అజ్ఞాన అహంకారం

paandavulu

అజ్ఞాన అహంకారం

తన తండ్రి ద్రోణాచార్యుల వారిని అధర్మంగ చంపారని పాండవ్ఞలపై అశ్వత్థామకు విపరీతమైన కోపం వచ్చింది. దేవతలకు కూడా సహింపరాని ఆగ్నేయాస్త్రాన్ని అభిమంత్రించి ప్రయోగించాడు. భూమిపై నున్న పశుపక్ష్యాదులు, జలాశయాలలోని జలచరాలు కూడా తల్లడిల్లిపోయాయి. ప్రళయాగ్ని వలెనున్న ఆ అస్త్రముచే పాండవ సైన్యమంతా దహింపబడింది. ఆకాశంలో చీకట్లు కమ్మాయి. అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. రెండు గడియల్లో కప్పుకొన్న చీకట్లు మటుమాయమయ్యాయి. కృష్ణార్జునులు క్షేమంగా ఉండటాన్ని చూశాడు అశ్వత్థామ. అతనికి దిక్కుతోచలేదు. చింతాక్రాంతుడై వేడి నిట్టూర్పులు విడిచాడు. మతిచెడి ధనుస్సును క్రిందపడేసి, రథాన్ని దిగి ఛీ!ఛీ! ఇది అంతా మిథ్య అని అంటూ త్వరగా యుద్ధభూమి నుంచి బయటికి వెళ్లిపోయాడు. వేదవ్యాసుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. అశ్వత్థామ ఆయనకు నమస్కరించి ఎంతో దిగులుపడుతూ మెల్లగా ఆయనతో ఇలా అన్నాడు-”ఓ మహానుభావా! ఇది అంతామాయనా? అస్త్రము మిథ్యనా? నా పొరపాటేమి? అసుర గంధర్వపిశాచ రాక్షసనాగ గరుడులలో ఎవ్వరు గాని, మానవ్ఞలు గాని నేను ప్రయోగించిన ఈ ఆగ్నేయాస్త్రాన్ని వ్యర్థము చేయలేరు.

ఇది సకల జన విఘాతుకమూ కానీ కృష్ణార్జులను ఏల వధించలేకపోయింది? ఓ భగవానుడా? నా సందేహాన్ని దయచేసి తీర్చు! అప్పుడు అశ్వత్థామతో వ్యాసుడు, ”ఓ ద్రోణపుత్రా! నారాయణుడు పూర్వులకెల్ల పూర్వుడు, విశ్వకర్త, తన మాయచే జగమును మోహపెట్టేవాడు. ఆతడే తన తపస్సుచే మహాయునియగు నరుని జనింప చేశాడు. దేవతల్లో పరమ ప్రసిద్ధులైన వారిద్దరే ఈ కృష్ణార్జునులు. వీరు ప్రతియుగమున జన్మిస్తుంటారు. ఈ కృష్ణుని యందు ఆత్మయోగములు, శాస్త్రయోగములు స్థిరములై ఉన్నాయి. ఈతనివే సిద్ధులు, పరమబుషులు, దేవతలు ప్రార్థిస్తారు. పూజిస్తారు. సనాతనుడగు కృష్ణుడే యజ్ఞములచే యజింపదగినవాడు. ఈయన్ను సర్వభూతమయునిగా తెలిసికొని నడచుకోవాలి. ఈ కృష్ణార్జునులు సాధారణ మానవ్ఞలు కారు, అని చెప్పాడు.

