త్వరపడి విమర్శించవద్దు..

           త్వరపడి విమర్శించవద్దు..

jesus
jesus

‘అటు తరువాత యేసు దేవాలయములో వానిని చూచి ఇదిగో స్వస్థతనొందితివి, మరి యెక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా (యోహాను 5:14). ఈ ఉదంతం గురించి మరింత లోతుగా చూడాలంటే 38 సంవత్సరాల నుంచి వ్యాధితో బాధపడుతూ ఏమాత్రం నడవలేనిస్థితిలో బాధపడుతున్నాడు ఒక వ్యక్తి. బేతెస్త అనే ఒక కోనేరు అక్కడ ఉంది. దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలిస్తే, ఆ సమయంలో ఎవరు మొదటగా ఆ నీటిలో దిగుతారో వారు ఎలాంటి రోగం ఉన్నా స్వస్థత పొందుతారు.

దీంతో ఇక్కడ రోగులు గుంపులుగుంపులుగా కూడి ఉన్నారు. 38 సంవత్సరాలుగా రోగంతో బాధపడుతూ, స్వస్థత పొందాలని ప్రయత్నిస్తున్న ప్రతిసారీ తనకంటే ముందుగా ఎవరో ఒకరు దిగేవారు. పైగా ఇతను నీటిలో మునగాలంటే ఎవరైనా సాయం చేయాలి. ఒక నిస్సహాయస్థితిలో బాగు కావాలనే ఆశ ఉన్నా సాయం చేసేవారు లేక, అలాగే రోగంతో మంచంపై పడి ఉన్నాడు. ఇలాంటి వ్యక్తిని యేసుప్రభువ్ఞ చూసి, బాగుచేశాడు. ఇతను దేవ్ఞడు అని ఈ వ్యక్తికి తెలియదు.

తర్వాత తెలుసుకున్నాడు. యేసు ఆ వ్యక్తితో ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపం చేయవద్దన్నాడు. ఈ వ్యక్తి రోగానికి కారణం పాపమని దీనిబట్టి మనకు అర్ధం అవ్ఞతుంది. యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టుగుడ్డివాడిని చూసి ప్రభువ్ఞ శిష్యులు యేసుప్రభువ్ఞను ‘వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా? అని ఆయనను అడుగగా, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదుగాని, దేవ్ఞని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను (యోహాను 9:1-3).

ఇక్కడ గుడ్డివాడుగా జన్మించేందుకు ఇతనుకానీ, ఇతని తల్లిదండ్రులుకానీ పాపం చేయలేదు. దేవ్ఞడి క్రియలు ఇతని ద్వారా ప్రత్యక్షపరచాలనే ఉద్దేశం దేవ్ఞడి సంకల్పం. కాబట్టి మనం త్వరపడి ఎవరినీ విమర్శించకూడదు, ఎవరికీ తీర్పు తీర్చకూడదు. ఎవరికైనా కష్టాలు, ఇబ్బందులు, రోగాలు, అనుకోని మరణాలు సంభవిస్తే వారు పాపం చేసారని, దేవ్ఞడికి వ్యతిరేకంగా పనులు చేసారని, అందుకే దేవ్ఞడి శిక్ష వీరిపై ఉందని మాట్లాడుతుంటారు. ఇది చాలా తప్పు.

వారు మనకు విరోధులు అయినా, మనల్ని విమర్శించినవారైనా, లేదా మనమంటే గిట్టనివారైనా సరే విమర్శించడం కానీ, తీర్పులు చెప్పడం కానీ అది మన పనికాదు. అది దేవ్ఞడి పని. త్వరపడి నోరుపారేసుకుని, దేవ్ఞడికి వ్యతిరేకంగా మాట్లాడం తప్పు. సిలువలో యేసుప్రభువ్ఞతోపాటు ఇద్దరు దొంగలకు కూడా సిలువ వేసారు. వీరిలో ఒకరు చివరి నిమిషంలో పశ్చాతాప్తం చెంది, రక్షించబడిన దొంగ. మరి ఇలాంటి వ్యక్తి గురించి మనం ఏమనుకుంటాం.

ఈ దొంగ ఎంత పాపం చేసాడో మనకు తెలియదు. కానీ చివరి క్షణంలో తన దోషాన్ని, పాపాన్ని ప్రభువ్ఞ వద్ద ఒప్పుకున్నాడు. క్షణంలో తన జీవితాన్ని మార్చుకున్నాడు. మనం ఇతని జీవితవిధానాన్ని చూసి, ఈ దొంగ నరకానికి పాత్రుడని వ్యాఖ్యానిస్తే ఎలా ఉంటుంది? ఇది అసత్యం కాదా? కాబట్టి మనం మన నోటిని జాగ్రత్తగా పెట్టుకోవాలి. మనమెప్పుడూ ఇతరులపట్ల దయా భావంతో ఉండాలి.

ప్రేమ, జాలి చూపాలే తప్ప, కక్షతో, ద్వేషభావంతో విమర్శలు చేయకూడదు. దేవ్ఞడే వారికి తీర్పరి, దేవ్ఞడే వారికి న్యాయాధిపతి. మనకు ఏమాత్రం అర్హత లేదు. దేవ్ఞడు మనల్ని ప్రేమిస్తున్నట్లుగా, దేవ్ఞడు మనల్ని క్షమిస్తున్నట్లుగా మనం కూడా ఇతరులను ప్రేమించాలి, క్షమించాలి. అట్టి కృపతో మనం ముందుకు సాగిపోదాం.