నాడు. ఇంటికి వెళ్లి తండ్రికి మందులను, వస్త్రాని ఇచ్చాడు. తల్లికి కొత్త చీర ఇచ్చి వారి పాదాలకు నమస్కరించి ఆశీర్వదించమన్నాడు. దీన్నంతా చూసిన ధనికుడు సాధువు వద్దకు తిరిగి వచ్చి తాను చూసినదంతా చెప్పాడు. అపుడు ఆ సాధువు” చూసావా! ధర్మంగా సంపాదించిన నా డబ్బు ఎలాంటి వారికి చేరినదో, ఎలాగ ఉపయోగపడినదో, అధర్మంగా సంపాదించిన నీ డబ్బు ఎవరికి చేరిందో, ఎలాగ ఖర్చయినదో? అని అడిగాడు.
ఈ కథ నుంచి ముందు తల్లితండ్రులు గ్రహించవలసింది ఎంతో ఉంది. అవన్నీ కాకమ్మ కథలను కొంటే నా స్వీయ అనుభవమేమిటో వినండి… మాది అనంతపురం జిల్లాలో గుత్తి పట్టణం. అక్కడ మాకు ఒక చిల్లర అంగడి ఉండేది.
మా అంగట్లో నువ్వుల నునె, కుసుముల నూనె, కొబ్బెరనూనె, ఆముదాల నూనె, చేప నూనె,వేప నూనె, నెయ్యి అమ్మేవాళ్లం. మా తడ్రిగారు అంగడి ముందర పెద్ద అక్షరాలతో మా అంగట్లో అమ్మే సరుకులు మేము తయారు చేసినవి కావు, కొనుగోలుదారులు బాగా పరీక్షించి కొన గోరుతున్నాము. కొనిన తర్వాత కూడా వారికి ఏ సమయంలోనైనా నచ్చకపోతే ఆ సరుకుని వాపసు తెచ్చి పైకాన్ని తీసుకొనిపోవచ్చు.
కొలతలలోగానీ, తూకంలోగానీ అనుమానం ఉంటే మరెక్కడైనా పరీక్షించుకోవచ్చు అని ప్రకటన గల బోర్డును ఎపుడూ పెట్టేవాడు. ఇలా వ్యాపారం చేస్తే మన పిల్లల నోట్లో మట్టికొట్టిన వాళ్లమవుతాం అనేవారు కొందరు. అక్రమ వ్యాపారం చేస్తే మన పిల్లల నోట్లోకి విషం పోసినవారమవుతాం. అని అనేవాడు మా తండ్రి.
అది ఏం విచిత్రమోగాని అక్రమవ్యాపారం చేసిన వారు దివాళా తీసి వెళ్లిపోయారు.

  • రాచమడుగు శ్రీనివాసులు