ఈ మాటలను వినిన అశ్వత్థామ వ్యాసభగవానునికి నమస్కరించి అంతటితో యుద్ధాన్ని చేయటం మానివేశాడు. ఆ తర్వాత వ్యాసభగవానుడు అర్జునునకు ప్రత్యక్షమయ్యాడు. అర్జునుడు ఆయనతో, ”ఓ మహామునీ! ఈ యుద్ధమున నేను తీవ్రములగు సాయకములచే వైరులను వధించితిని. అపుడొక పురుషుడు పావక ప్రభుడై శూలమును పైకెత్తి నా యెదుట నడచుచుండుటను చూచితిని. ఆతడే దిశకు పోవ్ఞచుండెనో అందులకే నా వైరులు పోవ్ఞచు కానవచ్చిరి. ఆతనిచే భగ్నులైన వైరులనెల్ల నాచే వధింపబడిరని జనము తలంచుచున్నది. ఆతడే సైన్యములను చంపుచుండగా ఆతని వెనుక నుండి ఆతనికి వారినిచ్చుచున్నవాడను. ఓ మహాత్మా! ఆ పురుషవర్యుడెవడో నాకెఱిగింపుము. సూర్యసన్నిభుడగు శూలపాణిని నేను గాంచితిని. అతడు పుడమిపై నడుగుపెట్టక, శూలము విడు వకయుండెను. అతని తేజముచే ఒక శూలమును వేయి శూలములు పడుట చూచితిని,అని అన్నాడు. అప్పుడు వ్యాసుడు అర్జునునితో, ”ఓ అర్జునా! నీవ్ఞ ప్రజాపతులకు ప్రథముడును, తేజోరూపియు, పురుషుడును, ప్రభుడును, భూర్భూభువనరూపుడును, సర్వలోకేశ్వరుడును, దేవ్ఞడు, నీశానుడు వరదుడు అగు శంకరుని గాంచితిని. ”ఓ అర్జునా! మహారథులై ప్రహరించు కర్ణ కృపాశ్వాత్థామలచే రక్షితమగుచున్న ఆ సైన్యమున అతడు గాక వేఱెవ్వడట్టు చరించును? (పేజీలు 909, 910, ద్రోణపర్వము). అతడే రుద్రుడు, అతడే శివ్ఞడు, సకలమతడే. అతడే సర్వవేత్త. ఇంద్రుడు, వాయువ్ఞ, అశ్వినులు, మెఱుపులు ఆతడే. భవ్ఞడు, పర్జన్యుడు, మహాదేవ్ఞడు ఆతడే. థాతయు, విధాతయు, విశ్వాత్ముడును, విశ్వకర్మకర్తయు ఆతడే. ఓ పాండు నందనా! అవిచ్ఛి న్నముగా వేయేండ్లకైనా ఆతని గుణములు వర్ణింపబడవ్ఞ. ఓ పార్థా! మహాదేవ్ఞడగు ఇతడే సంగ్రామమున నీ యెదుట వైరుల నడంచుచు, పినాకధారియై కానవచ్చెను. ఓ కౌంతేయా! వెళ్లు, యుద్ధము చెయ్యి, నీకు పరాజయము కలుగదు. నీకు మంత్రియు రక్షకుడునై ఈ జనార్దనుడు నీ ప్రక్కనున్నవాడుఅని తెలిపాడు. మహాభారతములోని ద్రోణపర్వములో కనపడుతుంది ఈ విషయమంతా.

ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు అశ్వత్థామ, అర్జునుడు. తన వద్దనున్న దివ్యాస్త్రాలతో శత్రువ్ఞలను వధించి తన ప్రతిజ్ఞను నెరవేర్చుకోగల సామర్థ్యం తనకున్నదని స్వశక్తిని గూర్చి అహంకరించాడు అశ్వత్థామ. తాను అనుకొన్నట్టు జరుగకపోయేసరికి నిరాశకు లోనయ్యాడు. కృష్ణార్జునుల నిజరూపమేమిటో గ్రహించలేకపోయాడు. అదీ శ్రీకృష్ణుడు రాయబారము కొరకు వచ్చి కురుసభలో విశ్వరూపాన్ని ప్రదర్శించిన తరువాత కూడా, వేదవ్యాసుని బోద ఆతని కళ్లను తెరిపించింది. ఇకపోతే అర్జునుడు అన్ని రోజుల యుద్ధంలో ఎంతోమంది యోధానుయోధులను చంపిన తర్వాత కూడా చంపినది తాను కాదని, ఏదో ఒక అతీతశక్తి చేతిలో తానొక పనిముట్టు మాత్రమేనన్న స్పృహ అతనికుంది. ఆ అభిప్రాయాన్ని దృఢపరచింది వ్యాసుని బోధ. నిజానికి బ్రాహ్మణుడైన అశ్వత్థామకు, వేదజ్ఞానము గల అశ్వత్థామకు ఉండి ఉండవలసింది ఆ ఎఱుక. కానీ ఆయనకున్నది కేవలం పాండిత్యమే. పరోక్షజ్ఞానమే కాబట్టి అలా జరిగింది. ఇక అర్జునునకున్నది పరోక్షజ్ఞానము కాదు, ప్రత్యక్ష జ్ఞానమే. అందుకే ఆ అనుభవము. ఆచరణ. ఈ రెండే ముఖ్యమంటారు మహనీయులందరు.

– రాచమడుగు శ్రీనివాసులు