ఒటిటి రంగంలో కొలువులు

ఒటిటి ఒవర్‌ ది టాప్‌! ఇది వీక్షకుల ముందుకు వచ్చిన వినూత్న సాంకేతికత. డిజిటల్‌ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీతో వీక్షకులను ఆహ్లాదపరిచేలా, ప్రసారాల మధ్యలో అంతరాయాలు లేకుండా ప్రోగ్రామ్స్‌ వీడియోలు అందిస్తున్న ప్లాట్‌ఫామ్‌ ఒటిటి. ఇది వీక్షకులు తమకు నచ్చిన ప్రోగ్రామ్‌లను మెచ్చిన సమయంలో చూసేందుకు అవకాశం కల్పిస్తోంది. స్మార్ట్‌ఫోన్స్‌, యాప్స్‌ విప్లవం నేపధ్యంలో ఒటిటికి రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది.

jobs in OTT field

అందుకు తగ్గట్టే కంటెంట్‌ రూపకల్పన నుంచి క్లౌడ్‌ సర్వీసెస్‌ వరకు పలు విభాగాల్లో కొలువులకు వేదికగా మారుతోంది. ఒటిటి. ఈ నేపధ్యంలో అసలు ఓటిటి ప్లాట్‌ఫామ్‌ అంటే ఏంటి వీక్షకుల్లో ఆదరణకు కారణాలు..అందుబాటులోకి వస్తున్న ఉద్యోగావకాశాలు, ఉపాధి మార్గాలపై ప్రత్యేక కథనం. కేబుల్‌ టివి/ డిటిహెచ్‌..శాటిలైట్‌ ఛానెల్స్‌ ద్వారా ప్రసారమయ్యే ప్రోగ్రామ్‌లను వీక్షించేందుకు అందుబాటులో ఉన్న మార్గాలు. ఏదైనా ఒక ప్రోగ్రామ్‌ లేదా సీరియల్‌ను వీక్షించాలంటే వాటిని సదరు ఛానెల్‌ ప్రసారం చేసి సమయంలోనే చూడాల్సి ఉంటుంది.

ఇందులోనూ ఎన్నో పరిమితులు. అరగంట ప్రోగ్రామ్‌లో ఏడెనిమిది నిమిషాలు యాడ్స్‌. దీంతో వీక్షకుల్లో అసహనం. దీనికి పరిష్కారంగా అందుబాటులోకి వచ్చిన వినూత్న విధానమే ‘ఓవర్‌ ది టాప్‌ (ఒటిటి) ప్లాట్‌ఫామ్‌. ప్రస్తుతం ఒటిటి ప్లాట్‌ఫామ్‌ పట్ల టివి వీక్షకుల్లో ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా మెట్రోనగరాలు, స్మార్ట్‌ ఫోన్స్‌, మొబైల్‌ యాప్స్‌ను వినియోగించే వారు..సంప్రదాయ కేబుల్‌ కనెక్షన్స్‌ నుంచి ఒటిటి ప్లాట్‌ఫామ్‌వైపు కదులుతున్నారు.

స్మార్ట్‌ఫోన్స్‌తోనే కాకుండా..డెస్క్‌టాప్‌ కంప్యూటర్స్‌తోనూ ఒటిటి ఫ్లాట్‌ఫామ్‌ ద్వారా ప్రోగ్రామ్‌లను వీక్షించే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగానే ప్రస్తుతం హాట్‌స్టార్‌, నెట్‌ఫ్లిక్స, అమెజాన్‌ ప్రైమ్‌ వంటి సంస్థలు ఒటిటి సేవలు అందిస్తున్నాయి. వీటిలో సినిమాలు, సీరియళ్లు, స్పోర్ట్స్‌, లేటెస్ట్‌ న్యూస్‌ అప్‌డేట్స్‌..ఇలా ఎన్నో వినోద కార్యక్రమాల నుంచి బ్రేకింగ్‌ న్యూస్‌ వరకు లైవ్‌లో వీక్షించే అవకాశం ఉంది. ఒటిటి రంగం భారత్‌లో శరవేగంగా వృద్ధి చెందుతోందని పలు సంస్థలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రముఖ కన్సల్టింగ్‌ సంస్థ పీడబ్ల్యూసి అంచనా ప్రకారం-2022 నాటికి టాప్‌-10 గ్లోబల్‌ వీడియో మార్కెట్స్‌ జాబితాలో భారత్‌ చోటు సాధిస్తుంది.

దాదాపు 5.5 వేలకోట్ల రాబడి ఒటిటి మార్కెట్‌ ద్వారా లభించనుంది. అదేవిధంగా మరో ప్రముఖ కన్సల్టింగ్‌ సంస్థ డెలాయిట్‌ నివేదిక ప్రకారం-2021 నాటికి ఇంగ్లిష్‌ ఇంటర్నెట్‌ యూజర్ల సంఖ్య ప్రస్తుత సంఖ్యతో పోల్చితే రెండున్నర రెట్లు పెరుగుతుంది. ఆ మేరకు ఒటిటి వీడియోలకు కూడా డిమాండ్‌ అధికమవుతుందని పేర్కొంది.

