డిగ్రీలు ముఖ్యం కాదు నైపుణ్యం కావాలి

నైపుణ్యం ఉంటేనే ఏరంగంలోనైనా రాణింపు

Career–

ఎన్ని డిగ్రీలు ఉన్నాయనేది ముఖ్యం కాదు. లేకపోతే ఎంత అనుభవం ఉందనేది కాదు. నైపుణ్యం ఉంటేనే ఏరంగంలోనైనా రాణించగలరు. కేవలం డిగ్రీలు ఉంటేనే ఉద్యోగం వస్తుందనే రోజులు పోయాయి. ఏ కంపెనీ అయినా ప్రాక్టికల్‌ నైపుణ్యాలకే ప్రాధాన్యతనిస్తున్నాయి. పోటీప్రపంచంలో కంపెనీలు లాభాల బాట పట్టాలంటే అందుకు నైపుణ్యంతోనే రాణించగలవ్ఞ. అందుకే వినూత్నంగా ఆలోచించే వారికే కొలువులు కట్టబెడుతున్నాయి. ముఖ్యంగా బిటెక్‌/ఎంబిఎ/ డిప్లొమా/ ఐటిఐ కోర్సుల విద్యార్థులకు నైపుణ్యాలుంటేనే ఉపాధి లభిస్తుంది. దీంతో ఆయా విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌, అప్రెంటీస్‌షిప్‌లు తప్పనిసరిగా మారాయి.

ఇంటర్న్‌షిప్‌ తొలిఅడుగు: ఇంటర్న్‌షిప్‌ను విద్య, ఉద్యోగ అవకాశాలు పొందే దిశగా తొలి అడుగని భావించొచ్చు. ఆయారంగాలు, విభాగాల్లో వాస్తవిక నైపుణ్యాలను సొంతం చేసుకునేందుకు మార్గం. ఇంటర్న్‌షిప్‌, బిటెక్‌, ఎంబిఎ అర్హతలతో జరిగే నియామకాల్లో ప్రాక్టికల్‌ వర్క్‌, ఎక్స్‌పిరియెన్స్‌, ప్రాజెక్టు వర్క్‌లను పరిగణనలోకి తీసుకుంటారు. ఇంటర్న్‌షిప్‌ సదరు నైపుణ్యాలను అందిస్తుంది. ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేయడం వల్ల విద్యార్థులతోపాటు సంస్థలకు ప్రయోజనం చేకూరుతుంది.

వీటి లక్ష్యాలు ఏంటి?

పరిశ్రమ వాతావరణంపై టెక్నికల్‌ కోర్సుల విద్యార్థులకు అవగాహన కల్పించడం.
వాస్తవ పరిస్థితుల్లో టెక్నాలజీ ఉపయోగంతోపాటు నిర్వహణ నైపుణ్యాలను నేర్చుకునేలా శిక్షణ ఇవ్వడం.
నూతన సాంకేతిక పద్ధతులను విద్యార్థులకు పరిచయం చేయడం.
తరగతి గదుల్లో నేర్చుకున్న విజ్ఞానాన్ని అన్వయించేందుకు వీలు కల్పించడం.
నివేదికల రూపకల్పనా నైపుణ్యాలను పెంపొందించడం
ఇంజనీర్‌ నిధులు, విలువల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించడం.

ప్రయోజనాలెన్నో..: –

సంబంధిత పరిశ్రమల్లో ఉద్యోగాలు అందుకొనే అవకాశం దక్కుతుంది.
సంస్థ వ్యవస్థీకృత నిర్మాణంపై వాస్తవిక అవగాహన ఏర్పడుతుంది.
అకడెమిక్‌ అంశాలను ప్రాక్టికల్‌గా పరీక్షించే వీలు లభిస్తుంది.
టీమ్‌ వర్క్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ మెరుగవుతాయి.
ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేయడం రెజ్యూమెలో అదనపు అర్హతగా మారుతుంది.

ఎంపిక చేసేవిధానం:

