పాపాలు క్షమించబడే రాత్రి-షబేఖద్ర్‌

Shabae kadrad
Shabae kadrad

పాపాలు క్షమించబడే రాత్రి-షబేఖద్ర్‌

రమజాను మాసం పరమ పవిత్రమైనది. శుభప్రదమైనది. విశిష్టమైనది. ఇది వరాల వసంతం అని అందరికి తెలిసిందే. అయితే ఈ మాసం చివరి భాగానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇందులోని మొదటి పదిరోజులు కారుణ్యభరితమైనవి. ఈ దశలో దైవకారుణ్యం ఎల్లెడలా విశేషంగా వర్షిస్తుంది. రెండవ పదిరోజులు క్షమాపణ, మన్నింపుకు సంబంధించినది. ఈ దశలో దైవం తన దాసుల తప్పుల్ని మన్నిస్తాడు. ఇక మూడవ పదిరోజులు నరకాగ్ని నుంచి విముక్తి ప్రసాదించే దశ. ఈ చివరి దశలో దైవం అసంఖ్యాకమైన తన దాసుల నరక జ్వలల నుండి విముక్తిని ప్రసాదిస్తాడు. ఈ చివరి భాగానికి మరో ప్రత్యేకత ఉంది. అదేమిటంటే వేయి మాసాలకన్నా విలువైన ఒక మహారాత్రి ఉంది. ‘ఎఆకాఫ్‌ అనే ప్రత్యేక ఆరాధన కూడా ఈ చివరి పదిరోజుల్లోనే ఆచరిస్తారు. ఈచివరి పదిరోజుల్లోని మహిమాన్వితమైన మహారాత్రినే ‘షబేఖద్ర్‌ అంటారు. దీన్నే ‘లైలతుబ్‌ ఖద్ర్‌ అని కూడా పలుస్తారు.

ఈ మహోన్నతరాత్రి ఘనతకు సంబంధించి దైవం ఇలా అంటున్నాడు:
‘మేము దీని (ఖుర్‌ఆన్‌)ని ఘనమైన రాత్రి ఘనత యందు ఆవతరింపజేశాం. ఆ ఘనమైన రాత్రి అంటే ఏమిటో తెలుసా? ఆ ఘనమైన రాత్రి వెయ్యినెలల కంటె కూడా ఎంతో శ్రేష్ఠమైనది. ఆ రాత్రి ఆత్మ (జార్రీలు), దైవదూతలు తమ ప్రభువ్ఞ అనుమతితో ప్రతి ఆజ్ఞను తీసుకుని అవతరిస్తారు. ఆ రాత్రి అంతా తెల్లవారే వరకు పూర్తిగా శాంతిశ్రేయాలే అవతరిస్తూ ఉంటాయి.. (అల్‌ఖద్ర్‌:97) షబేఖద్ర్‌-ఒక అమూల్యకానుక: నేటి మానవ సమాజానికి షబేఖద్ర్‌ దైవం ప్రసాదించిన ఒక అమూల్యకానుక. ఒక అనిర్వచనీయమైన బహుమతి. ఆ కరుణామయుని దయారసం తన ప్రియప్రవక్త ముహమ్మద్‌(స) ద్వారా షబేఖద్ర్‌ రూపంలో అందజేయబడిన అనన్యసామాన్యమైన బహుమానం ఇది.

