రామనామ మహిమ

OM
OM

త్రిలోకసంచారి పరమభాగవతోత్తముడు అయిన నారదుడు ఒకనాడు శ్రీమన్నారాయణుని దర్శనార్థం వైకుంఠం చేరుకున్నాడు. శ్రీహరికి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లి స్వామీ! నాకు రామనామం యొక్క అర్ధము తెలుసుకోవాలని ఉంది అన్నాడు. అప్పుడు శ్రీహరి చిరునవ్వులు చిందిస్తూ అయ్యో! నారదా! నీకు రామనామం యొక్క అర్ధము ఇంత వరకు తెలియదా. అయితే అటు చూడు ఆ చెట్టుకొమ్మ మీద వాలి ఉన్న చిలుకను అడుగు. ఆ చిలుక నీకు చెబుతుంది అని సమాధానం ఇచ్చాడు. భగవదాజ్ఞను శిరసావహించి నారదుడు చెట్టును సమీపించి చిలుకనుద్దేశించి ఓ చిలుకా! ఆరమ అంటే నీకు అర్ధం తెలుసా? అని ప్రశ్నించాడు. ‘రామ అనే శబ్దం వినేటప్పటికీ ఆ చిలుక చెట్టు నుండి రకిందపడి ప్రాణం విడిచింది. నారదుడికి మతిపోయినంత పని అయింది. అదేమిటి రామ అంటే అర్ధం ప్రాణం పోవడమేనా? అని అనుకుంటూ నారాయణనుని వద్దకు వచ్చి నారాయణా! మీరు చెప్పినట్లు చిలుకలను అడిగితే అది వెంటనే కిందపడి ప్రాణం వదిలింది. ఆ చిలుక చావుకు నేను కారకకుడన్నాను ఎంత పాపిని, అంటూ బాధపడ్డాడు. నారయణుడు ఓదార్పుగా నారదునితో నారదా! రామనామం అర్ధం తుసుకోవాలంటే గట్టి పట్టుదల ఉండాలి. ఇప్పుడే భూలోకంలో ఒక బ్రాహ్మణుని ఇంట్లో ఆవుకు దూడ పుట్టింది. ఆ దూడను అడుగు. నీకు సమాధానం లభిస్తుంది అన్నాడు. నారదుడికి భయం వేసింది. చిలుకకు పట్టిన గతే ఆవు దూడకు పడితే, ఆ యజమాని తనను పట్టుకుని కొరడాతో కొడతాడేమోనని నారదునికి అనుమానం కలిగింది. సరే! ఏమయిలే అది అవుతుందనే ఉద్దేశంతో బ్రాహ్మణుని ఇల్లు చేరాడు. ఆ బ్రాహ్మణుడు నారదునికి గౌరవ మర్యాదలు చేసి పాలు తీసుకుని రావడానికి ఇంటిలోనికి వెళ్లాడు. అదే మంచి సమయం అనుకుని నారదుడు మెల్లగా ఆ దూడ దగ్గరకు వెళ్లి ‘ఓ దూడా! రామ అంటే అర్ధం ఏమిటి? అని అడిగాడు. తక్షణమే ఆ దూడ తోక అల్లాడిస్తూ ప్రాణం విడిచింది. అనుకున్నంతా అయింది అనుకున్నాడు నారదుడు.
ఇంటి యజమాని బయటికి వచ్చే లోపల నారదుడు చల్లగా జారుకున్నాడు. మళ్లీ నారాయణుని వద్దకు వెళ్లి స్వామీ! ఆవు దూడకు కూడా చిలుకకు పట్టిన గతే పట్టింది. దీని అర్ధం ఇంతేనా; అని అడిగాడు. నారదా కాస్త ఓపిక పట్టు. ఇప్పుడే ఫలానా మహారాజుకు లేక లేక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుని అడుగు అన్నాడు. దైవాజ్ఞకు ఎదురు చెప్పలేక నారదుడు బయలుదేరాడు. కానీ కొంతదూరం పోయి వెనుకకు తిరిగి వచ్చాడు. నారాయణా? ఆ చిలుకకు ఆవు దూడకు ఎవ్వరూ దిక్కులేరు. కనుక వారు మరణించినా నన్ను పట్టుకుని అడిగిన వారు లేరు. కానీ ఇప్పుడు ఈ రాజకుమారుడే గానీ మరణిస్తే నన్ను అక్కడే బంధిస్తారు. నాకు నీ దర్శనం కూడా లేకుండా పోతుంది. సరే! ఏమైనా జరుగని అంతా నీదే భారం అంటూ అక్కడి నుండి కదిలాడు. పుత్రోదయంతో ఎంతో ఉప్పొంగుతున్న ఆ మహారాజు నారద మహర్షికి పరమానదంగా స్వాగతం పలికాడు. రండి స్వామీ! రండి. మీరు మంచి సమయానికి వచ్చారు. లేక లేక నాకు కురుడు జన్మించాడు. మీరు ఆశీర్వదించండి అని ప్రార్థించాడు. లోలోపల భయపడుతున్నా నారదుడు పైకి మాత్రం చిరునవ్వులు చిందిస్తున్నాడు. చెలికత్తెలు రాజకుమారుణ్ణి ఒక బంగారు తట్టలో పెట్టుకుని నారదుని వద్దకు తీసుకుని వచ్చి ఆశీర్వదించమని కోరారు. నారదుడు ఇంక తన సందేహం తీర్చుకునే సమయం ఆసన్నమైనదనుకుని నాయనా! రాజకుమారా! శతమానం భవతి, అంటూ వేదమంత్రాలను చదువుతూ మంత్రాలతో కలసి పోయేటట్లుగా సంస్కృతంలో, ఓ రాజకుమారా! రామ అంటే అర్ధం ఏమిటి అని ప్రశ్నించాడు.
ఆ ప్రశ్ని వింటూనే రాజకుమారుడు పక్కున నవ్వాడు. నారదుడు కూడా నవ్వాడు. బ్రతికిపోయాను అనుకున్నాడు. అది తన అదృష్టమనుకొన్నాడు. అప్పుడు ఆ రాజకుమారుడు ‘బ్రహ్మమానసపుత్రా! సర్వం తెలిసిన మీకు రామనామం యొక్క అర్థం మహిమ తెలియదా? నేను చెబుతాను వినండి. నేను చెట్టు మీద చిలుకగా ఉన్నప్పుడు మీరు వచ్చి రామనామం అర్ధం ఏమిటని ప్రశ్నించాడు. ఒక్కసారి రామనామం వినేటప్పటికీ నా జన్మసార్ధకమైంది. వెంటనే దేహాన్ని విసర్జించి ఒక బ్రాహ్మణుని ఇంట ఆవు దూడనై పుట్టాను. మీరు అక్కడికి వచ్చి అదే ప్రశ్న వేసారు. రెండవసారి రామనామం విని ఆ జన్మను కూడ విసర్జించి ఇప్పుడు రాజకుమారుడిగా పుట్టాను అన్నాడు. చూశారా! రామనామ శ్రవణ మహాత్మ్యం, పక్షి ఎక్కడ? ఆవుదూడ ఎక్కడ? రాజకుమారుడు ఎక్కడ? కేవలం నామశ్రవణం వలన ఇంతటి మార్పు కలిగితే నామస్మరణ వలన ముక్తి కలుగుతుందనండంలో సందేహం లేదు.

  • ఉలాపు బాలకేశవులు
    తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/