ప్రతి ఇన్‌స్టిట్యూట్‌లో ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ సెల్‌ ఉంటుంది. ఇది రెండు, నాలుగు, అరు/ ఏడు సెమిస్టర్ల అనంతరం విద్యార్థులకు కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు కల్పిస్తుంది. ఇందులో భాగంగా వేసవిలో నాలుగు నుంచి ఆరువారాల వ్యవధిలో ఇంటర్న్‌షిప్‌ ట్రైనింగ్‌ కోసం ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ సెల్‌ నుంచి పరిశ్రమలకు రెక్వెస్ట్‌ లెటర్‌/ఇ-మెయిల్‌ వెళ్తుంది. దానికి సమాధానంగా సదరు పరిశ్రమ ఎంతమందికి ఇంటర్న్‌ ట్రైనింగ్‌ కల్పించగలమో పేర్కొంటూ కన్ఫర్మేషన్‌ లెటర్‌/ ఇ-మెయిల్‌ పంపిస్తుంది. అందుబాటులోని అవకాశాలను దృష్టిలో పెట్టుకొని క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ ఆయా పరిశ్రమలకు విద్యార్థులను కేటాయిస్తారు. అనంతరం విద్యార్థులు సదరు కంపెనీలో ఇంటర్న్‌షిప్‌ శిక్షణలో పాల్గొంటారు. ట్రైనింగ్‌ పూర్తయిన తర్వాత విద్యార్థులు రిపోర్టు సమర్పించి పరిశ్రమ నుంచి సర్టిఫికెట్‌ను అందుకుంటారు. విజయవంతంగా ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసుకున్న విద్యార్థుల జాబితాను ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ సెల్‌ జారీ చేస్తుంది. ఇన్‌స్టిట్యూట్‌ తరపునే కాకుండా విద్యార్థులు స్వీయ మార్గాల్లోనూ ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు అందుకోవచ్చు.

ఇంటర్న్‌షిప్‌ పోర్టల్స్‌, వెబ్‌సైట్స్‌లో ఇంటర్న్‌షిప్‌ ఖాళీల వివరాలు అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు తమ అర్హతలను ఆయా వెబ్‌సైట్లలో నమోదు చేసుకోవడం ద్వారా ఇంటర్న్‌షిప్‌ దక్కించుకోవచ్చు. వీటితోపాటు జాబ్‌పోర్టల్స్‌, కంపెనీ వెబ్‌సైట్‌ల ద్వారా ఇంటర్న్‌షిప్‌ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. మేక్‌ ఇంటర్న్‌, ఇంటర్న్‌శాలా, బలెట్స్‌ ఇంటెర్న్‌, లింక్టిస్‌, గ్లాస్‌డోర్‌, బహలో ఇంటెర్న్‌, ఇండియన్‌ ఇంటర్న్‌షిప్‌ వంటి వాటి ద్వారా అవకాశాల గురించి తెలుసుకోవచ్చు.
అప్రెంటీస్‌షిప్‌: ఐటిఐ, డిప్లొమా కోర్సుల విద్యార్థులకు అప్రెంటీస్‌షిప్‌ మేలు చేస్తుంది. ఆయా కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థులు అప్రెంటీస్‌ అవకాశాలు అందుకోవచ్చు. ప్రభుత్వపరంగానూ అప్రెంటీస్‌షిప్‌ మార్గాలు అందుబాటులోకి వస్తున్నాయి.

ఏఏ రంగాల్లో ప్రాధాన్యత ?:

ఆటోమొబైల్‌, ఫార్మా, అగ్రికల్చర్‌, ఐటి, ఐటిఈఎస్‌, ఎలక్ట్రానిక్స్‌, మాన్యుఫ్యాక్చరింగ్‌ రంగాల్లో అప్రెంటీస్‌ అవకాశాలు లభిస్తున్నాయి. ప్రధానంగా అగ్రికల్చర్‌ ఫీల్ట్‌ అసిస్టెంట్‌, ఫార్మా రంగంలో ప్రొడక్ట్‌ లైన్‌ మేనేజర్‌, రీసెర్చ్‌ అసెస్‌మెంట్‌ అప్రెంటీస్‌లకు డిమాండ్‌ ఉంది. వీటితోపాటు రిటైల్‌ , మాన్యుఫ్యాక్చరింగ్‌, లాజిస్టిక్స్‌, బిఎఫ్‌ఎస్‌ఐ, ఎఫ్‌ఎంసిజీ రంగాల్లో అప్రెంటీస్‌షిప్‌ ప్రాధాన్యం దక్కనుంది.

చట్టబద్దం:

పరిశ్రమల్లో అప్రెంటేస్‌షిప్‌ను చట్టబద్ధం చేస్తూ కేంద్రం అప్రెంటీస్‌ చట్టం -1961 తీసుకొచ్చింది. అనంతరం 2014లో ఆ చట్టానికి సవరణలు చేసి అప్రెంటీస్‌షిప్‌పై ట్రేడ్‌, యూనిట్‌ల వారీగా ఉన్న నియంత్రణలను తొలగించింది. కంపెనీ లేదా పరిశ్రమలో మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 2.5శాతం నుంచి 10 శాతానికి సమాన స్థాయిలో అప్రెంటీస్‌లు ఉండాలని నిర్దేశించింది. దీంతోపాటు ఆప్షనల్‌ ట్రేడ్‌లను ప్రవేశపెట్టింది.

