స్వయంవరం

Seeta rama

స్వయంవరం

యజుర్వేదంలో స్త్రీలకు సంబంధించిన ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి. వారి చదువ్ఞల గురించి, వారి వివాహం నిర్ణయముల గురించి ఈ వేదములో ఏం చెప్పబడిందో తెలుసుకొందాం. 14వ అధ్యాయంలో మొదటి మంత్రంలో ”విద్యలనుపదేశించు విదుషీమణులు కుమారి కన్య లకు బ్రహ్మచర్యాశ్రమమునందే గ్రహ, శ్రమ, ధార్మిక శిక్షణలను నేర్పి శ్రేష్టునొనర్చవలెను 2వ మంత్రములో నిరంతరం విద్వాంసులు సాంగత్యం శాస్త్రముల అధ్యయనం చేయాలి. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే యుద్ధము లందు కూడా తమ భర్తలతో పాటు యుద్ధము లలో పాల్గొనవలెనట. మన పౌరాణికాలలో సత్యభామ కృష్ణుడితో కలిసి నరకాసురుడితో యుద్ధం చేసి విజయం సాధించింది.

అలాగే దశరధ మహారాజుకు కైకేయి యుద్ధములో సహాయం చేసినది. అలాగే యుద్ధవిద్యలో ఝాన్సీలక్ష్మీబాయి, రాణిరుద్రమదేవి పాల్గొన్న సంగతి మనకు తెలిసినదే కదా. 14వ అధ్యాయం 8వ మంత్రంలో చెప్పిన మాదిరిగా స్త్రీ,పురుషులు స్వయంవరం విధిగా వివాహమాడి ప్రేమతో పరస్పరం ప్రియా చరణముతో శాస్త్రములను మననం చేసుకొని ఓష్యాదులు, యజ్ఞాదుల అనుష్ఠానముచే వర్ణములు కలిగించుచు సుఖులై ఉండాలి. వాల్మీకి రామాయణం, సుందరకాండలో సీతా దేవి రాక్షస వనితలతో ఇలా అంటుంది.

సావిత్రి- సత్యవంతుడు, శ్రీమతి-కపిలుడు, మదయనీ- సౌదానులు, కేసినీ-నగరులు, నల-దమయంతీలు అలానే నేను రామునితో ఉంటాను. మొదట నల-దమయంతుల స్వయంవరం తెలుసుకొందాం. నిషిధ దేశపురాజు నలుడు. అపురూప సుందరుడు. గుణవంతుడు. సత్యవాది, సర్వప్రియుడు. వేదజ్ఞానసంపన్నుడు. బలమైన గొప్ప సైన్యము కలవాడు.

అదే కాలములో విదర్భ దేశమునకు రాజు భీముడు. అతనికి ముగ్గురు కుమారులు ఒక కుమార్తె. ఆమే పెరు దమయంతి. ఆమె రూపవతి. విశాల నేత్రముల కలది. గుణవతి. అక్కడి ప్రజలు నలుడు గురించి, ఇక్కడి ప్రజలు దమయంతి గురించి మాట్లాడుకొనేవారు. ఒకనాడు నలుడు ఒక హంసను పట్టుకోగా అది ”నన్ను వదిలిపెట్టు నీ గురించి దమయంతికి చెబుతానంది. అలానే అక్కడ నలుడు గురించి చెప్పింది. నలుడికి దమయంతి కూడా సందేశం పంపింది. ఒకరి మనసులు ఒకరికి తెలిసాయి. ఈ విషయం దమయంతి తండ్రికి తెలిసి స్వయం వరం ఏర్పాటు చేసి అందరి రాజులకు ఆహ్వానం పంపాడు.

దమయంతిని వివాహం చేసుకోవా లని ఇంద్రుడు, అగ్ని, యముడు, వరుణుడు కూడా వచ్చి మధ్యవర్తిగా ఉండమని నలుడిని కోరారు. నలుడు వారి గురించి దమయంతికి చెప్పాడు. కాని దేవతల సహాయంతో ఆమె నలుడిని గుర్తించి అతని మెడలో హారం వేసి అతడిని తన భర్తగా ఎన్నుకొంది. వారి వైవాహిక జీవితం ఎన్నో కష్టములు అనుభవించినను చివరకు సుఖాంత మైనది. ఈ కథ విన్నను, చదివినను శనిదోషములు తొలగుతాయని పండితులు చెబుతున్నారు. విదర్భ దేశమునకు రాజు భీష్మకుడు. అతనికి ఐదుగురు కుమారులు ఒక కుమార్తె. పెద్దవాడి పేరు రుక్మి, కుమార్తె పేరు రుక్మిణి. తండ్రితో కొందరు పెద్దలు శ్రీకృష్ణుడు గురించి చెపుతుండగా విని కృష్ణుడిని పెండ్లి చేసుకుందామని నిశ్చయిం చుకొంది రుక్మిణి.

కాని అన్న పెద్ద రుక్మి రుక్మిణిని శిశుపాలుని కిచ్చి పెండ్లి చేయాలనుకొంటాడు. ఇది తెలుసుకొని రుక్మిణి అగ్నిద్యోతుడు అను బ్రాహ్మణునితో కృష్ణుడికి ఒక లేఖ వ్రాసింది. తనను పెండ్లి చేసుకోమని ప్రాధేయపడింది. బ్రాహ్మణుడు కృష్ణుడికి ఆ లేఖ అందజేస్తాడు. కృష్ణుడు ఒప్పుకున్నాడు. రుక్మిణి పెండ్లికూతురిగా అలంకరించుకొని పార్వతిదేవి ఆలయానికి వచ్చింది. అచ్చటి నుండి కృష్ణుడు తన రథంలో తీసుకొని వెళ్లి పెండ్లి చేసుకొన్నాడు. బలరాముడు పెద్ద సైన్యముతో వచ్చి కృష్ణుడికి సహాయం చేసాడు. ఇచ్చట కూడా రుక్మిణి కృష్ణుడిని చేసుకొనుటకు స్వయం నిర్ణయం తీసుకొన్నది. అందుకు కృష్ణుడు సహకరించాడు. రుక్మిణీ కల్యాణం చదివిన కన్యలకు త్వరగా వివాహం కుదురుతుందని ఓ కథ ప్రచారములో ఉన్నది. భర్తను ఎన్నుకొనుట యందు స్త్రీకి స్వాతంత్య్రం పూర్వం నుంచే వస్తోంది.

– జి. గోపాల చంద్రమోహన్‌ రావు