108వ గురుపూర్ణిమ

అది జూలై 2వ తేదీ,1909 సంవత్సరం, ద్వారకామాయిలో సాయి దర్శనం చేసుకుంటున్నారు భక్తులు. వచ్చేవారు వస్తున్నారు, పోయేవారు పోతున్నారు. అక్కడ నూల్కర్‌ అనే భక్తుడున్నాడు. పండరీపురంలో సబ్‌జడ్జిగా పనిచేస్తున్నాడు. సాయిబాబా ద్వారకామాయిలోని ధుని పక్కనున్న స్తంభం చూపారు నూల్కర్‌కు. రేపు ఆ స్తంభాన్ని పూజించు అన్నారు సాయి. సాయిబాబా అలా ఎందుకు పలికారో ఆయనకు అర్థం కాలేదు. సాయి మాటలు చాలా విచిత్రంగా వుంటాయి. ఆయన చెబితేకాని ఆ మాటలకు అర్థం తెలియదు. నూల్కర్‌ సాయికి ఎప్పటి నుండో భక్తుడయిన మాధవరావును అర్ధం అడిగాడు. మాధవరావునే శ్యామా అని అంటారు సాయిబాబా. శ్యామాకు అర్థం కాలేదు. ఇక ఆ విషయం మర్చిపోయారందరు.

ఆరాత్రి తెల్లవారింది
అది జూలై 3వ తేదీ. నూల్కర్‌కు నిద్ర లేస్తూనే, నేడు గురుపూర్ణిమ అని గుర్తుకు వచ్చింది. ఆ విషయాన్ని శ్యామాకు, ఇతర భక్తులకు చెప్పాడు. పంచాంగం తెప్పించి చూచారు. నిజమే, ఆరోజు గురుపూర్ణిమ. ఆ ముందురోజు రేపు ఆ స్తంభాన్ని పూజించు అని సాయి పలుకులలోని ఆదేశం అర్థమయింది. అందరకు ఎంతో ఆనందమయింది. అంతవరకు సాయి తనను పూజించేందుకు అనుమతించేవాడు కాదు. పూలమాలను వేయబోయినా నిరాకరించేవాడు సాయి. అందరూ ద్వారకామాయి చేరారు. సాయిబాబా మిమ్ములను పూజించటానికి అనుమతి ఇవ్వండి అని కోరారు. కాదన్నాడు. అదిగో ఆ స్తంభాన్ని పూజించండి అన్నాడు సాయి. దేవా! ఆ స్తంభాన్ని ఎందుకు పూజించాలి? మేము మిమ్మల్నే పూజిస్తాం అన్నాడు సాయితో చనువుగా మెసలే శ్యామా. సాయి అంగీకరించలేదు. ద్వారకామాయికి మూలం ఆ స్తంభమే. అసలు స్తంభంలో నుండే మహావిష్ణువు నరసింహమూర్తిగా ప్రత్యక్షమయ్యాడు.

రాంస్నేహే సాంప్రదాయకులు రాంచరణ్‌ మహరాజ్‌ మహాసమాధిపైనున్న12 అడుగుల స్తంభాన్ని పూజిస్తారు. సింహాచలంలోని కప్పస్తంభము పూజనీయము. ఇలా అనేక స్తంభములు పూజనీయము. ద్వారకామాయిలోని ఆ స్తంభము సద్గురువుకు ప్రతీకగా భావించుకొని సాయి ఆ స్తంభమును పూజింపమంటారు. భక్తులు మొండిపట్టుపట్టారు. సాయి అంగీకరించేదాకా ఆయనను వదలలేదు. సరే మీ ఇష్టం అన్నాడు సాయి. సాయి అంగీకరించటమే ఆలస్యం. గురుపూజకు ఏర్పాట్లన్నీ చకచకా జరిగిపోయాయి. సాయిబాబా భిక్షం చేసివచ్చిన తర్వాత గురుపూజ చేస్తామన్నారు భక్తులు. సాయిబాబా రాధాకృష్ణమాయికి, దాదాకేల్కరుకు కబురుపంపారు. రాధాకృష్ణమాయి పూజాద్రవ్యాలు పంపింది. దాదాకేల్కర్‌ పూజాసామాగ్రితో ద్వారకామాయి చేరాడు. సామూహికంగా ఆ పూజ నిర్వహించబడింది. సాయిబాబా సామూహిక పూజలకు, సామూహిక ఆలయాలకు ప్రాధాన్యత ఇచ్చేవాడు. వ్యక్తిగతంగా చేసే పూజకన్నా, సామూహికంగా చేస్తే, ఎన్నో రెట్ల ఫలం దక్కుతుంది. గురుగీత 7గురువులను తెల్పుతుంది. దత్తాత్రేయ దామోదర్‌ రాస్నేకు ఓనమాలు నేర్పి సూచక గురువు అయ్యాడు సాయిబాబా. విజయానందుడను సన్యాసికి, వర్ణాశ్రమ ధర్మాలు తెల్పి సాయిబాబా వాచక గురువు అయ్యాడు. లక్ష్మీబాషి షిండ్‌కు రాజారాం అనే మంత్రమును ఉపదేశించి చోధక గురువు అయ్యాడు. మొహం, మరణం, వశ్యం మొదలగు మంత్రములను ఉపదేశించి గురువు నిషిద్ద గురువు. అటువంటి వాటిపై, వ్యామోహము గల కుశాభావ్‌ అనే వ్యక్తిని తనవద్దకు రానీయక, అట్టివాటిని విసర్జించిన తరువాతనే తన వద్దకు చేర్చుకున్నాడు సాయి నిషిద్ధ గురువ కాడు. నానాసాహెబ్‌ చందోర్కరుకు సంసారములోని సుఖదుఃఖాలు అజ్ఞానమే అని తెలిసి సాయి విహీత గురువైనాడు. ఉపనిషత్‌ వాక్యములు బోధించి, జీవునకు దేవునకు ఉన్న ఐక్యతను బోధించినవే దైవానికి అనే ఎరుకను ఉపాసనీకి కల్గించి సాయి కారణ గురువు అయ్యాడు. ఇక ఏడవ గురువు జన్మ మృత్యుభయ నాశం చేసి, సర్వసంది నిర్మూలం చేసి, పరమసత్యాన్ని తన ఆశీస్సులతో అందజేశారు నూల్కర్‌, మేఘశ్యామాదులకు పరుమగురువైనాడు. సాయి గురువే కాదు, సద్గురువు, సమర్థసద్గురువు, సమర్థసద్గురువు. జూలై 3, 1909న మొదలైన గురుపూజ అవుతుంది. 108 సంఖ్యకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈనెల 19న గురుపూర్ణిమ. ఆనాడు సాయి గురువుగా ఆరాధించి విశేషంగా పూజించుకొను పర్వదినం నమామీశ్వరం సద్గురుం సాయినాధం.
– పి.అప్పారావు