నేషనల్‌ అప్రెంట్రేస్‌షిప్‌ ప్రమోషనల్‌ స్కీమ్‌ (ఎన్‌ఎపిఎస్‌) కింద 2019-20లో 20 లక్షల మందికి అప్రెంటీస్‌షిప్‌ శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విద్యార్థులు ఎన్‌ఎపిఎస్‌ కింద అప్రెంటీస్‌షిప్‌ అవకాశాన్ని దక్కించుకోవచ్చు.
అభ్యర్థులు ముందుగా రీజనల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ అప్రెంటిస్‌షిప్‌ ట్రైనింగ్‌ (ఆర్‌డిఎటి) వెబ్‌సైట్‌కు లాగిన్‌ అయి దరఖాస్తు చేసుకోవాలి.
ఆర్‌డిఎటి అభ్యర్థుల దరఖాస్తులను పరిశ్రమలకు పంపిస్తుంది.
పరిశ్రమలు ఆన్‌లైన్‌ ద్వారా అభ్యర్థుల అప్రెంటీస్‌షిప్‌ ఒప్పందానికి సంబంధించిన ప్రక్రియ పూర్తవుతుంది.
బేసిక్‌ ట్రైనింగ్‌ ప్రొవైడర్‌ ఎంపిక జరుగుతుంది.

దీనికి కావాల్సిన అర్హతలు:

ఐటిఐ/ఐటిఐ ‘డ్యూయల్‌ లెర్నింగ్‌ మోడ్‌, పిఎంకెవివై/ ఎంఈఎస్‌-ఎస్‌డిఐ కోర్సులు, గ్రాడ్యుయేట్లు/ డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు (లేదా) 10+2 వొకేషనల్‌ సర్టిఫికెట్‌ పొందిన అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు.

శిక్షణ కాలం :

ఐటిఐ ఉత్తీర్ణులకు అప్రెంటీస్‌ 1-2 ఏళ్లు ఉంటుంది. అలాగే పిఎంకెవివై కోర్సులు/ ఎంఈఎస్‌-ఎస్‌డిఐ/ ఇతర ప్రభుత్వ గుర్తింపు కలిగిన కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు 1-2 ఏళ్లు శిక్షణ ఇస్తారు. అదేవిధంగా గ్రాడ్యు/ డిప్లొమా, ఇంజినీరింగ్‌, మెడికల్‌, పారామెడికల్‌ స్ట్రీముల్లో గ్రాడ్యుయేట్‌ (లేదా) డిప్లొమా కోర్సుల అభ్యర్థులకు 1-2 ఏళ్లు ట్రైనింగ్‌ ఉంటుంది. గ్రాడ్యుయేట్‌ డిప్లొమా/ 10+2 ఒకేషనల్‌ సర్టిఫికెట్‌ హోల్డర్లు/ బిఎస్సీ/ బికామ్‌/ ఎల్‌ఎల్‌బి తదితర కోర్సులు పూర్తి చేసిన వారికి ఒక ఏడాదిపాటు శిక్షణ అందిస్తారు.

అప్రెంటీస్‌షిప్‌ ట్రైనింగ్‌ స్కీమ్‌:

ఈ స్కీమ్‌ కింద డిజిగ్నేటెడ్‌, ఆప్షనల్‌ ట్రేడ్‌లలో అప్రెంటీస్‌షిప్‌లు అందిస్తున్నారు. ప్రభుత్వం ధ్రువీకరించిన వృత్తి లేదా ట్రేడ్‌లను డిజిగ్నేటెడ్‌ ట్రేడ్‌లు అంటారు. పరిశ్రమలు లేదా కంపెనీలు అప్రెంటీస్‌షిప్‌ ప్రోగ్రామ్‌ అందించేందుకు నిర్ణయించిన ట్రేడ్‌లను, వృత్తులను ఆప్షనల్‌ ట్రేడ్‌లుగా పిలుస్తారు.

సర్టిఫికేషన్‌లు:

నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఒకేషనల్‌ ట్రైనింగ్‌ (ఎన్‌సివిటీ) ఏటా రెండుసార్లు ఆలిండియా ట్రేడ్‌ టెస్ట్‌ (ఎఐటిటి) నిర్వహిస్తుంది. ఎఐటిటి అక్టోబర్‌/నవంబరు, ఏప్రిల్‌/మే నెలల్లో జరుగుతుంది. ఇందులో ఉత్తీర్ణులైన వారికి నేషనల్‌ అప్రెంటీస్‌షిప్‌ సర్టిఫికెట్స్‌ (ఎన్‌ఎసీ) ప్రదానం చేస్తారు. ప్రభుత్వ, ప్రభుత్వ భాగస్వామ్య సంస్థలు, కంపెనీల్లోని ఉద్యోగాల భర్తీలో ఎన్‌ఎసి సర్టిఫికెట్‌కు ప్రాధాన్యం ఇస్తారు. ప్రభుత్వం 261 ట్రేడ్‌లను గుర్తించింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/