కర్మఫలం

ఒకసారి కశ్యపుడు యాగం చేయాలని సంకల్పించి ఆ యాగ నిర్వహణకు వరుణుని వద్దకు వెళ్లి వరుణ దేవా! లోకకళ్యాణం కోసం నేనొకయాగం చేస్తున్నాను. యాగానికి వచ్చిన అతిధి అభ్యాగతులు రుషివర్యులకు మొదలగు వారికి భోజన వసతులు కావాలి. అందుకు నీ వద్దనున్న కామధేనువును నాకివ్వు. ఆ యాగం పూర్తిచేసుకుని మరల నీ ధేనువును నీకు ఇస్తాను అన్నాడు. వరుణదేవుడు అలాగే మహర్షీ! ఇదిగో కామ ధేనువు, మీ పనికాగానే తెచ్చి నాకు ఇవ్వండి అంటూ కామధేనువును ఇచ్చాడు. కశ్యపుడు ఆ కామధేనువ్ఞ సాయంతో తన యజ్ఞం నెరవేర్చుకొన్నాడు. కాని, కామధేనువును తిరిగి ఇచ్చే విషయం తలపెట్టలేదు. ఒక నాడు వరుణదేవుడు వచ్చి మహర్షీ! యాగార్ధము కామధేనువును అడిగి తెచ్చుకున్నావు. నీ యాగం పూర్తయి చాలాకాలం అయింది. అయినా నా కామధేనువును తిరిగి ఇవ్వలేదు. ఇప్పుడైనా నా ధేనువును నాకు పంపించు అన్నాడు. కశ్యపుడు అలాగే ఇప్పుడే పంపుతాను నీవు వెళ్లు అని వరుణదేవుని పంపించాడు. కాని ఆవును ఇవ్వటం ఇష్టంలేక తన వద్దే ఉంచుకున్నాడు. మరోసారి వరుణుడు వచ్చి మహర్షీ! ఇదేమిటి ఇలా చేశావు. ఇదేమన్నా బాగుందా? నా ఆవును నాకు ఇవ్వకపోవటం నీకు ధర్మమా అన్నాడు కశ్యపుడు. వరుణ దేవా! అన్ని సౌఖ్యాలు ఉన్నాయి. ఎన్నో సంపదలున్నాయి. భోగభాగ్యాలు అనుభవిస్తున్నావు. ఇంకా ఈ కామ ధేనువు నీకు ఎందుకు? నా ఆశ్రమానికి ఎందరో అతిథి అభ్యాగతులు వస్తుంటారు. వారిని ఆదరించాలి. అందుకే ఈ ధేనువును నా వద్దే ఉంచుకున్నాను అన్నాడు. వరుణదేవుడు ఆగ్రహించి కశ్యపా! మాట తప్పావు. నా సొత్తు అయిన కామధేనువును అపహరించదల చావు. ఇది నీకు తగదు. దీని ఫలితంగా భూలోకంలో యదువంశంలో యాదవుడుగా జన్మించి ఆవులు కాస్తూ జీవించు. ఇది నా శాపం అంటూ వెళ్లిపోయాడు. కశ్యపమహర్షి చేసిన అన్యాయాన్ని గురించి బ్రహ్మకు కూడా చెప్పాడు. బ్రహ్మ ఆగ్రహించి, మహర్షీ వరుణుడికిచ్చిన మాట తప్పి అతని శాపానికి గురిఅయ్యావు. నీ కర్మ. కామధేనువు దూడలు కూడా పాలు కొరకు ఏడుస్తున్నాయి. అందువలన యాదవకులంలో ఉంటూ నీవు కన్న ఆరుగురు బిడ్డలను స్వయంగా నీ చేతులతో కసాయికి అర్పిస్తావు. అతడు నీ ఎదుటే ఆ బిడ్డలను నరుకు తుంటే చూచి పుత్రశోకంతో బాధపడతావు అని శాపం పెట్టాడు. కశ్యపునికి అదితి, దితి అను ఇద్దరు భార్యలు న్నారు. వారిలో పెద్దది అయిన అదితికి దేవేంద్రుడు జన్మించాడు. అతడు పెరిగి పెద్దవాడై సురలోకానికి అధిపతియై దేవతల రాజుగా ఉన్నాడు. ఒకనాడు చిన్న భార్య దితి భర్తను చేరి, తనకూ దేవేంద్రునితో సమా నమైన పుత్రుని అనుగ్రహించమని కోరింది. కశ్యపుడు, అలాగేనంటూ ఆమెకొక వ్రతాన్ని బోధించి నిష్టగా ఆ వ్రతం ఆచరిస్తూ పది సంవత్సరాలు గర్భం భరించగలిగితే నీకూ దేవేంద్రుని వంటి బిడ్డ పుడతాడు అన్నాడు. అలా భర్త ఆజ్ఞతో గర్భం ధరించి వ్రతం ఆచరిస్తూ నిష్టగా పవిత్రంగా ఉంటూ తనకు పుట్టబోయే బిడ్డను గూర్చి కలలు కంటూ ఉంటోంది దితి. అది విన్న అదితి తన సవతికి తన బిడ్డతో సమానమైన బిడ్డ పుట్టడం ఇష్టంలేక తన కుమారుడైన దేవేంద్రుని పిలిచి మహేంద్రా! నీ సవతి తల్లి గర్భం ధరించి ఉంది. ఆమె గర్భవాసాన నీతో సమానుడో లేక నీకంటే బలవంతుడో అయినవాడు పుట్టబోతున్నాడు. వ అందుకే ముందుగా జాగ్రత్త వహించి, ఆ బిడ్డను గర్భంలోనే వధించు అంది. మహేంద్రుడు సవతి తల్లి వద్దకు చేరి, అమ్మా! నాకు త్వరలో తమ్ముడు పుట్టబోతున్నాడని విన్నాను. వాడు నా అంతటి వాడో లేక నాకంటే గొప్పవాడో కావచ్చు అయినా నాకు సంతోషమే. నా తమ్ముని గర్భంలో భరిస్తూ నీవు ఎంతో శ్రమ పడుతున్నావు. నీ సేవ చేస్తూ నా తమ్ముడు పుట్టేవరకు ఇక్కడే ఉందామని వచ్చాను. నీ సేవకు అనుమతించు తల్లీ అన్నాడు. దితి, అలాగే నాయనా! నీ తమ్ముడు పుట్టేవరకు ఇక్కడే ఉండి నీ ముచ్చట తీర్చుకో అంది. అలా దేవేంద్రుడు దితి మందిరంలో ఉంటూ ఆమె ఆదమరచి నిద్రిస్తున్న సమయంలో సూక్ష్మరూపంలో గర్భంలో ప్రవేశించి ఆ శిశువును ముందు ఏడుముక్కలు, తిరిగి ఆ ముక్కలను ఏడేసి ముక్కలుగా ఖండించి వేశాడు.  మారుద ఏడవకు అంటూ ఖండించి వేశాడు. దితి  ఘోరం తెలుసుకుని ఏడుస్తూ దుర్మార్గుడా! నమ్మకద్రోహి ఎంత పనిచేశావు. నా బిడ్డను చంపే శావు. దేవేంద్రుడు అమ్మా! చింతించకు నీ బిడ్డ నలభై తొమ్మిది మంది బిడ్డలుగా మారి మరత్తులని పిలువబడుతూ నాలాగే దేవతలుగా మారి, నాతోపాటే భోగాలు అనుభవిస్తూ నాకు మిత్రులుగా స్వర్గంలోనే ఉంటారు అంటూ వెళ్లిపోయాడు.
          – ఉలాపు బాలకేశవులు