ఇలాంటి కానుక గతంలో ఏ ప్రవక్తల అనుచరులకూ ప్రసాదింపబడలేదు. ఈ రాత్రిన దివ్యఖుర్‌ఆన్‌ అవతరింపజేయ్యబడింది. ‘అవతరింప చెయ్యడం అంటే రెండు అర్థాలు కావచ్చు. ఒకటి ఆ రాత్రి పూర్తి ఖుర్‌నాని వహీ (దైవసందేశం) తీసుకువచ్చే దైవదూతలకు దైవం అప్పగించగా, సందర్భాలనుబట్టి 23 ఏళ్లలో కాలానుగుణంగా జిబ్రీల అలైహిస్సలామ్‌ అల్లాహ్‌ అనుమతితో దాని ఆయతులు, సూరాలు దైవసందేశహరులకు అవతరింపజేస్తూ వచ్చాడు. ఇక రెండో అర్ధం -ఖుర్‌ఆన్‌ అవతరణ ఈ రాత్రి నుండి ప్రారంభమైంది అన్నది. ఇంతకూ రెండు సందర్భాలలో తేదీ అర్థం ఒక్కటే. దైవసందేశహరులకు (ముహమ్మద్‌) (స) ఖుర్‌ఆన్‌ అవతరణ ఈ రాత్రే ప్రారంభమయింది. ఈ శుభరాత్రిలోనే ‘అలక్‌ సూరాలోని తొలి 5 వచనాలు అవతరించాయి. చేసిన, చేయబోయే పాపాలు తొలగిపోతాయి: ప్రవక్త మహనీయులు (స) ‘ఖద్ర్‌లో పూర్ణవిశ్వాసంతో, దైవం ప్రసాదించే ప్రతిఫలాన్ని ఆశించి ఆరాధనలకై నిలబడే వ్యక్తి చేసిన పాపాలన్నీ క్షమింపబడతాయి అన్నారు. ‘లైలతుల్‌ ఖద్ర్‌ వేయి నెలల కన్నా ఉత్తమమయినదని సెలవియ్యబడింది. సాధారణంగా మానవ్ఞలు చిన్నచిన్న పాపాలు చేస్తుంటారు.

1. నమాజ్‌లలో జరిగే పొరపాట్లు లేక తప్పులకు, ఆరాధనల్లో ఫర్జ్‌లు (విధులు), సున్నతులు (ప్రవక్త సంప్రదాయాలు), నఫిల్‌లు (ఐచ్ఛిక ఆరాధనలు) ఇతరులైన ఆరాధనల్లో జరుగు తప్పులకు ఈ రాత్రి ఏకాగ్రతతో ఆరాధిస్తే క్షమించబడతాయి. ఈ తప్పులకు తౌబా (పశ్చాత్తాపము), ఇస్తిగ్‌ఫార్‌ (మన్నింపు కోసం (ప్రార్థన) అవసరం లేకుండానే అల్లాహ్‌ క్షమిస్తాడు.

2. ఇతరుల వ్యక్తిగతమైన హక్కులు హరించినప్పుడు, దైవసంబంధమైన హక్కులు హఠించినప్పుడు తౌబా, ఇస్తిగ్‌ఫార్‌లు తప్పనిసరి. ఇవి లేకుండా ఎన్ని ఆరాధనలు చేసినా ఆ పాపాలు క్షమార్హం కావ్ఞ. బాధింపబడిన వ్యక్తికి క్షమాపణలు చెప్పి దైవానికి తౌబా, ఇస్తిగ్‌షార్‌లు చేసినచో క్షమార్హవౌతాయి. అలాంటివి ఈ రాత్రి వేడుకున్నచో క్షమించబడతాయి.

3. దైవసంబంధమైన ఏ హక్కును నిరాకరించావో ఆ హక్కును ప్రసాదించడం ద్వారా నీ పాపం క్షమించబడుతుంది. దీనంగా దైవం ఎదుట మోకరిల్లి అలాంటి తప్పులు మరెప్పుడు చేయనని క్షమాపణ కోరినప్పుడు మాత్రమే అవి క్షమింపబడతాయి. ఈ రాత్రి దైవదూతలు దైవకారుణ్య వర్షాన్ని కురిపిస్తాడు. జిబ్రీల్‌ అలైహిస్సలాం ఈ రాత్రి తమ సమూహంతో వస్తారు. ఆ రాత్రి ఆరాధనలను కూర్చుని, నిల్చొని నమాజులు చేసేవారిని, శక్తి లేనివారు ఏ పరిస్థితిలో ఆరాధించినా దైవం తన కరుణను వారిపై వర్షింపజేస్తాడు.

షబేఖద్ర్‌ ఫలానా రాత్రి అని ఇదమిత్థంగా తెలియదు. రమజాన్‌ నెల చివరి దశకంలోని చేసి రాత్రుల్లో వెదకమని ప్రవక్త (స) అన్నారు. 21,23,25,27,29 రాత్రులలో వెదకమని చెప్పారు మహనీయ ప్రవక్త (స). ఆ కరుణామయుని ప్రసన్నత కోసం అంకితభారంతో, అంతులేని తపనతో ఎన్ని రాత్రులు ఆరాధనలు చేసి పుణ్యఫలాలను ఏవిధంగానైనా సరే ఆస్వాదించవచ్చు.

– షేఖ్‌ అబ్దుల్‌హఖ్‌