ఒటిటి మార్కెట్‌లో ఉద్యోగావకాశాలు ఎలా లభిస్తాయి అనే సందేహం కలగడం సహజం. ప్రస్తుతం దేశంలో ఒటిటి విధానంలో కార్యక్రమాలను అందిస్తున్న అధికశాతం సంస్థలు. ఒప్పందం ద్వారా ఆయా కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాయి.

ఇదే సమయంలో వీక్షకులను ఆకర్షించేందుకు ఒటిటి ప్రొవైడర్‌ సంస్థలు సొంతంగా వెబ్‌సిరీస్‌లను అందిస్తున్నాయి. ఉదాహరణకు ఇప్పటికే నెట్‌ప్లిక్స్‌ సంస్థ రూపొందించిన సీక్రెడ్‌ గేమ్స్‌, ఎంఎక్స్‌ ప్లేయర్‌ అందిస్నున్న క్వీన్‌వెబ్‌ సీరిస్‌. ఇలా ఒటిటి సంస్థలు సొంతంగా, ఇతర సంస్థలతో ఒప్పందాల ద్వారా కార్యక్రమాలను అందిస్తుండం యువతకు ఉద్యోగావకాశాలకు మార్గంగా నిలుస్తోంది.

కంటెంట్‌ టు క్లౌడ్‌ టెక్నాలజీ:

ఒటిటి ప్లాట్‌ఫామ్‌, అందులోని ప్రొవైడర్స్‌ అందిస్తున్నసేవలను పరిగణనలోకి తీసుకుంటే కంటెంట్‌ క్రియేషన్‌ నుంచి క్లౌడ్‌ టెక్నాలజీ వంటి సాంకేతిక విభాగాల వరకు ఉద్యోగావకాశాలు వేల సంఖ్యలోనే. సొంతంగా వెబ్‌ సీరిస్‌లను రూపొందించే క్రమంలో కంటెంట్‌ రైట ర్స్‌, కంటెంట్‌ హెడ్‌, కంటెంట్‌ ప్రొడ్యూసర్‌, డిజిటల్‌ మీడియా మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌, సోషల్‌ మీడియా స్పెషలిస్ట్‌ వంటి నాన్‌-టెక్నికల్‌ ఉద్యోగాలు లభిస్తున్నాయి. టెక్నికల్‌ విభాగంలో ఆండ్రాయిడ్‌ ఇంజనీర్స్‌, బిజినెస్‌ అనలిస్ట్‌, క్లౌడ్‌ ఇంజనీర్‌, ఆర్‌ఒఆర్‌ వెబ్‌ డెవలపర్‌, ప్రొడక్ట్‌ మేనేజర్‌, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ ఇంజనీర్‌ వంటి కొలువులు దక్కించుకోవచ్చు.

ఆకర్షణీయ వేతనాలు:

ఒటిటి ప్రొవైడర్‌ సంస్థలు ఆయా విభాగాల్లో ఉద్యోగాలకు ఆకర్షణీయ వేతనాలు అందిస్తున్నాయి. కంటెంట్‌ క్రియేషన్‌ సంబంధిత నాన్‌-టెక్నికల్‌ విభాగాల్లో సగటున రూ.4 లక్షల నుంచి రూ.5లక్షల వార్షిక వేతనం లభిస్తోంది. టెక్నికల్‌ విభాగాల్లో నైపుణ్యాలున్న వారికి రూ.9లక్షల వరకు వార్షిక వేతనం అందుతోంది.

ఒటిటి యాడ్‌ విభాగం:

ఒటిటి ప్లాట్‌ఫామ్‌లో యాడ్‌ విభాగంలోనూ ఉద్యోగాలు లభిస్తున్నాయి. నిర్దిష్టంగా ఒక కార్యక్రమం ప్రసారం అవుతున్న సమయంలో తెరపై కనిపించే యాడ్స్‌ ద్వారా సంస్థలు ప్రత్యేక ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయి. ఈ యాడ్స్‌ విభాగంలోనూ ఉద్యోగావకాశాలు పొందొచ్చు. ప్రధానంగా నెట్‌వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌, డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌ మేనేజర్స్‌ వంటి జాబ్స్‌ అందుబాటులో ఉన్నాయి.

ఒటిటి ప్లాట్‌ఫామ్‌ విభాగంలో సొంతంగానూ సంపాదించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా షార్ట్‌ ఫిల్మ్‌ నిర్మాతలు తాము రూపొందించిన ఫిల్మ్‌ను ఆయా ఒటిటి ప్రొవైడర్స్‌కు విక్రయించి ఆదాయం పొందొచ్చు.

ప్రస్తుతం మనదేశంలో ఈ తరహాలో సంపాదించాలంటే కంటెంట్‌ అగ్రిగేటర్స్‌ లేదా డిస్ట్రిబ్యూటర్స్‌ను కలవాలి. ఆ తర్వాత దశలో వీటిని తమ ఒటిటి ప్రొవైడర్‌కు అందిస్తాయి. సదరు కంటెంట్‌కు వచ్చిన ప్రకటనలను బట్టి నిర్దిష్ట మొత్తంలో మరో రూపంలోనూ ఆదాయం లభిస్తుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/